ఊరిని ప్రేమించి... అక్షరాలు దిద్దించి..

ఒకవైపు మూఢ నమ్మకాలు... మరోవైపు మద్యం రక్కసి తిష్టవేసిన ఆ ఊరిని.. అక్షరం అనే ఆయుధంతోనే బాగుచేస్తున్నారా దంపతులు. చదువు చెప్పడంలో, సేవలో.. రంగయ్య మాస్టారిలో సగం కాదు.. డబుల్‌ అని నిరూపిస్తున్నారు ఆయన శ్రీమతి కడేర్ల వీణ..

Published : 16 Sep 2022 00:29 IST

ఒకవైపు మూఢ నమ్మకాలు... మరోవైపు మద్యం రక్కసి తిష్టవేసిన ఆ ఊరిని.. అక్షరం అనే ఆయుధంతోనే బాగుచేస్తున్నారా దంపతులు. చదువు చెప్పడంలో, సేవలో.. రంగయ్య మాస్టారిలో సగం కాదు.. డబుల్‌ అని నిరూపిస్తున్నారు ఆయన శ్రీమతి కడేర్ల వీణ..

మట్టిబాటలు స్వాగతం పలికే సావర్‌ఖేడా గ్రామం గురించి ఒకప్పుడు పొరుగు ఊళ్లకి కూడా పెద్దగా తెలియదు. తెలంగాణ రాష్ట్రం కుమురంభీం జిల్లాలో ఉన్న ఈ మారుమూల గ్రామంలోకి పదేళ్ల క్రితం..  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా అడుగు పెట్టారు రంగయ్య మాస్టారు. స్తోమత ఉన్నా, లేకున్నా.. ప్రైవేట్‌ పాఠశాలలే దిక్కు అనుకుంటున్న గ్రామస్థుల ఆలోచనలో మార్పు తీసుకొచ్చారాయన. తన అసాధారణ కృషికి గుర్తింపుగా గతేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందుకున్నారు. సేవలో ఆయనకంటే మరో రెండు అడుగులు ఎక్కువ వేశారు వీణ. బడిలో పిల్లల్ని కన్న బిడ్డల్లా భావిస్తూ, పోటీపరీక్షల్లో గెలుపొందేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారావిడ.

ఆమె సొంతూరు ఆదిలాబాద్‌. వ్యవసాయ కుటుంబం. 2007లో పెళ్లయ్యాక ఉట్నూరు వచ్చారు. బీఏ చదివి టీటీసీ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అన్ని సదుపాయాలూ ఉన్న ఉట్నూరుని వదులుకుని భర్తతో పాటు సావర్‌ఖేడాలో కాపురం పెట్టారు.నలుగురికీ అక్షరజ్ఞానం పంచాలన్న లక్ష్యంతో భర్త పని చేస్తున్న పాఠశాలలోనే ఉచితంగా పాఠాలు చెప్పేవారు. ‘మీ పిల్లల్ని మా బడిలో చేర్పించండి’ అని అడగడాని కంటే ముందు తన ఇద్దరు పిల్లలు అక్షర, అభిరామ్‌లని ఆ బడిలోనే చేర్పించారు. భర్త సొంత డబ్బుతో బడిని బాగు చేద్దామంటే ‘అంత కంటేనా’ అంటూ ప్రోత్సహించారు. ఆ స్ఫూర్తితో గ్రామస్తులూ తలా కొంత వేసుకుని ఆ బడిని పొరుగు గ్రామాలు ముక్కున వేలేసుకొనేలా ఆధునిక వసతులతో తీర్చిదిద్దు కున్నారు. ఇవన్నీ జరిగాక యాభై నాలుగు మంది ఉండే విద్యార్థుల సంఖ్య.. 250కి పెరిగింది. ఇక చేర్చుకోలేం అని బోర్డు పెట్టాల్సి వచ్చింది. పిల్లలు పెరిగారు మరి బోధించడానికి ఉపాధ్యాయులు సరిపోరు కదా. అప్పుడే వీణ రంగంలోకి దిగారు. ‘చదువుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన పిల్లల్ని చూస్తూ ఉండలేకపోయాను. ఖాళీగా కూర్చోవడం కన్నా వాళ్లకు నాలుగు ముక్కలు నేర్పితే తృప్తిగా ఉంటుంది కదా. జీతం లేకపోతే ఏం, నేర్చుకుంటున్నప్పుడు వాళ్ల కళ్లల్లో సంతోషం చాలదూ’ అంటారావిడ.

