పొదరిళ్లకు... అందాల సలహాదారులు!

దేశదేశాలు తిరిగినా, ప్రపంచాన్ని చుట్టినా.. ‘మన ఇల్లు’ అన్న భావనే వేరు. మనం మనలా ఉండే... అనుబంధాలను ఆత్మీయతలను పంచుకునే చోటది. అందుకే మన పొదరింటిని చక్కగా అమర్చుకోవాలని తాపత్రయ పడతాం. ఎప్పటికప్పుడు హంగులద్దుతుంటాం. లేకపోతే ఉన్నంతలోనే కొత్తదనాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటాం... సరిగ్గా ఇక్కడే మేమున్నామంటున్నారు ఇంటీరియర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు. లక్షలమంది మనసుల్ని కొల్లగొడుతున్న వీరెవరో, ఏం చెబుతున్నారో చూడండి...

Published : 04 Jun 2022 01:16 IST

దేశదేశాలు తిరిగినా, ప్రపంచాన్ని చుట్టినా.. ‘మన ఇల్లు’ అన్న భావనే వేరు. మనం మనలా ఉండే... అనుబంధాలను ఆత్మీయతలను పంచుకునే చోటది. అందుకే మన పొదరింటిని చక్కగా అమర్చుకోవాలని తాపత్రయ పడతాం. ఎప్పటికప్పుడు హంగులద్దుతుంటాం. లేకపోతే ఉన్నంతలోనే కొత్తదనాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటాం... సరిగ్గా ఇక్కడే మేమున్నామంటున్నారు ఇంటీరియర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు. లక్షలమంది మనసుల్ని కొల్లగొడుతున్న వీరెవరో, ఏం చెబుతున్నారో చూడండి...


అత్తగారి సూచన పనిచేసింది: అషూ

‘ఇల్లు వింతైన ప్రదేశం. ఎన్ని తెచ్చినా ఏదో ఒకటి కావాలనిపిస్తుంటుంది. మనం చేర్చుకుంటూ వెళతాం. తీరా శుభ్రం చేయడం, సర్దడం విషయానికొచ్చేసరికి గానీ లోపల ఎంత గజిబిజి ఉందో అర్థం కాదు. కాబట్టి, జాగ్రత్త!’ ఇదీ అషూకి పెళ్లైన కొత్తలో అత్తగారు చెప్పిన మాట. అది మనసులో బలంగా నాటుకు పోయింది. వీళ్లది బెంగళూరు. పిల్లాడు పుట్టాక ఎంత సర్దినా ఇల్లంతా గజిబిజిగానే కనిపించేది. ఇల్లు సరిపోవడం లేదు, పెద్దదానిలోకి మారితే బాగుండు అనీ అనిపించేదట. కానీ ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదు కదా! దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తక్కువ స్థలాన్ని అందంగా సర్దడం, చిన్న చిన్న అమరికలతో పొందిగ్గా కనిపించేలా చేయడం వంటివి నేర్చుకొని, ప్రయత్నించేది. స్నేహితుల ఇళ్ల విషయంలోనూ సాయం చేసేది. అషూ గతంలో హోటల్‌ మేనేజర్‌. పెళ్లయ్యాక మానేసింది. దీంతో ఖాళీగా ఉన్నానన్న భావన వచ్చింది. ఇంట్లోంచే ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్‌ ఆలోచన వచ్చింది. 2016లో ‘సింప్లిఫై యువర్‌ స్పేస్‌’ పేరుతో ప్రారంభించింది. తక్కువ ఖర్చు, సమయంలో స్వయంగా చేసుకునే సలహాలివ్వడం ఈమె ప్రత్యేకత. అదే తనకు జనాదరణ తెచ్చిపెట్టింది. పండగ వేళల్లో అలంకరణ, సులభ రీతిలో శుభ్రం చేసుకునే పద్ధతుల్నీ జోడిస్తుంది. తన యూట్యూబ్‌ ఖాతాను పదమూడు లక్షలకు పైగా, ఇన్‌స్టాను 45 వేలమందీ అనుసరిస్తున్నారు. 16కోట్లకుపైగా వీక్షణలున్నాయి. ‘ఇంటిని అందంగా, క్రమశిక్షణతో నిర్వహించడమూ ఒక పాఠం లాంటిదే. దాన్ని మనం చేయడం ద్వారా పిల్లలకూ నేర్పించాలి. అప్పుడే అది కొనసాగుతుందీ, వాళ్ల జీవితాల్లో క్రమశిక్షణ అలవడేలానూ చేస్తుంది’ అంటుంది అషూ ఖత్తర్‌.


