పట్టుబట్టి స్టీరింగ్ పట్టి!
96 ఏళ్ల చరిత్ర ఉన్న ముంబయి నగర బస్సు రవాణా వ్యవస్థలో మొట్టమొదటి మహిళా డ్రైవర్.. లక్ష్మీ జాదవ్. 42 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిందామె. ఇదేమీ ఆషామాషీగా దక్కలేదామెకు. స్టీరింగ్ పట్టి చరిత్ర సృష్టించడానికి పగలనకా, రాత్రనకా ఎంతో కృషి చేసింది.
96 ఏళ్ల చరిత్ర ఉన్న ముంబయి నగర బస్సు రవాణా వ్యవస్థలో మొట్టమొదటి మహిళా డ్రైవర్.. లక్ష్మీ జాదవ్. 42 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిందామె. ఇదేమీ ఆషామాషీగా దక్కలేదామెకు. స్టీరింగ్ పట్టి చరిత్ర సృష్టించడానికి పగలనకా, రాత్రనకా ఎంతో కృషి చేసింది.
ఇరవయ్యో ఏట దిలీప్ జాదవ్‌తో పెళ్లైంది లక్ష్మికి. భర్త ముంబయిలో డ్రైవర్. అలా మహారాష్ట్రలోని సతారా జిల్లా నుంచి మహా నగరంలో అడుగుపెట్టింది లక్ష్మి. తర్వాత ఇద్దరు పిల్లలు.. మంచానికే పరిమితమైన అత్తమ్మ. భర్త కష్టంతోనే ఇల్లు గడవదని వీధుల్లో ప్లాస్టిక్ వస్తువులు అమ్మింది. తర్వాత ఫుడ్‌స్టాల్ నడిపేది. అక్కడికి డ్రైవర్లు వచ్చేవారు. వాళ్ల సంపాదన మెరుగ్గా ఉందని డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంది. సవాళ్లుంటాయని తెలిసినా, అవి ఆమె లక్ష్యానికి బ్రేకులు వేయలేకపోయాయి. లక్ష్మి భర్త మాత్రమే కాదు, తండ్రి, తమ్ముడు, బాబాయిలూ డ్రైవర్లే. అలా ఆ రంగం గురించి తెలుసుకుంది.
‘బెస్ట్’ మేలని..
2015లో కారు డ్రైవింగ్ నేర్చుకుని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో డ్రైవర్‌గా కుదురుకుంది. అక్కడ లగ్జరీ కార్లను సైతం నడపడంలో అనుభవం సంపాదించింది. కానీ స్థిరమైన పనివేళలు లేకపోవడంతో అది మానుకుని ఆటోవాలాగా మారి రెండు మూడేళ్లు నడిపింది. ఇంధనానికీ, రిపేర్లకీ పోగా కొద్ది మొత్తమే మిగిలేది. బస్సుల్లాంటివి నడిపితే జీతం వస్తుందనుకుంది. బెస్ట్(బృహన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్) లాంటి చోట అదనపు సౌకర్యాలూ ఉంటాయని శిక్షణకు వెళ్లి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించింది. అవకాశాలు రాక.. తర్వాతా ఆటో నడిపేది. ఆ సమయంలో ఒక బెస్ట్ డిపోలో ప్రయాణికుల బస్సుల్ని నడపడంలో శిక్షణ ఇస్తున్నారంటే చేరింది. 2021 మేలో ఆ కోర్సు పూర్తి చేసింది. అప్పుడే మహిళా డ్రైవర్ల కోసం ఆ సంస్థ ప్రకటన ఇవ్వడంతో దరఖాస్తు చేసుకుంది. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించి ఎంపికైంది. ‘ముంబయిలో బస్సు నడుపుతావా.. అయ్యే పనేనా’ అని అన్నవాళ్లూ ఉన్నారు. బెస్ట్‌కు అద్దె బస్సులు నడిపే ఓ సంస్థ తరఫున జూన్ రెండో వారం నుంచి ముంబయిలో బస్సు నడుపుతోంది లక్ష్మి.
అర్ధరాత్రి వరకూ ఆటో..
‘కారు డ్రైవింగ్ నేర్చుకున్నాక క్లచ్, బ్రేక్‌ల మీద అంత గురి కుదరలేదు. దాంతో కారు అద్దెకు తీసుకుని రాత్రిపూట ఒకట్రెండు గంటలు ప్రాక్టీసు చేసేదాన్ని. ‘బెస్ట్’ శిక్షణ ఇస్తున్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉదయాన్నే పనులన్నీ చేసుకుని వెళ్లి మధ్యాహ్నం తిరిగొచ్చేదాన్ని. కాస్త విశ్రాంతి తీసుకుని రాత్రి భోజనం వండి ఎనిమిదింటి నుంచి అర్ధరాత్రి వరకూ ఆటో నడిపేదాన్ని. నా విజయంలో భర్తతోపాటు పెద్దబ్బాయి సంతోష్(బయో మెడికల్ ఇంజినీర్), రెండో అబ్బాయి సాహిల్ (డిగ్రీ చదువుతున్నాడు).. పాత్ర ఉంది. త్వరలోనే మరింతమంది మహిళా డ్రైవర్లను బెస్ట్‌లో చూస్తాం’ అని చెబుతుంది లక్ష్మి. పెద్ద కొడుకు ఉద్యోగంలో చేరడంతో ఆర్థికంగా అంత ఇబ్బంది లేదు. అయినా వెనకడుగు వేయలేదు లక్ష్మి. ‘నావల్ల కాదన్నప్పుడే, అది చేసి తీరాలన్న పట్టుదల పెరిగింది. ఎలా సాధ్యమైందని మహిళా ప్రయాణికులు అడుగుతున్నారు. ఏదైనా నిర్భయంగా నేర్చుకోండి. ఒకవారం ఇబ్బంది అయినా రెండోవారం నుంచి ధైర్యం, నమ్మకం వస్తాయని చెబుతా’ అని అంటుందీమె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.