105 ఏళ్ల రికార్డుల బామ్మ!

‘వయసు సంఖ్య మాత్రమే’ ఈ మాట ఈ బామ్మకు సరిగ్గా సరిపోతుంది. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం సాధించిందీమె. అదీ రికార్డు స్థాయిలో! ‘ఇప్పటిదాకా అవకాశం రాలేదు కాబట్టి కానీ.. లేదంటేనా.. ఇంకా

Published : 23 Jun 2022 02:11 IST

‘వయసు సంఖ్య మాత్రమే’ ఈ మాట ఈ బామ్మకు సరిగ్గా సరిపోతుంది. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం సాధించిందీమె. అదీ రికార్డు స్థాయిలో! ‘ఇప్పటిదాకా అవకాశం రాలేదు కాబట్టి కానీ.. లేదంటేనా.. ఇంకా ఎన్నో సాధించేదాన్ని’ అంటున్న ఈ బామ్మ సంగతులేంటో తెలుసుకుందాం.. రండి!

బామ్మ పేరు రామ్‌బాయి. పుట్టింది 1917లో. గుజరాత్‌లోని వడోదరలో అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెట్స్‌ ఛాంపియన్‌షిప్‌’ నిర్వహించింది. దీనిలో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పోటీపడ్డారు. 100, ఆపై వయసు ఉన్నవారికి నిర్వహించిన పోటీలో ఈ బామ్మ బంగారు పతకం సాధించింది. అయితే పోటీపడింది మాత్రం ఆవిడ ఒక్కతే! ఒక్కరే కాబట్టి, సులువుగా గెలిచేసిందని అనుకున్నారో పొరబడ్డట్టే. ఎందుకంటే తను గెలిచిన 100 మీ పరుగు పోటీని గతంలో 101 ఏళ్ల ఆవిడ 74 సెకన్లలో పూర్తిచేసింది. దాన్ని రామ్‌బాయి 45.40 సెకన్లలోనే పూర్తిచేసి రికార్డు నెలకొల్పడమే కాదు.. పతకాన్నీ అందుకుంది. ఈ పోటీల్లోనే 200 మీ. దూరాన్ని 1.52 నిమిషాల్లో పూర్తిచేసి మరో పసిడి పతకాన్ని కొల్లగొట్టింది.

బామ్మది హరియాణలోని కద్మా అనే గ్రామం. ఇల్లు, పిల్లలు, పొలం పనులు.. ఇవే ఆవిడ లోకం. ఈమె మనవరాలు షర్మిల సాంగ్వన్‌ అథ్లెట్‌. తను గత ఏడాది పరుగు పోటీల్లో పాల్గొనడానికి వారణాసి వెళితే బామ్మ కూడా తనతో వెళ్లింది. పెద్ద వయసు వాళ్లూ పోటీల్లో పాల్గొంటారని తెలిసి సరదాగా ప్రయత్నిస్తే పతకమొచ్చింది. అదిచ్చిన ఉత్సాహం, ఆనందంతో తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళల్లో జరిగిన పోటీల్లోనూ పాల్గొందట. ఇప్పటివరకూ డజన్‌కిపైగా పతకాలనూ గెలిచింది. అయితే తాజా రికార్డు మాత్రం మరింత ఉత్సాహాన్నిచ్చిందంటోంది. ‘ఆటలపై నాకు చిన్నతనం నుంచీ ఆసక్తే. కానీ ఎవరూ పాల్గొనే అవకాశమివ్వలేదు. అది ఇప్పుడొచ్చింది. మరిన్ని పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తా’ అని ఆనందంగా చెబుతోంది. ఈమె శాకాహారి. అన్నం తినదట. 250 గ్రా. నెయ్యి, 500గ్రా. పెరుగు, అరలీటరు పాలు, చిరుధాన్యాలతో చేసిన రోటీలను ఆహారంగా తీసుకుంటుందట. రసాయనాల్లేని ఆహారం, కాలుష్యానికి దూరంగా ఉండటమే తన ఆరోగ్య రహస్యమంటోన్న ఈవిడకి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం కలట. అందుకోసం పాస్‌పోర్టును సిద్ధం చేసుకోవడమే కాదు ఊళ్లోనూ సంప్రదాయ వస్త్రాలను పక్కనపెట్టి ట్రాక్‌సూట్‌, స్పోర్ట్స్‌ షూ వేసుకొని సాధన చేస్తోంది. ఈ వయసులో ఏం చేస్తాం అనే పెద్దవాళ్లకే కాదు.. త్వరగా నిరాశకు గురయ్యే యువతకీ ఈమె పట్టుదల స్ఫూర్తినిస్తుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని