Updated : 15/06/2022 04:04 IST

కట్టిన చీరకు.. కొత్త దారి!

బీరువా నిండా చీరలే!.. సందర్భం వచ్చేసరికి కట్టుకోవడానికి ఏమీ లేవనిపిస్తుంది. ఉన్నవాటిని తీయలేం.. పదే పదే కొత్తవాటిని కొనలేం. మరెలా.. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది ‘ఎంఓఎస్‌ ప్రీలవ్‌డ్‌’. ఎలాగో చదివేయండి.

చీర అందాన్ని తెచ్చే వస్త్రం మాత్రమే కాదు మనకి. అది ఓ జ్ఞాపకం. అమ్మ ప్రేమకు గుర్తు. ఓ తీయని వేడుకకు చిహ్నం. అయిన వాళ్ల ప్రేమ.. ఒక్కోదాని వెనుకా ఒక్కో కథ. ‘ఇది ఫలానా వాళ్లు కొనిచ్చారు.. ఫలానా సందర్భానికి కొన్నా’ అని చెబుతూ మైమరిచిపోతుంటాం. రోజువారీ కట్టేసేవి అయితే ఫర్లేదు. కానీ వేడుకల కోసం కొన్నవాటితోనే సమస్య. దానికి మా ‘ఎంఓఎస్‌ ప్రీలవ్‌డ్‌’ చక్కని పరిష్కారమంటారు సుస్మిత మిశ్రా. ఇదో ఆన్‌లైన్‌ కమ్యూనిటీ. ఇతర ఈకామర్స్‌ ప్లాట్‌ఫాంల్లోలానే దీనిలోనూ చీరలు కొనొచ్చు, అమ్మొచ్చు. అయితే ఇదివరకే ఎవరో ఒకరు ఉపయోగించినవి ఇక్కడ లభిస్తాయి. బాగా నచ్చినవైనా కొన్నిసార్లు ఎక్కువ ఖరీదని వెనకంజ వేసేవీ ఇక్కడ చవగ్గా లభిస్తాయి. మన్నిక ఆధారంగా దీనిలో అమ్మకానికి ఉంచే అవకాశమిస్తారు. ఎంఓఎస్‌.. మ్యాజిక్‌ ఆఫ్‌ శారీస్‌ను పదకొండేళ్ల క్రితం సుస్మిత మిశ్రా తన చెల్లెలు సునీతతో కలిసి ప్రారంభించారు. మొదట ఫేస్‌బుక్‌లో మొదలుపెట్టి తర్వాత ఆన్‌లైన్‌ రూపంలో తీసుకొచ్చారు. గత జులైలో ఈ ‘ఎంఓఎస్‌ ప్రీలవ్‌డ్‌’ ప్రారంభించారు.


‘చాలామంది పిచ్చి అనుకున్నా.. చీరంటే మహిళలకు ప్రత్యేక అభిమానం. ‘వీటిని ఏం చేయాలో తెలీడం లేదు’ అంటూ కట్టుకోకుండా పక్కన పెట్టినవాటికి పరిష్కారం చూపించాలనుకున్నాం. అదే ఎంఓఎస్‌. ప్రారంభించి కొద్ది నెలలే కానీ.. నెలకు దాదాపు పదివేల మంది మా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. 13 రాష్ట్రాల వారికి చీరలు సరఫరా చేశాం. చాలావరకూ మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేవారే ఎక్కువ. కాన్సెప్టు పట్ల మొదట్నుంచీ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికీ కొన్ని కలల చీరలుంటాయి. ఖరీదు ఎక్కువనో, అవిప్పుడు దొరక్కో వాళ్ల మనసులో అసంతృప్తి ఉంటుంది. మా వేదిక ద్వారా అలాంటి కల నెరవేర్చుకుంటున్న వారూ ఉన్నారు. పైగా పర్యావరణానికీ మేలు’ అని సంతోషంగా చెబుతారు సంస్థ సీఈఓ సుస్మిత.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని