తీగపై సాహసాలతో...

ఎత్తు మడమల చెప్పులతో ఇబ్బంది పడకూడదని నిదానంగా నడుస్తారెవరైనా.. ఈమె మాత్రం వాటితో ఎంతో వేగంగా సన్నని తీగపై అలవోకగా అడుగు లేసేయగలదు. అంతలోనే గాలిలోకి ఎగిరి.. అదే వేగంతో తీగపై నిలబడగలదు. అబ్బురపరిచే ఈ సాహస కృత్యాలే తనకు రెండుసార్లు ప్రపంచ రికార్డు నిచ్చాయి. ఈమె రికార్డును గిన్నిస్‌ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తే కోట్ల మంది వీక్షించారు. ఆసక్తితో నేర్చుకున్న ఈ క్రీడ 40 ఏళ్ల ఓల్గాహెన్రీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ...

Published : 14 Jun 2022 00:13 IST

ఎత్తు మడమల చెప్పులతో ఇబ్బంది పడకూడదని నిదానంగా నడుస్తారెవరైనా.. ఈమె మాత్రం వాటితో ఎంతో వేగంగా సన్నని తీగపై అలవోకగా అడుగు లేసేయగలదు. అంతలోనే గాలిలోకి ఎగిరి.. అదే వేగంతో తీగపై నిలబడగలదు. అబ్బురపరిచే ఈ సాహస కృత్యాలే తనకు రెండుసార్లు ప్రపంచ రికార్డు నిచ్చాయి. ఈమె రికార్డును గిన్నిస్‌ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తే కోట్ల మంది వీక్షించారు. ఆసక్తితో నేర్చుకున్న ఈ క్రీడ 40 ఏళ్ల ఓల్గాహెన్రీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.  

న్నని తీగపై బ్యాలెన్స్‌ చేస్తూ నడవడం, దాంతోపాటు గాలిలోకి ఎగురుతూ ఫీట్స్‌ చేయడం.. వంటివి తన 32వ ఏట ప్రాక్టీసు ప్రారంభించింది అమెరికాకు చెందిన ఓల్గాహెన్రీ. ఏ క్రీడనైనా 30ల్లో నేర్చుకోవడమంటే చాలా ఆలోచిస్తారు. అలాంటిది ఇలాంటి సాహస క్రీడ నేర్చుకోవడం మాటలు కాదు. అయితే ఎవరిదగ్గరా శిక్షణ తీసుకోకుండా పట్టుదలతో సొంతంగా సాధన చేసింది హెన్రీ. ఈత కొలనుపై లేదంటే బీచ్‌, మైదానాల్లో తాడు కట్టి ప్రాక్టీసు చేసేది. సన్నని ఏటవాలు గోడ కనిపించినా చాలు.. దానిపై వేగంగా నడవడానికి ప్రయత్నించేది. ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి  జిమ్‌లో వర్కవుట్లు చేసేది. అయిదేళ్ల ప్రాక్టీసు తర్వాత తనపై తనకు నమ్మకం వచ్చాక ఫన్‌ వీడియోలు పేరుతో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో వాటిని పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత ఈమెకు ప్రముఖ టీవీ షో ‘గేమ్‌ ఆఫ్‌ టాలెంట్స్‌’లో అవకాశం దక్కింది. వేదికపై ఓల్గా చేసిన ఫీట్స్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేవి. దాంతో ఓల్గా ప్రముఖ స్లాక్‌లైన్‌ పెర్ఫార్మర్స్‌ జాబితాలో చేరిపోయింది.

గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు..

శరీరాన్ని గాలిలో తేలిగ్గా కదపాలన్నా, బ్యాలెన్స్‌ చేయాలన్నా... కొన్ని టెక్నిక్స్‌ తెలియాలంటుంది ఓల్గా. ‘నా స్నేహితుడు డైలాన్‌ లూస్‌బర్స్‌ హాబీ ఇది. తనను చూసినప్పుడల్లా అలా చేయాలనిపించేది. వయసు ఎక్కువని వెనుకడుగేయ లేదు. బాగా నేర్చుకున్న తర్వాత గుర్తింపు తెచ్చుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. అలా 2020లో సాదా బూట్లు ధరించి తీగపై నిమిషం పాటు నడిచి గిన్నిస్‌ రికార్డుకెక్కా. ఆ తర్వాత ఎత్తు మడమల చెప్పులు.. అదీ పెన్సిల్‌ హీల్స్‌తో నడవాలనిపించింది. ఆ ఫీట్‌ నిమిషంపాటు చేసి గిన్నిస్‌కెక్కా. అయితే ఇలా నడవడం కోసం వేల సార్లు సాధన చేసి విఫలమయ్యా. పట్టుదలతో సాధించా. ఆ తర్వాత ‘అసాధారణ వ్యక్తులు’ పేరుతో తీసిన సిరీస్‌లో భాగంగా చిత్రీకరించిన నా వీడియోలను లక్షల మంది వీక్షించి ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నా సాహసాలను ప్రదర్శిస్తున్నా. కార్పొరేట్‌ ఈవెంట్స్‌, వివాహాది శుభకార్యాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో నా ప్రదర్శనలుంటున్నాయి. అడోబ్‌, ఆడి సంస్థలకు మోడల్‌గానూ పనిచేస్తున్నా. వెబ్‌సైట్‌ ప్రారంభించి దానిద్వారా అందరికీ ఈ క్రీడపై ఆసక్తిని కలిగిస్తున్నా. ముందుకొచ్చే వాళ్లకి ఇందులో శిక్షణనూ ఇస్తున్నా. ఇది శారీరక ఆరోగ్యానికెంతో మేలు చేస్తోంది. మానసికంగా చూస్తే ధ్యానం లాంటిది. తీగపై నడుస్తుంటే వేరే ఆలోచనే రాదు. ఏకాగ్రత పెరుగుతుంది’ అని చెబుతోంది ఓల్గా. పట్టుదల, సాధన ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమని నిరూపించిన తనని ప్రశంసించాల్సిందే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్