లక్షల మనసుల్ని గెలుస్తున్న అత్తాకోడళ్లు!

అత్తాకోడళ్లంటే ఎప్పుడూ తగాదాలూ, గిల్లికజ్జాలేనా?సరదాగా స్నేహితుల్లా, ప్రేమతో కలిసిపోతుంటే ఎంత బావుంటుంది! అలా కలిసుండటమే కాదు.. వాళ్ల అన్యోన్యతకు ప్రతిభను జోడించి లక్షలాది మంది అభిమానాన్నీ చూరగొంటున్నారు కొందరు...వాళ్లెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.

Updated : 12 Jun 2022 07:17 IST

అత్తాకోడళ్లంటే ఎప్పుడూ తగాదాలూ, గిల్లికజ్జాలేనా?సరదాగా స్నేహితుల్లా, ప్రేమతో కలిసిపోతుంటే ఎంత బావుంటుంది! అలా కలిసుండటమే కాదు.. వాళ్ల అన్యోన్యతకు ప్రతిభను జోడించి లక్షలాది మంది అభిమానాన్నీ చూరగొంటున్నారు కొందరు... వాళ్లెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.


తన కోసం..: పూజ, వెంకట రమణ

‘మావారు కరుణాకర్‌ రావుకి షార్ట్‌ఫిల్మ్స్‌ అంటే ఇష్టం. ఆయన కోసం యూట్యూబ్‌లోకి వచ్చా’ అని చెబుతుంది పూజ. వీళ్లది గుంటూరు. 2020లో పూజ దేవరకొండ పేరుతో ఛానెల్‌ ప్రారంభించారు. బంధువులకు నచ్చకపోవడంతో అత్త వెంకటరమణ నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో మొదట భార్యాభర్తలిద్దరే వంటలు, విశేషాలతో వీడియోలు చేసేవారు. తర్వాత అత్తగారూ ముందుకు రావడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి అత్త వర్సెస్‌ కోడలు పేరుతో 50కిపైగా వీడియోలు చేశారు. ‘కాన్సెప్ట్‌, ఎడిటింగ్‌ అన్నీ మావారే చూసుకుంటారు. పేద కుటుంబాల కోసం ప్రభుత్వం కట్టిస్తున్న ఇంటి డెమోని వీడియో తీశాం. దానికి ఆదరణ వచ్చింది. అలాంటివే చేయమన్నారు కానీ.. రాజకీయపరమైన వాటిపై ఆసక్తి లేక చేయలేదు. ఆ తర్వాత కరోనా. దీంతో కొన్ని నెలలు వీడియోలు మానేశాం. ఆయన ఆసక్తి చూసి అత్తయ్యా ఒప్పుకొన్నాక.. మా ఇద్దరి వీడియోలకు ఆదరణ వచ్చింది. అనుసరించేవారి సంఖ్యా పెరిగింది. నేను చదివింది పదో తరగతి, అత్తగారు అసలు చదువుకోలేదు. ఎలా ఆదరిస్తారో అన్న భయం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, నెగెటివిటీ వచ్చినా పట్టించుకోవద్దని ముందే అనుకున్నాం. అయినా అలాంటివి కనిపించినప్పుడు మొదట్లో బాధ పడేవాళ్లం. తర్వాత ఏదైనా తప్పు ఉంటే చెప్పండి.. మార్చుకుంటామని చెప్పే వాళ్లం. దీంతో అవీ తగ్గాయి. ఇంట్లో సాధారణంగా జరిగే అంశాలపైనే కాస్త హాస్యం జోడించి చేస్తుంటాం. సంభాషణలూ ఇంట్లో మాట్లాడుకున్నట్లే ఉంటాయి. అదే చాలామందికి చేరువ చేసింది. ఆఫీసు నుంచి వచ్చాక మీ వీడియోలు చూసి రిలాక్స్‌ అవుతుంటామని చాలామంది ఇతర దేశాల నుంచీ మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తుంటారు. బహుమతులు పంపిస్తుంటారు. అది చూసి చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి మెసేజ్‌కీ స్పందిస్తుంటాం. మా ఛానెల్‌ని 5 లక్షల 60వేలకుపైగా మంది అనుసరిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగేకొద్దీ బాధ్యత పెరిగిందనిపిస్తుంది. దీంతో ఆలోచించి కాన్సెప్టులు ఎంపిక చేసుకుంటున్నాం. ఇప్పుడు మాతో మా అమ్మాయీ కలిసింది’ అని సంతోషంగా చెబుతోంది పూజ.


బంగారు కోడలు, పాపం అత్త: సమీర, సన

‘సందేశాన్ని ఇవ్వాలనో, మా ఇద్దరి అనుబంధాన్ని చూపించాలనో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. అయినా గుర్తింపు వచ్చిందంటారు’ సన. ఎన్నో సినిమాల్లో అమ్మగా, భార్యగా మరెన్నో పాత్రల్లో ఈమె మనకు పరిచయమే. కోడలు సమీరా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. సహనటీమణులుగా వీరి ప్రయాణం మొదలైంది. మంచి స్నేహితుల్లా మెలిగే వీరు తర్వాత అత్తాకోడళ్లయ్యారు. అయినా తమ మధ్య స్నేహం కొనసాగుతోందని చెబుతారు. ‘సమీరా ఎవరితోనైనా సరదాగా కలిసిపోతుంది. కోడలిగా అడుగుపెట్టాక మా అనుబంధం ఇంకా పెరిగింది. ఇంట్లో పండుగలు, సరదా క్షణాలు అన్నింటినీ వీడియోలు తీస్తుంటాం. దానిలో నేను వాడే బంగారు కోడలు అనే మాట. ఇంకా బంగారు కోడలు, పాపం అత్త అంటూ వీడియోలకు పెట్టే హ్యాష్‌ట్యాగ్‌లు చాలా ఫేమస్‌ అయ్యాయి. అదీకాక అత్తాకోడళ్లనగానే వైరం ఉంటుందనే భావనే అందరిదీ. మేం స్నేహితుల్లా కలిసిపోయి, ఆడుతూపాడుతూ ఉంటాం కదా! దీంతో మా అనుబంధం చాలామందికి నచ్చింది. చాలా ఏళ్ల క్రితమే ఒక ఛారిటీ కోసమని ‘షానూర్‌ సన’గా యూట్యూబ్‌లోకి వచ్చా. కానీ కొనసాగించలేదు. లాక్‌డౌన్‌లో సమీరా వీడియోలు చేసి తన ఖాతా ‘సమీరా షెరిఫ్‌’లో ఉంచేది. మీరూ ఒక మంచి పని కోసం ప్రారంభించి ఆపేశారు కదా! ఎలాగూ ఇప్పుడు ఖాళీనే, షూటింగ్‌లూ లేవు. కొనసాగించొచ్చు కదా అని మళ్లీ మొదలుపెట్టించింది’ అని చెబుతారు సన. ఈవిడ ఖాతాకు లక్షకుపైగా సమీర ఖాతాకు 4 లక్షలకుపైగా ఫాలోయర్లున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్