మన కళలకు అంతర్జాతీయ ఖ్యాతి!

అంతర్జాతీయం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి విదేశీ బ్రాండ్‌లే. కానీ ఆ ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది డిజైనర్‌ జ్యోతిదాస్‌. భారతీయ సంప్రదాయ కళల్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక కళాకారుల చేత ఆభరణాలు, యాక్ససరీస్‌, దుస్తులు... తయారు చేయిస్తోంది. వాటిని ‘జ్యో షాప్‌’ బ్రాండ్‌తో దేశవిదేశాల్లో మార్కెట్‌ చేస్తోంది.

Published : 17 Jun 2022 00:59 IST

అంతర్జాతీయం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి విదేశీ బ్రాండ్‌లే. కానీ ఆ ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది డిజైనర్‌ జ్యోతిదాస్‌. భారతీయ సంప్రదాయ కళల్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక కళాకారుల చేత ఆభరణాలు, యాక్ససరీస్‌, దుస్తులు... తయారు చేయిస్తోంది. వాటిని ‘జ్యో షాప్‌’ బ్రాండ్‌తో దేశవిదేశాల్లో మార్కెట్‌ చేస్తోంది.

అందమైన ఆభరణాలూ, ముచ్చటైన అలంకరణ వస్తువులు, ఆకర్షణీయమైన దుస్తులు... ‘జ్యో షాప్‌’లో దొరుకుతాయి. వీటిని హస్తకళల్లో ఆరితేరిన వాళ్లే రూపొందిస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళలకు ఆధునికతను అద్ది వస్తువులకు కొత్త రూపుని తేవడం వీరి ప్రత్యేకత. తరాలుగా చేతివృత్తులలో ఉన్న కళాకారుల్ని ఎంపికచేసుకుని వారితోనే వీటిని తయారు చేయిస్తున్నారు. అలా ఫ్యాషన్‌ ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు జ్యోతి. ఆమె పుట్టింది నేపాల్‌లో. వాళ్ల నాన్న వస్త్ర తయారీ కర్మాగారంలో మేనేజర్‌. రకరకాల రంగులూ, డిజైన్లూ.. వాటికోసం కళాకారులు పడే శ్రమ.. వీటన్నింటినీ చూస్తూ పెరిగింది. అలా హస్త కళలపైన ఇష్టం పెంచుకుంది. తర్వాత చదువుకోసం ఇండియా వచ్చి నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తిచేసింది. అదయ్యాక బెల్జియం వెళ్లి జెమాలజీ చదివింది. దాంతో అటు వస్త్రాలు, ఆభరణాల తయారీని దగ్గరగా పరిశీలించింది. ఆ రెంటినీ కలపడంపైన అనేక ప్రయోగాలు చేసింది కూడా. భారత్‌ తిరిగొచ్చాక మన కళా వైభవాన్ని అంతర్జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఆభరణాలూ, వస్త్రాలు డిజైన్‌ చేయాలనుకుంది. 1996లో అయిదుగురు కళాకారులతో తయారీ మొదలుపెట్టింది. ప్రకృతి స్ఫూర్తిగా, పర్యావరణానికి హాని కలిగించని కళాకృతుల్ని రూపొందిండం ప్రారంభించింది.

విదేశాలకు ఎగుమతులు..

2017లో ‘జ్యో షాప్‌’ పేరుతో సొంత బ్రాండ్‌ని తెచ్చి... ముంబయిలో మూడు దుకాణాల్ని తెరిచి వీటిని మార్కెట్‌ చేస్తోంది. ఆన్‌లైన్లో దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాలు చేపడుతోంది. దుస్తులతోపాటు ఆభరణాల్లోనూ ఎంబ్రాయిడరీని తెచ్చి వస్తువులకు కొత్త ఆకర్షణలు అద్దుతోంది. మిలాన్‌, పారిస్‌, కేన్స్‌... మొదలైన ఫ్యాషన్‌ ఉత్సవాలలో తన డిజైన్లని ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వీరి ఉత్పత్తుల్లో భారతీయ సంస్కృతి, రాజసం ఉట్టిపడుతుంది. వీటికి ఐరోపా, అమెరికాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 మంది కళాకారులకు ఈమె ఉపాధి కల్పిస్తోంది. తద్వారా వారు ఆర్థికంగా లాభం పొందడమే కాకుండా తమ సంప్రదాయాన్ని బతికించుకుంటున్నారు. తరతరాల ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో చూపుతున్నారు. ఓవైపు వృత్తిలో రాణిస్తూనే, సమాజసేవకూ తన వంతు చేయూతనిస్తోంది. మహిళలకు అవకాశాలు కల్పించే మౌలీ సేవాభాయి ట్రస్ట్‌కు విరాళాలు అందిస్తోంది.

‘నా ఆలోచనలపైన నమ్మకంతోనే ఇక్కడవరకూ రాగలిగాను. ఉద్యోగం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సృజనాత్మక వస్తువుల్ని డిజైన్‌ చేయాలన్న ఉత్సుకత మొదట్నుంచీ ఉండేది. మేం డిజైన్‌ చేసిన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా స్పందన ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఒంటి చేత్తో ఇంటిని నడపగలిగే మహిళలు వ్యాపారంలోనూ రాణించగలరు’ అని చెబుతారు జ్యోతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్