ఒంటి చేత్తోనే విజయాన్ని మచ్చిక చేసుకుంది..

ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలను మచ్చిక చేసుకుని మరీ విన్యాసాలు చేస్తోందంటూ చిన్నప్పుడే ప్రశంసలు అందుకుంది తను. సర్ఫింగ్‌లో తారగా ఎదుగుతున్న సమయంలో షార్క్‌ దాడి కూడా ఆమెని ఆపలేకపోయింది. ఒక్క చేత్తోనే ప్రపంచ ఛాంపియన్‌

Updated : 30 Jun 2022 09:48 IST

ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలను మచ్చిక చేసుకుని మరీ విన్యాసాలు చేస్తోందంటూ చిన్నప్పుడే ప్రశంసలు అందుకుంది తను. సర్ఫింగ్‌లో తారగా ఎదుగుతున్న సమయంలో షార్క్‌ దాడి కూడా ఆమెని ఆపలేకపోయింది. ఒక్క చేత్తోనే ప్రపంచ ఛాంపియన్‌ అయి చూపించింది. ఆమె జీవిత కథతో విడుదలైన చలనచిత్రం ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది. ఆ విజేత 33 ఏళ్ల బెథాని హామిల్టన్‌.

బెథాని హామిల్టన్‌ ఎనిమిదేళ్ల వయసులోనే సర్ఫర్‌గా తానేంటో నిరూపించుకుంది. 10 ఏళ్లు వచ్చేసరికి ఓ పెద్ద సంస్థ స్పాన్సర్‌ షిప్‌ సాధించింది. వాళ్లది అమెరికాలోని హవాయి దీవి. ఆ రోజు స్నేహితురాలు అలానాతో కలిసి సర్ఫింగ్‌ చేస్తూ, విశ్రాంతి తీసుకుంటున్న బెథానిపై టైగర్‌ షార్క్‌ దాడి చేసింది. అలానా అప్రమత్తమై, ఒడ్డుకు పరుగెత్తి తండ్రిని పిలుచుకొచ్చి, బెథానీని కాపాడింది.

గుర్తించలేకపోయా.. షార్క్‌ దాడి చేయడం గుర్తించలేకపోయా అంటుంది బెథాని. ‘ఆ రోజు సర్ఫింగ్‌ బోర్డుపై పడుకుని నీటి మీద తేలుతున్నా. టైగర్‌ షార్క్‌ ఒకటి నా భుజాన్ని, సర్ఫింగ్‌ బోర్డుని పక్క భాగాన్ని కలిపి కొరికేసింది. నాకేమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా నా చుట్టూ నీళ్లన్నీ ఎర్రగా కనిపించే సరికి భయం వేసింది. నా భుజానికి స్పర్శ లేదు. అప్పుడు నా చేయి లేదని గుర్తించా. ఆసుపత్రికి తరలించే లోపే 60 శాతం రక్తం పోయింది. మెలకువ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నా. అదే రోజు నాన్న మోకాలికి శస్త్ర చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేశారు. సమయానికి వైద్యులు ఉండటంతో నాకు వెంటనే చికిత్స అందింది. నేనింక ఏమీ చేయలేనని అందరూ అనుకున్నారు. వారి అభిప్రాయం తప్పు అని చెప్పాలనిపించింది. అప్పటికి నా వయసు 13 ఏళ్లే. నా పట్టుదలతో వైకల్యాన్ని ఓడించాను. ధైర్యాన్ని నింపుకొన్నా. గాయం మానిన వెంటనే మూడు వారాలకే సముద్రంలోకి అడుగుపెట్టా. మొదట్లో షార్క్‌ వస్తున్నట్లు భయం వెంటాడేది. ఈసారి దానికి దొరక్కూడదు అని చెప్పుకొనేదాన్ని. ఒంటి చేత్తో సాధన చేయడానికి సర్ఫింగ్‌బోర్డును పొడవుగా, దళసరిగా చేయించుకున్నా. ఒంటి చేత్తో బ్యాలెన్స్‌ చేయడానికి చాలా కష్టపడ్డా. చివరకు విజయం సాధించా. ప్రమాదం జరిగిన 26 రోజులకే ఓ పోటీలో కూడా పాల్గొన్నా. షార్క్‌ దాడిలో పాడైన నా సర్ఫింగ్‌బోర్డు, దుస్తులను కాలిఫోర్నియాలో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు’ అని చెబుతుంది.

తన గురించి... వికలాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు తననే ఓ ఉదాహరణగా చూపించాలనుకుంది బెథాని. దాంతో సర్ఫింగ్‌ పోటీల్లో పాల్గొంటూనే, వేదికలపై ప్రసంగించడం మొదలుపెట్టింది. తన అనుభవాలన్నింటినీ ‘సోల్‌ సర్ఫర్‌’ పేరుతో పుస్తకంగా తెచ్చింది. తర్వాత మొత్తం 8 పుస్తకాలు రాసిందీమె. ప్రపంచంలోనే ఉత్తమ మహిళా సర్ఫర్లలో ఒకరిగా ఎదిగింది. ఈమె జీవితకథ ‘సోల్‌ సర్ఫర్‌’ సినిమాగా విడుదలైంది. ఆడమ్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. తన ఇద్దరు పిల్లల బాధ్యతలన్నీ తానే చూసుకుంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు 20లక్షల మందికిపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రపంచంలోనే రిప్‌ కర్ల్‌ కప్‌ పోటీల్లో పాల్గొన్న తొలి మహిళగా, 6 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, టాప్‌ ర్యాంక్‌ మహిళా సర్ఫర్‌గా నిలిచింది. ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బెథానీ’ సంస్థను స్థాపించి లక్ష్యానికి వైకల్యం అడ్డుకాదంటూ అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్