కాలుష్యంపై విరక్తి.. కోట్ల వ్యాపారమైంది

పట్టణ కాలుష్యం.. ఆ దంపతులను సొంతూరు బాటపట్టించింది. అక్కడకు వెళ్లాక పర్యావరణానికి మేలు చేసేలా ఏదైనా చేద్దామనుకున్నారు. అప్పుడు వాళ్లకి వచ్చిన ఆలోచన రూ.కోట్ల వ్యాపారమవడమే కాదు.. వేల మంది చేతివృత్తుల

Updated : 12 Sep 2022 11:41 IST

పట్టణ కాలుష్యం.. ఆ దంపతులను సొంతూరు బాటపట్టించింది. అక్కడకు వెళ్లాక పర్యావరణానికి మేలు చేసేలా ఏదైనా చేద్దామనుకున్నారు. అప్పుడు వాళ్లకి వచ్చిన ఆలోచన రూ.కోట్ల వ్యాపారమవడమే కాదు.. వేల మంది చేతివృత్తుల వారికి ఉపాధిగా మారింది. జియా, నితిన్‌ల ఆ వ్యాపార ఆలోచనేంటి?

జియా పమ్నాని మైక్రోబయాలజిస్ట్‌. భర్త నితిన్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌. వారి వారి వృత్తుల రీత్యా దిల్లీలో నివసించేవారు. బిజీ జీవితం, దానికి తోడు కాలుష్యం.. నగర జీవితంపై విరక్తి కలిగింది. దీంతో 2010లో సొంత ఊరు గ్వాలియర్‌కి వెళ్లిపోయారు. కాలుష్యానికి దూరంగా, పర్యావరణానికి మేలు కలిగించేలా ఏదైనా చేయాలనుకున్నారు. అప్పుడే జియా దృష్టి పర్యావరణహిత ఉత్పత్తులపై పడింది. తమ చుట్టుపక్కల ఎంతోమందిని చేనేత, చేతివృత్తి కార్మికులను చూశారు. వారి ఉత్పత్తులను అమ్మడానికి వారు పడే ఇబ్బందులను చూసి, మార్కెటింగ్‌ అవకాశం కల్పించాలనుకున్నారు. దీంతో తమ కోరికా నెరవేరుతుంది, వారికీ ఉపాధి కల్పించినట్లవుతుందని 2012లో ‘ఐటోక్రీ’ అనే సంస్థను ప్రారంభించారు. దీనికోసం రూ.20 లక్షలను పెట్టుబడిగా పెట్టారు.

‘10 చేతివృత్తుల బృందాలు, మాతో సహా అయిదుగురు ఉద్యోగులతో మా సంస్థ ప్రారంభమైంది. మొదట 200 ఉత్పత్తులను వెబ్‌సైట్‌లో ఉంచాం. ఇది చేయమని కార్మికులను మేమెప్పుడూ సూచించలేదు. మీకు బాగా తెలిసినవి, చేయగలమని నమ్మకం ఉన్నవాటినే చేయమని ప్రోత్సహించే వాళ్లం. వాళ్లూ ఏదైనా కొత్తగా చేయాలని తపించేవారు. అందుకే సృజనాత్మకతకు ఆస్కారముండేది. వాళ్ల చేతుల్లో నైపుణ్యం ఉంది. కాకపోతే వాటిని ఎక్కడ మార్కెట్‌ చేయాలో తెలియదు. ఆ సాయం మేమందించే సరికి మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. కొత్త ప్రయోగాలవైపూ వెళ్లారు. వాటిని మేం తీసుకొని కోరుకున్న వారికి పంపేవాళ్లం. నిజానికి అప్పటికి ఆన్‌లైన్‌ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందలేదు. పైగా మేం భిన్న వస్తువులను ఒకే వేదికగా అందించడం మొదలుపెట్టాం. దీంతో ఆదరణ పెరిగింది’ అంటారు జియా. వీళ్లకోసం పదివేలకు పైగా మంది చేతి వృత్తుల వాళ్లు పనిచేస్తున్నారు. వీళ్ల ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతవుతున్నాయి. టర్నోవర్‌ రూ.27 కోట్లకు చేరింది. వీళ్లు అమ్మే ప్రతి వస్తువు కిందా తయారు చేసిన వారి పేరు, నివసించే ప్రాంతం వివరాలు సహా ఉంచుతారు. అలాగైతే ఆ కళ నచ్చిన వారు ప్రత్యేకంగా ఏదైనా ఆర్డర్‌ ఇస్తే వారికి మరింత అదనపు ఆదాయం వస్తుందన్నది వీరి ఉద్దేశం. వ్యాపారంతోపాటు పర్యావరణ హితం, అదనంగా సాయం.. వీళ్ల ఆలోచన బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్