సొంత సంస్థను నిర్వహిస్తూనే..: నిహారా

వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌. పుట్టిపెరిగింది మహారాష్ట్ర. ముంబయిలో బీఆర్క్‌లో డిగ్రీ, పీజీ చేసింది. ఈమెకు మొదట్నుంచీ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. చదువయ్యాక 2009లో భర్త స్వప్నిల్‌ సోనవన్‌తో కలిసి ‘ఐఓఎస్‌ఐఎస్‌ ఆర్కిటెక్ట్స్‌’ అనే సంస్థను ప్రారంభించింది. ఇల్లు, ఆఫీసులకు డిజైనింగ్‌, నిర్మాణం, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో సాయం చేస్తుందీ సంస్థ. నిహారాకు పెయింటింగ్‌ అన్నా ఆసక్తి. తన డిజైన్లలో వీటికి ప్రాధాన్యం ఇస్తుంటుంది. తన పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని నలుగురితోనూ పంచుకోవాలన్న ఉద్దేశంతో యూట్యూబ్‌లోకి 2017లో వచ్చింది. డిజైనింగ్‌లో జాగ్రత్తలు, ఎలాంటి మెటీరియల్‌ ఎంచుకోవాలి, ఏ రంగులు ఎలాంటి వాటికి బాగుంటాయి.. ఎక్కువ కాలం మన్నాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు సంబంధించి ప్రతి చిన్న అంశాన్నీ వివరించేలా ఉంటాయి నిహారా వీడియోలు. తక్కువ బడ్జెట్‌తో మోడర్న్‌ లుక్‌ వచ్చేలా ఎలా చేసుకోవచ్చో చెబుతుంది. ఈమె ఖాతాను నాలుగు లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. డిజైనింగ్‌కు తగ్గ అప్లియన్సెస్‌లను ఎలా ఎంచుకోవాలో కూడా నిహేరా సోనవన్‌ సూచిస్తుంది.


బ్లాగర్‌ నుంచి వ్లాగర్‌: దామిని

చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నాన్న డాక్టర్‌. దీంతో ఇల్లును చూసుకోవడం, సర్దడం వంటివి నెమ్మదిగా అలవాటు చేసుకుంది. ఈక్రమంలోనే వాస్తు, ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ఆసక్తి ఏర్పరచుకుంది. వీళ్లది బెంగళూరు. ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ కూడా చేసింది. కార్పొరేట్‌ ఉద్యోగంతోపాటు వాస్తు కన్సల్టెంట్‌గా సేవలూ అందిస్తోంది. తన సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో బ్లాగర్‌ అయ్యింది. తర్వాత యూట్యూబ్‌లోకి వచ్చింది. 2019 నుంచి ఇంటీరియర్‌, వాస్తు అంశాలపై వీడియోలు ఉంచుతోంది. ‘నా కలల ఇంటిని నేనే డిజైన్‌ చేసుకున్నా. దానిలో ప్రతి చిన్న అంశమూ నేను పరిశీలించి దగ్గరుండి చేయించుకున్నదే. తర్వాతే నాలా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి సాయం చేయాలనిపించి యూట్యూబ్‌ కొచ్చా’ అని చెబుతుంది దామిని హన్సా. ఈమె యూట్యూబ్‌ ఖాతాకు లక్షకుపైగా ఫాలోయర్లున్నారు. గృహాలంకరణే కాకుండా లైఫ్‌స్టైల్‌ పాఠాలనూ చెబుతుంది. వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలను సమన్వయం చేసుకుంటూ ఎలా సాగాలన్న వాటిపైనా సలహాలిస్తుంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్