ఆమె సిగలో ‘తొలి’ మణులెన్నో!

‘ఈ అమ్మాయి కాఫీ ఇవ్వడానికా?’, ‘నీకిక్కడ అడుగు పెట్టే అనుమతి లేదు’.. లాంటి వ్యాఖ్యలను దాటి.. కెన్నెడి స్పేస్‌ సెంటర్‌ (కేఎస్‌సీ) డైరెక్టర్‌ అయ్యారు జోవాన్‌ మోర్గాన్‌. మేథ్స్‌, సైన్స్‌ అంటే ఇష్టం.

Published : 07 Oct 2022 00:15 IST

అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం

‘ఈ అమ్మాయి కాఫీ ఇవ్వడానికా?’, ‘నీకిక్కడ అడుగు పెట్టే అనుమతి లేదు’.. లాంటి వ్యాఖ్యలను దాటి.. కెన్నెడి స్పేస్‌ సెంటర్‌ (కేఎస్‌సీ) డైరెక్టర్‌ అయ్యారు జోవాన్‌ మోర్గాన్‌. మేథ్స్‌, సైన్స్‌ అంటే ఇష్టం. మ్యూజిక్‌ అంటే పిచ్చి.మ్యూజిక్‌ టీచర్‌ అవ్వాలనుకున్నారు. కానీ తన కుటుంబం ఫ్లోరిడాకు మారింది. స్కూలుకి దగ్గర్లోని నది మీదుగా వెళ్లే రాకెట్లు చిన్నారి మోర్గాన్‌ను ఆకర్షించాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుండేది. డిగ్రీలో ఉన్నపుడు ఆర్మీ బాలిస్టిక్‌ మిసైల్‌ ఏజెన్సీలో ఖాళీల ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్న్‌గా ఎంపికైంది. అప్పటికి తన వయసు 17. తర్వాత కొత్తగా ఏర్పడిన ‘నాసా’లో సెలవుల్లో పనిచేసేది. ఆవిడ రాసిన టెక్నికల్‌ పేపర్లు, డేటా సిస్టమ్స్‌, కంప్యూటర్‌ కాంపొనెంట్లపై అలవోకగా పనిచేసే తీరు పైవాళ్లని ఆకర్షించాయి. కొన్ని సర్టిఫికేషన్లు చేయించి మరీ జూనియర్‌ ఇంజినీర్‌గా తీసుకున్నారు. అలా నాసాలో తొలి మహిళా ఇంజినీర్‌ అయ్యారు.

గణిత ప్రావీణ్యం, కమ్యూనికేటర్‌గా గుర్తింపు, ఇంజినీరింగ్‌ నైపుణ్యాలున్నా.. చిన్నచూపు తప్పలేదు. అయినా తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చారు. చంద్రుడిపై మానవ సహిత వ్యోమనౌక లాంచింగ్‌ బృందంలో భాగస్వామైన తొలి మహిళగా నిలిచారు. తర్వాతిక కెరియర్‌ దూసుకెళ్లింది. నాసా నుంచి సోలన్‌ ఫెలోషిప్‌ సాధించి స్టాన్‌ఫర్డ్‌లో మాస్టర్స్‌ చేశారు. ఆ తర్వాత తొలి మహిళగా కేఎస్‌సీ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. నాలుగు దశాబ్దాలకుపైగా సేవ లందించి 2003లో రిటైరయ్యారు. స్టెమ్‌ కోర్సుల్లోకి అమ్మాయిలను ఆకర్షించడానికి తనే స్కాలర్‌షిప్‌లూ అందిస్తున్నారు.

‘ఏ విభాగానికెళ్లినా అంతా మగవాళ్లే. ఒంటరిదాన్ననే భావన. కానీ కసితో పనిచేశా. చంద్రుడిపైకి వ్యోమనౌక పంపినపుడు ఆ లాంచింగ్‌ రూమ్‌లో నేనొక్కదాన్నే అమ్మాయిని. ఆ ఫొటో చూసినప్పుడల్లా అలాంటిది మరోటి రావొద్దని కోరుకునేదాన్ని’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్