మహిళల కోసం రాత్రిబడి..

రంగయ్య మాస్టారి కృషితో గ్రామంలో మద్యనిషేధం అమలవుతోంది. మరి వీణ ఏం చేస్తున్నారంటే...

‘మా ఊళ్లో 114 కుటుంబాలుండగా.. అందులో 550 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో ఎక్కువమంది నిరక్షరాస్యులే. వాళ్లకి అక్షర జ్ఞానం అందించి మూఢనమ్మకాలకి దూరం చేయాలన్నది నా లక్ష్యం. ముఖ్యంగా ఏ ఇంట్లోనూ బాల్యవివాహాలు జరగకూడదనేది నా కోరిక. అందుకే రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో ఆడవాళ్లకి పాఠాలు చెబుతుంటా. ఈ ఏడాది చివర్లో ఎలాగైనా మా గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన గ్రామంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని వివరించారు వీణ. ‘పండగలు, వేడుకలు అన్నీ గ్రామస్థులతో కలిసి చేసుకుంటాం. ఈ ఊరే మా కుటుంబం’ అంటారు వీణ. ఊరివాళ్లూ వీరిని సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. అందుకే రంగయ్య మాస్టారు వేరే చోటుకి బదిలీ అయినా గ్రామస్థులు పట్టుపట్టి మరీ ఆయన్ని ఇక్కడే ఉండేలా ఉన్నతాధికారులను ఒప్పించారు.


ఇంటినే శిక్షణ కేంద్రంగా...

అంతటితో తన బాధ్యత అయిపోయింది అనుకోలేదు వీణ. వాళ్లకు మరింత మంచి భవిష్యత్తు అందేలా ఏదైనా చేయాలనుకున్నారు. అప్పుడొచ్చిందీ ఆలోచన... నవోదయ, గురుకుల పాఠశాలల్లో.. ప్రవేశాలు పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టారు. ఏడాది పొడవునా బడిలో పాఠాలు చెప్పే వీణ వేసవిలో ఉట్నూరులో ఉన్న సొంత ఇంటిని పోటీ పరీక్షల శిక్షణా కేంద్రంగా మారుస్తారు. అక్కడకొచ్చే పిల్లలందరికీ భోజనం, వసతి ఉచితంగా అందిస్తారు. ఇంతవరకూ ఆమె దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లలో 120 మంది గురుకుల, నవోదయ పాఠశాలల్లో ప్రవేశం పొందారు. సావర్‌ఖేడా స్కూల్లో సీటు దొరికితే.. పోటీపరీక్షల్లో గెలిచినట్టే అనేలా కృషి చేశారామె. ‘మా పాఠశాలని కార్పొరేట్‌ పాఠశాలకి దీటుగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక. నాకు మాత్రం అక్కడ చదువుకున్న పిల్లలని ఉన్నతోద్యోగాల్లో చూడాలని ఆశ. అందుకే ఈ ఉచిత శిక్షణ. ఏటా 20-30 మంది పిల్లలు మా ఇంట్లోనే ఉంటారు. నా పిల్లలకూ, వాళ్లకూ నాకేమీ తేడా కనిపించదు. ఆ నమ్మకం ఉంది కాబట్టే వాళ్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నా దగ్గరకు పంపడానికి పోటీ పడుతుంటారు. ఇక ఖర్చు అంటారా? మా వారి జీతంలో సగం ఇలాంటి కార్యక్రమాలకే ఖర్చుపెడతాం. ఇంతవరకూ ఏ ఆర్థిక ఇబ్బందీ రాలేదు. ఇకపైనా ఇలానే ఉంటాం’ అంటారు వీణ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్