సగం కాదు... ఆకాశమే మనది!

75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో సమానత్వం కోసం మనమింకా పోరాడుతూనే ఉన్నాం. ఈ విషయంలో విదేశాలన్నీ పురోగతి సాధిస్తున్నా.. మనమింకా నిరూపించుకుంటూనే ఉన్నాం. లింగ సమానత్వంలో 146 దేశాల్లో 135వస్థానం మనది. అలాంటి మన దేశం వైపు ఒక విషయంలో మాత్రం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.

Updated : 15 Aug 2022 08:06 IST

75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో సమానత్వం కోసం మనమింకా పోరాడుతూనే ఉన్నాం. ఈ విషయంలో విదేశాలన్నీ పురోగతి సాధిస్తున్నా.. మనమింకా నిరూపించుకుంటూనే ఉన్నాం. లింగ సమానత్వంలో 146 దేశాల్లో 135వ స్థానం మనది. అలాంటి మన దేశం వైపు ఒక విషయంలో మాత్రం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అదే.. ఏవియేషన్‌ రంగం. ఎంతో ధైర్యం, సాహసం, చాకచక్యం అవసరమైన దీనిలో.. ప్రపంచంతో పోలిస్తే మనదే హవా మరి!

మ్మాయిలు.. పైలట్లు అన్న విషయం మనల్ని పెద్దగా ఆశ్చర్యపరచదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎంతో మంది మహిళలు పైలట్లుగా రాణిస్తున్నారు. ప్రేమ్‌ మాథుర్‌ని ఏకంగా ఎనిమిది వైమానిక సంస్థలు తిరస్కరించాయి. అయినా పట్టు వదలక 1947లో హైదరాబాద్‌లోని డెక్కన్‌ ఎయిర్‌వేస్‌లో 38 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించింది. తను తొలి భారత మహిళా కమర్షియల్‌ పైలట్‌. ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, మౌంట్‌ బాటెన్‌ వంటి ప్రముఖులెందరో ఈమె ప్రయాణికులే. ఈవిడ జేడీ బిర్లా ప్రైవేట్‌ జెట్‌ పైలట్‌ కూడా.


* విమానాన్ని నడపాలనుకున్న దర్బా బెనర్జీని ఫ్లైట్‌ అటెండెంట్‌గా చేర్చుకున్నారు. 1950లనాటి మాటిది. కానీ ఆవిడ లక్ష్యమది కాదు! పట్టుబట్టి పైలట్‌ కొలువు సాధించడమే కాదు 1956లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో కెప్టెన్‌ అయ్యింది. టోర్నడో ఎ-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన తొలి మహిళగా కూడా ఎదిగింది.


* మూడు దశాబ్దాల క్రితమే.. మన నివేదితా భాసిన్‌ ప్రపంచంలోనే అతి పిన్న కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా నిలిచింది. కానీ తొలి నాళ్లలో ఆమె పరిస్థితేంటో తెలుసా? విమాన సిబ్బంది ఆమెను ‘ప్రయాణికులకు కనబడకుండా కాక్‌పిట్‌లోనే ఉండ’మనే వారట. అదేమంటే.. ‘ఒక ఆడపిల్ల విమానం నడుపుతోందంటే ప్రయాణికులు భయపడతార’ని చెప్పేవారట.


* దేశంలో మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ని నడిపింది సరళ టకరాల్‌. అదీ చీర కట్టులో, పెళ్లయ్యాక. 21 ఏళ్ల వయసులోనే పైలట్‌ లైసెన్స్‌ సాధించింది ఈవిడ. వెయ్యి గంటల పాటు విమానాన్ని నడిపి ‘ఎ’ లైసెన్స్‌ పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తొలి భారత మహిళా ఎయిర్‌ మెయిల్‌ పైలట్‌ కూడా!


* వీరంతా మగవాళ్లతో కలిసి విమానం నడిపిన వారే. 1992 వరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పూర్తిగా మహిళలే విమానాన్ని నడిపే అవకాశం దక్కలేదు. 1994లో హరిత కౌర్‌ దేఓల్‌ ఆ అవకాశాన్ని దక్కించుకుని తొలి మహిళా సోలో పైలట్‌ అయ్యింది. అప్పటికి తన వయసు 22 ఏళ్లే.


* జోయా అగర్వాల్‌.. గత ఏడాది పూర్తి మహిళా బృందంతో 17 గంటలపాటు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ను నడిపి, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.


