మా జట్టు.. వేలమంది మహిళలకు భరోసా!

సొంతంగా తమ కాళ్లమీద తాము నిలబడాలనుకొనే మహిళలకుఅనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్లు ఎవరితో మాట్లాడాలి? కాలేజీ రోజుల నుంచే ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలని ఆశ పడే అమ్మాయి... తన కలని ఎలా నిజం చేసుకోగలదు? ఇలాంటివారికే కాదు సామాజిక మాధ్యమాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకొనే

Published : 24 Jun 2022 00:44 IST

సొంతంగా తమ కాళ్లమీద తాము నిలబడాలనుకొనే మహిళలకుఅనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్లు ఎవరితో మాట్లాడాలి? కాలేజీ రోజుల నుంచే ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలని ఆశ పడే అమ్మాయి... తన కలని ఎలా నిజం చేసుకోగలదు? ఇలాంటివారికే కాదు సామాజిక మాధ్యమాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకొనే సామాన్య మహిళలకూ అండగా ఉంటామంటున్న ప్రవీణ నాయుడు తోట వసుంధరతో ముచ్చటించారు..

నంతట తానుగా ఎదగాలనుకుంటున్న ఒక సామాన్య గృహిణికి ఇంట్లో వాళ్లు సహకరించినా, లేకపోయినా తోటి మహిళలు చేయూతనిస్తే ఆమె తప్పకుండా ఎదుగుతుందని భావించా. ఆ ఉద్దేశంతో నేను ప్రారంభించిన ఉమెన్‌ఎన్‌విజన్‌ సంస్థలో ప్రస్తుతం మూడువేల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వాళ్లంతా తోటి మహిళల సాయంతో ఆయా రంగాల్లో రాణిస్తున్నవారే. నా స్వీయ అనుభవం నుంచే నేనీ ఆలోచన చేశా. నేను పుట్టి, పెరిగింది జహీరాబాద్‌లో. అక్కడి శిశుమందిర్‌లో... మన సంస్కృతి, దేశభక్తితో పాటు మహిళా సాధికారత గురించి చెప్పేవారు. ఆ చదువే నా జీవితాన్ని మార్చేసింది. ఇరవై ఏళ్ల క్రితం మాట. పాలిటెక్నిక్‌ తర్వాత... నేరుగా ఐటీ ఉద్యోగంలో చేరా. తర్వాత పెళ్లై అమెరికాలో అడుగుపెట్టా. మావారిదీ ఐటీ ఉద్యోగమే. ఇద్దరు ఆడపిల్లలు. కొన్నాళ్లకు అమెరికా నుంచి తిరిగి వచ్చేసినా కుటుంబ నిర్వహణతోనే సరిపోయింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా కంప్యూటర్‌ కోర్సుల్లో, వివిధ నెట్‌వర్కుల్లో చేరి అప్‌డేట్‌ అవ్వడానికి ప్రయత్నించేదాన్ని. పాలిటెక్నిక్‌తో ఆపేసిన చదువుని మళ్లీకొనసాగించాను. పిల్లలతో కలిసి చదువుకుని ఎంబీఏ హెచ్‌ఆర్‌ పూర్తిచేశా. పదేళ్ల తర్వాత హెచ్‌ఆర్‌ స్ట్రాటజిస్ట్‌గా తిరిగి కెరియర్‌లో అడుగుపెట్టా. అక్కడ నుంచి ఎస్‌ఏపీ టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా మారాను. సాధారణంగా పదేళ్ల విరామం తర్వాత ఇలాంటి ఉద్యోగాల్లో కుదురుకోవడం ఆడవాళ్లందరికీ అంత సులభం కాదు. ఇందుకోసం చాలా ప్రణాళిక ఉండాలి. విరామం తర్వాత వచ్చారు కదాని ఆఫీసుల్లో మహిళల పట్ల సానుభూతి ఏం ఉండదు కదా! నైపుణ్యాలు పెంచుకుంటూ, ఉద్యోగానికి కావాల్సిన విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ క్రమంలోనే మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు చూశాను. వీటికి పరిష్కారంగా ఏదైనా చేయాలనుకున్నా.

మూడువేలమంది సభ్యులతో...

