Updated : 15/06/2022 07:21 IST

ఆల్ఫీ అమ్మ.. బోనకల్లు మదర్‌ థెరిస్సా

వయసు పెరిగినా వాళ్లింకా పసివాళ్లే. ఆకలిదప్పికల గురించి నోరు తెరిచి చెప్పలేరు. పాపం, పుణ్యం తెలియని అలాంటి విధి వంచిత బాలికల్ని అక్కున చేర్చుకుని అమ్మానాన్నలకు మించిన ప్రేమాప్యాయతలు చూపిస్తున్నారు ఆల్ఫీ. విధి చేసిన మానసిక గాయాల్ని సైతం మాన్పుతోంది ఆమె ప్రేమ.

దర్‌ థెరిస్సా ఒకసారి ఒక అభాగ్యురాలికి కొంత బియ్యం ఇచ్చారు. అందులో కొంత పక్కింటి వాళ్లకు ఇచ్చిందా అభాగ్యురాలు.. అయిదో తరగతిలో టీచర్ల నుంచి ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఆల్ఫీ కిడంజన్‌. అదామెను ఎంత ప్రభావితం చేసిందంటే... తన జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం కోసం సన్యాసినిగా మారాలని నిర్ణయించుకునేంతగా. ఆల్ఫీ వాళ్లది కేరళలోని ఎర్నాకుళం. ఆ లక్ష్యం ఆమెతో పాటే పెరిగి పెద్దయ్యింది. డిగ్రీ, ఆపైన ఉపాధ్యాయ శిక్షణ అయ్యాక తాను వెళ్లాలనుకుంటున్న మార్గం గురించి ఇంట్లో చెప్పారు. మదర్‌ థెరిస్సాతో కలిసి పని చేయాలన్న కృత నిశ్చయంతో 1988లో కోల్‌కతా వెళ్లారు. ‘మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ’లో సేవకురాలిగా చేరారు. దాదాపు పదేళ్లు మదర్‌కు సన్నిహితంగా పని చేశారు. ఆమె మరణానంతరం 1999లో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు అందించడానికి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలనుకున్న ఆల్ఫీ అందుకు ఖమ్మం జిల్లా బోనకల్లును ఎంచుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ‘సిస్టర్స్‌ ఆఫ్‌ కంపేషన్‌’ సంస్థ తరఫున క్షయ, హెచ్‌ఐవీ బాధితుల్ని గుర్తించి మందులు ఇచ్చేవారు. ఆ క్రమంలో మానసిక దివ్యాంగ బాలికల పరిస్థితి చూసి చలించిపోయారామె. వాళ్లని వదిలేసి అమ్మానాన్నలు కూలి, పొలం పనులకు వెళ్లేవారు. వారు తిరిగి వచ్చే వరకూ అన్నం, నీళ్లు ఇచ్చే దిక్కే లేదు. కొందరు అలాంటి పిల్లల్ని భారంగా భావించే వారు. ముఖ్యంగా అలాంటి బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూశాక ఆగలేక పోయారు.

వారి కోసమే శాంతి నిలయం..

మానసిక దివ్యాంగ బాలికల కోసం బోనకల్లులో ప్రత్యేక ‘హోమ్‌’ ఏర్పాటు చేయాలనుకున్నారు. స్థానికులతో ఆ విషయాన్ని పంచుకున్నారు ఆల్ఫీ. అప్పటికే ఆమె సేవల్ని చూసిన అధికారులూ సహకరిస్తామన్నారు. ఎమ్మార్వో ప్రోత్సాహంతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా, 2004లో ఎకరం స్థలం కేటాయించారు. ఖమ్మం డయాసిస్‌ (క్రైస్తవ శాఖ) అక్కడ భవనం నిర్మించి ఇచ్చింది. దానికి ‘శాంతి నిలయం’ అని పేరు పెట్టారు. బోనకల్లుకే చెందిన అమర్లపూడి బిజిలీ తోడు రాగా తన సేవల్ని మొదలుపెట్టారు ఆల్ఫీ. మొదట్లో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు సందేహించే వారు. ‘ఒక్కరిని చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అంత మందిని చూడటం వారికైనా ఎలా సాధ్యం’ అనే వారు. కానీ చేరిన కొద్దిమందినీ బాగా చూసుకోవడంతో క్రమంగా వారి అభిప్రాయం మారింది. పూర్తిగా బుద్ధిమాంద్యం ఉండి సొంత పనులు చేసుకోలేని బాలికలకే ఇక్కడ చోటు. ఇప్పటి వరకూ 350 మంది బాలికలు ఆశ్రయం పొందారు. ఆరోగ్యం మెరుగుపడి, తమ పనులు తాము చేసుకోగలిగేలా మారిన వాళ్లను ఇంటికి పంపుతారు. ఇప్పుడీ హోమ్‌లో 74 మంది ఉన్నారు.

‘బోనకల్లు వచ్చి 23 ఏళ్లయింది. మొదట్నుంచీ స్థానికులు అండగా నిలిచారు. అన్ని మతాల వాళ్లూ తోడ్పాటునందిస్తున్నారు. బోనకల్లు, భద్రాచలం, అశ్వాపురాల్లో మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తూ ఆర్థిక స్వావలంబన సాధించేలా సాయపడుతున్నాం. ఇప్పటివరకూ 200 మంది శిక్షణ పూర్తి చేసుకోగా వాళ్లకి కుట్టుమిషన్లనీ అందించాం. త్వరలో వృద్ధుల కోసమూ ఏదైనా చేయాలనుకుంటున్నా’

మార్పు తెస్తారిలా...

ప్రారంభంలో ఇక్కడ చేరినవాళ్లంతా చిన్న పిల్లలు. కూర్చొన్నచోటే మూత్ర, మల విసర్జన చేసే వారు. అయినా ఓపిగ్గా అవన్నీ శుభ్రం చేయడం, వాళ్లకి స్నానం చేయించి దుస్తులు మార్చడం, అన్నం తినిపించడం వంటి పనులన్నీ ఆల్ఫీనే చేసే వారు. పిల్లల సంఖ్య పెరగడంతో ఇప్పుడు 15 మంది వాలంటీర్లూ తోడయ్యారు. పిల్లలకు ఫిజియో థెరపీ, స్పీచ్‌ థెరపీ ఇస్తారు. ఆటలు, పాటలు, పద్యాలు, పజిల్స్‌ పూరించడం వంటివీ చేయిస్తారు. బతకడమే కష్టమనుకున్న ఎందరో పిల్లలు సైతం ఇక్కడకు వచ్చాక మారారు. కొంతమంది హోమ్‌ పనుల్లో సాయపడతారు. మరి కొందరు విస్తరాకులు, పేపర్‌ ప్లేట్లు, శానిటరీ ప్యాడ్లు తయారు చేస్తారు. హోమ్‌ నడవడంలో దాతల పాత్ర కీలకమంటారు ఆల్ఫీ. ఖమ్మం డయాసిస్‌ ప్రధానంగా నిధులు అందిస్తుండగా, స్థానికులూ తోచిన సాయం చేస్తారు. వైద్యుడు గోపీ, ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి వైద్యుడు జీవీ.. పిల్లలకు చికిత్సతోపాటు మందులూ అందిస్తున్నారు. ఎస్బీఐ వ్యాన్‌ని సమకూర్చింది. వీరందరికీ ప్రేరణ ఆల్ఫీ అమ్మ సేవలే.

- నర్సింగ బాలస్వామి, ఖమ్మం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని