బిజినెస్‌ స్కూళ్లు నేర్పని నైపుణ్యాలు ఈమెవి...

ఇంటి పెద్ద ఉద్యోగం పోయి దిక్కు తోచని స్థితిలో ఆమె బెంబేలెత్తి పోలేదు. ఈ కష్టాన్ని ఎలా దాటాలా అని ఆలోచించింది. అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ తను నేర్చిన వంటలే ఊతంగా కుటుంబాన్ని నిలబెట్టుకుంది. పదో తరగతే చదివినా ఒక్కోటీ నేర్చుకుంటూ ఎదిగింది.

Updated : 03 Jul 2022 09:20 IST

ఇంటి పెద్ద ఉద్యోగం పోయి దిక్కు తోచని స్థితిలో ఆమె బెంబేలెత్తి పోలేదు. ఈ కష్టాన్ని ఎలా దాటాలా అని ఆలోచించింది. అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ తను నేర్చిన వంటలే ఊతంగా కుటుంబాన్ని నిలబెట్టుకుంది. పదో తరగతే చదివినా ఒక్కోటీ నేర్చుకుంటూ ఎదిగింది. వందల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన చిన్న వ్యాపారాన్ని రూ. కోటిన్నర టర్నోవర్‌కు చేర్చింది గీతా పాటిల్‌. ఏ బిజినెస్‌ స్కూళ్లూ నేర్పని నైపుణ్యాలు ఈమెవి అంటూ వ్యాపార దిగ్గజం, మహీంద్ర గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ప్రశంసించే స్థాయికి చేరింది...

గీతాపాటిల్‌ తన కుటుంబాన్ని కష్టం నుంచి గట్టెక్కించడానికి చేసిన ప్రయత్నం ఇవాళ ఆమె గురించి దేశమంతా మాట్లాడుకునే స్థాయికి చేర్చింది. పదోతరగతి మాత్రమే చదివిన గీతకు గోవింద్‌తో వివాహమైంది. వీళ్లది ముంబయి. ఓ డెంటల్‌ ల్యాబొరేటరీలో క్లర్క్‌గా పనిచేసే గోవింద్‌ తెచ్చే కొద్దిపాటి సంపాదనే ఆ ఇంటికి ఆధారం. ఉన్నదాంట్లోనే పొదుపుగా నెట్టుకొచ్చే వారు. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనుకున్నారు ఈ దంపతులు. అకస్మాత్తుగా గోవింద్‌ ఉద్యోగం పోయింది. ఇది పోతే పోనీ మరోటి ప్రయత్నిద్దాం అనుకున్నారు. కానీ ఎన్నాళ్లు తిరిగినా ఎక్కడా దొరకలేదు. గీతకు ఏం చేయాలో అర్థంకాలేదు. పోనీ తను ఉద్యోగానికి వెళదామంటే చదువులేదు. ఆ సమయంలోనే గుర్తొచ్చాయామెకు అమ్మ నేర్పిన వంటకాలు. చిన్నప్పటి నుంచి అమ్మ వెంటే తిరుగుతూ చాలా వంటకాలు నేర్చుకుంది. పండుగలు, శుభకార్యాలకు అమ్మ వండే మహారాష్ట్ర సంప్రదాయ వంటకాల ఆలోచనలే గీతకు ముడిసరుకులయ్యాయి. ఇక వెంటనే రంగంలోకి దిగింది. 2016లో ఇంట్లోనే పిండివంటలు, స్నాక్స్‌ తయారీ ప్రారంభించింది. మొదట్లో వాటిని రుచి చూసి చెప్పమని ఇరుగు పొరుగు వారికి ఇచ్చేది. తిన్న వారందరూ లొట్టలేస్తూనే... చిన్న చిన్నగా ఆర్డరిచ్చేవారు.

ఫిదా అయ్యారు..
తను చేసే మహారాష్ట్ర సంప్రదాయ వంటల్లో ఛివ్దా, మోదక్‌, బొబ్బట్లు, జంతికల రుచి చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యేవారు. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. మొదటిసారిగా తనకొచ్చిన పెద్ద ఆర్డరును తయారు చేయడానికి రూ.12వేలు పెట్టుబడిగా పెట్టానంటుంది గీత. ‘నోటిమాటతోనే ఈ వంటల రుచి అందరికీ చేరింది. ముందుగా నాలుగైదురకాల స్వీట్లు, జంతికలతో మొదలుపెట్టి క్రమేపీ పోషకవిలువలున్న మేతీ, ప్రొటీన్‌ లడ్డూ, హిమాలయన్‌ సాల్ట్‌ మఖానా వంటివి చేర్చా. అయిదేళ్లు అలా గడిచాయి. ఇంతలో మా అబ్బాయి వినిత్‌ కాస్త పెద్దయ్యాడు. నాకు చేయూతగా నిలిచాడు. దాంతో ఆర్డర్లు పెంచుకోగలిగా. అప్పుడే ఈ వంటలకు ఓ బ్రాండ్‌ ఉండాలని ‘పాటిల్‌ కాకి’ అని పేరు పెట్టా. సోషల్‌మీడియా ద్వారా ప్రకటనలు ప్రారంభించా. మా ఉత్పత్తుల గురించి దేశవ్యాప్తంగా తెలియడం మొదలైంది. ఇప్పుడు నెలకు 3వేలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. నాదగ్గర 25 మంది మహిళలు పనిచేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్డర్లు ఇంకా ఎక్కువ అవుతాయి. అప్పుడు కొంతమందిని అదనంగా తీసుకుంటా. మా వార్షికాదాయం రూ.1.4 కోట్లకు చేరింది. మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చింది గీత.

అప్పుడే అయిపోలేదు... ఇప్పుడు తనో స్థాయికి వచ్చింది. కానీ తనలా ఇంకా చాలా మంది మహిళలు ఇబ్బందిపడుతుండటాన్ని చూసింది గీత. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది మహిళలకు వంటల తయారీలో శిక్షణనిచ్చి, ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా కృషి చేసింది. ఇవన్నీ తెలిసే ఆనంద్‌ మహీంద్ర తన ట్విటర్‌లో గీత గురించి ప్రస్తావించి ప్రశంసలతో ముంచెత్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్