* ఈ ప్రయాణంలో మరో ముందడుగు పడి 2019లో ఫైటర్‌ పైలట్‌ హోదానూ దక్కించుకున్నాం. భావనా కాంత్‌, మోహనా సింగ్‌, అవనీ చతుర్వేది తొలి భారతీయ మహిళా ఫైటర్‌ పైలట్లుగా నిలిచారు.

ఇవన్నీ ఈ రంగంలో మన సత్తాని నిరూపిస్తున్న ఉదాహరణలు. ఇవే ప్రపంచం మనవైపు ఆసక్తిగా చూడటానికీ కారణమవుతున్నాయి. 12.4.. మనదేశంలో మహిళా పైలట్ల శాతమిది. ప్రపంచంలోనే అగ్రస్థానం కూడా. ఏవియేషన్‌ రంగంలో అగ్రగాములైన అమెరికా, ఆస్ట్రేలియాలు ఈ విషయంలో మన దరిదాపుల్లో లేవు. ఎందుకంటే వాటి శాతాలు 5.5, 4.7 మాత్రమే.


ఏంటీ.. ప్రత్యేకత!

1983- 1997 మధ్య ప్రమాదానికి గురైన విమానాలపై ఓ పరిశోధన జరిగింది. ఆ నివేదిక ప్రకారం.. వాటిని నడిపిన వారిలో మగ పైలట్లే ఎక్కువ. మహిళలు రిస్క్‌ అవకాశాలను పలుమార్లు అంచనా వేసి, ఆ తర్వాతే పనిలోకి దిగుతారట. అందుకే ప్రమాదాలు తక్కువనేది నిపుణుల మాట. పైగా వీరికి ఆంక్షలు, సమాజ కట్టుబాట్లు ఎక్కువ. అందుకే తమని తాము నిరూపించుకోవాలన్న తపనతో ఎక్కువ కష్టపడతారట. తప్పుకు ఆస్కారమివ్వొద్దని ప్రతి విషయాన్నీ సూక్ష్మ పరిశీలన చేస్తారట. సంస్థలు కోరుకునే లక్షణాలు ఇవేగా మరి. అందుకే అవీ అమ్మాయిలకు  ప్రోత్సాహమిస్తున్నాయి.

ఎన్నో సదుపాయాలు...

అదేసమయంలో... మహిళలకుండే అదనపు బాధ్యతలను ఎయిర్‌లైన్స్‌ సంస్థలూ అర్థం చేసుకుంటున్నాయి. వీలున్న సమయాల్లోనే పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. గర్భధారణ సమయంలో తగిన విశ్రాంతిని ఇస్తున్నాయి. జీతంతో 26 వారాల ప్రసూతి సెలవులు ఇస్తున్నాయి. పిల్లల కోసం క్రెష్‌లనీ ఏర్పాటు చేశాయి. పాపాయికి అయిదేళ్లు వచ్చే వరకూ నెలలో 2 వారాలు సెలవునీ తీసుకోవచ్చు. మహిళా పైలట్లు ప్రసవం తర్వాత తిరిగి విమానం నడిపే వరకూ గ్రౌండ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో తాత్కాలికంగా పనిచేసే వీలునీ కొన్ని కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు అర్ధరాత్రి వేళల్లో విధులయ్యాక మహిళా పైలట్లను ఇంటి దగ్గర సురక్షితంగా దింపేలా భద్రతా సిబ్బందినీ తోడిచ్చి పంపుతున్నాయి. ఇంట్లోవాళ్లూ అమ్మాయిలకు మద్దతిస్తున్నారు. రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండటానికి అనుమతిస్తున్నారు.. ఇవన్నీ మనకు కలిసొస్తున్న అంశాలే.


విమానయాన సంస్థలు కొన్ని తగినంత సిబ్బంది లేక విమానాల్ని రద్దు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. బోయింగ్‌ సంస్థ లెక్కల ప్రకారం.. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకుపైగా పైలట్లు కావాలి. దేశంలోనూ... 2025 నాటికి 220 కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ ప్రారంభించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికి తగ్గట్టుగా శిక్షణ సంస్థలూ ఏర్పాటవుతున్నాయి. వీళ్ల మొగ్గు ఎక్కువగా మనవైపే! అంటే లెక్కలేనన్ని అవకాశాలు మన ముందు ఉన్నాయన్నమాట. ఈ స్ఫూర్తి ప్రదాతలను ప్రేరణగా తీసుకొని సత్తా చాటడమిక మనవంతు. సిద్ధమా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్