2016లో వాట్సాప్‌లో ఉమెన్‌ఎన్‌విజన్‌ గ్రూపుని ప్రారంభించాను. అయితే ఈ గ్రూపులు ప్రాంతాల వారీగా విడిగా ఉంటాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 20 గ్రూపులు ఉన్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌, ఖమ్మం ప్రాంతాలకూ విడిగా గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో పచ్చళ్లు తయారుచేసేవాళ్లు, దుస్తులు అమ్మేవాళ్లు, నగలు రూపొందించేవాళ్లు, నర్సరీ నడిపేవాళ్లు, బొమ్మలు తయారుచేసేవాళ్లు, ఈవెంట్‌ మేనేజర్లు, బ్యూటీషియన్లు, బేకర్లు, ఫిజియోథెరపిస్టులు ఇలా వేర్వేరు రంగాల వాళ్లు ఉంటారు. అసలు ఏ వ్యాపారమూ చేయని సాధారణ గృహిణులూ ఉంటారు. అందరూ తమ ఉత్పత్తులు, సేవల గురించి ఇందులో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. కావాల్సిన వారు వాటిని అందిపుచ్చుకుంటారు. గ్రూపులని స్థానికంగా విడదీయడం వల్ల ఒకరి సేవలు మరొకరు అందుకోవడం తేలికగా మారింది. దుకాణాల్లో కొనడం కన్నా తెలిసిన వాళ్ల దగ్గరే కొనడం మేలు కదా అనుకుంటూ ఒకరికొకరు సాయంగా ఉంటున్నారు. కొవిడ్‌ సమయంలో... బ్యూటీషియన్లకి ఉపాధి లేదు. అలాంటివారికి తోటి మహిళలు డబ్బు సేకరించి సాయం చేశారు. కొందరికి వైద్యసాయం కూడా అందింది. మగవాళ్లకి ఉద్యోగాలు పోతే ఆడవాళ్లే ఆదుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ మూడువేలమందిలో కొందరికి మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఉపాధి కూడా దొరుకుతుంది. సామాజిక మాధ్యమాల సాయంతో వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకొనేవారికి మా డిజిటల్‌ సొల్యుషన్స్‌ సంస్థ సాయంతో నేను అండగా ఉంటాను. అదేకాదు నేను కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌- తెలంగాణ రాష్ట్ర  ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఇందులో భాగంగా 700 మంది మహిళలకు ఆంత్రప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించి వారు వ్యాపారవేత్తలుగా మారేందుకు సహకరించా. వీళ్లలో ఎవరైనా స్టాళ్లు పెట్టుకుంటాం.. వ్యాపారాన్ని విస్తరించుకుంటాం అనేవారికి సాయంగా నిలుస్తున్నా. ప్రస్తుతం అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఈ విధంగానే 14 మంది తమ స్టాల్స్‌ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తులని అమ్ముతున్నారు. చిన్నవ్యాపారులకు తప్పనిసరిగా అవసరమైన ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్లని ఉచితంగా చేయిస్తున్నా. వనిత, రెడ్డీ, సెయింట్‌ఆన్స్‌ కాలేజీల్లో అమ్మాయిలకు వ్యాపారవేత్తలుగా రాణించేందుకున్న అవకాశాల గురించి తరగతులు తీసుకుంటున్నా.

యువతలో దేశభక్తిని పెంచడానికి...

చిన్నప్పుడు నేను స్కూల్లో నేర్చుకున్న దేశభక్తిని ఎంతోకొంత నేటితరానికి పరిచయం చేయాలనుకున్నా. అందుకే సశక్త్‌ యువభారత్‌ అనే సంస్థలో చేరి మాజీ సైనికాధికారులతో కలిసి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తుంటాను. సైనికాధికారులు తమ స్వీయఅనుభవాలని యువతతో నేరుగా పంచుకోవడం వల్ల యువతలో దేశం పట్ల జాతీయభావం పెరుగుతుందని ఆశ. మన సంస్కృతిలో భాగమైన దేశీఆవుని గౌరవిస్తూ గోమయం ఉత్పత్తులని అందరికీ పరిచయం చేస్తున్నా. జీరోవేస్ట్‌ విధానాన్ని పరిచయం చేస్తూ గోమయంతో చేసి కుండీలు, దూప్‌స్టిక్స్‌, రాఖీలు, కీచెయిన్లని కూడా ఇంటింటికీ పరిచయం చేస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్