అప్పు చేసి అన్నం పెట్టేదాన్ని..!

పదేళ్ల పసివాడిని పోగొట్టుకున్న బాధ నుంచి కోలుకోవడానికి ఏ దారీ దొరకలేదా అమ్మకి. పిల్లలుండీ ఆదరణకు నోచుకోని వృద్ధులకు బిడ్డగా మారి సేవ చేయడంలో ఊరట లభించింది. ఒక అవ్వకు అండగా ఉండటంతో మొదలైన గాజుల రేవతి సేవా ప్రయాణం నేడు నాలుగు వృద్ధాశ్రమాలు నిర్వహించే వరకూ వెళ్లింది.. అది ఆవిడ మాటల్లోనే...

Updated : 16 Nov 2022 07:44 IST

పదేళ్ల పసివాడిని పోగొట్టుకున్న బాధ నుంచి కోలుకోవడానికి ఏ దారీ దొరకలేదా అమ్మకి. పిల్లలుండీ ఆదరణకు నోచుకోని వృద్ధులకు బిడ్డగా మారి సేవ చేయడంలో ఊరట లభించింది. ఒక అవ్వకు అండగా ఉండటంతో మొదలైన గాజుల రేవతి సేవా ప్రయాణం నేడు నాలుగు వృద్ధాశ్రమాలు నిర్వహించే వరకూ వెళ్లింది.. అది ఆవిడ మాటల్లోనే...

నేను పుట్టింది పలమనేరులోనే అయినా నాన్న నర్రా రామయ్య నాయుడు పుంగనూరులో వెటర్నరీ అసిస్టెంట్‌గా చేసేవారు. దాంతో అక్కడే పెరిగా. నా చిన్నతనంలో... ఇంటి ఎదురుగా ఉండే ఓ అవ్వ చనిపోతే చివరి చూపు చూడ్డానికి అయినవాళ్లు ఒక్కరూ రాలేదు. ‘నాన్నా.. అలాంటి వాళ్లకోసం ఏదో ఒకటి చేద్దాం’ అన్నా. ‘నేను రిటైర్‌ అయ్యాక అలాగే చేద్దాం. అప్పుడైతే నేనూ నీకు సాయం చేస్తా’నని నవ్వారు నాన్న. కానీ ఆ సందర్భం మరోరకంగా వస్తుందని ఊహించలేదు. డిగ్రీ చదువుతుండగా పెళ్లయ్యింది. మావారు నటరాజ్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి. అందులో నష్టపోవడంతో.. బెంగళూరు వెళ్లాం. నేనక్కడ కాయగూరల దుకాణం నడిపేదాన్ని. ఇద్దరు అబ్బాయిలు. కాస్త కోలుకుంటున్నాం అనుకుంటుండగా చిన్నబ్బాయి విష్ణువర్ధన్‌ పదేళ్ల వయసులో, ప్రమాదవశాత్తు నీటిలోపడి చనిపోయాడు. ఆ బెంగతో నాన్న కూడా దూరమయ్యారు. ఆ విషాదం నుంచి తేరుకోలేక పుంగనూరు వచ్చేశా. మావారు ‘బాబు జ్ఞాపకార్థం పొలంలో గుడికట్టిద్దాం’ అన్నారు. నలుగురు పెద్దవాళ్లకు నీడనిచ్చే వృద్ధాశ్రమం మేలన్నా. ఇది తెలిసిన ఓ పెద్దావిడ ఆ ఆశ్రమంలో నేనే మొదటి వ్యక్తిని అంటూ వచ్చారు. పిల్లలున్నా ఆవిడకి అన్నం పెట్టేవారు కాదు. అలా 2016లో.. మా పొలంలో ‘తెలుగుతల్లి వృద్ధాశ్రమం’ మొదలుపెట్టాం. నిర్మాణం అయ్యే వరకూ కొందరిని ఇంట్లోనే ఉంచుకున్నా. ఆలోగా ఒకావిడ చనిపోతే అంత్యక్రియలు చేశాం. ఇది తెలిసిన బంధువులు పోట్లాటకొచ్చారు. ఆశ్రమం మొదలయితే ఇలాంటివి చాలా చూడాలి అనుకుంటూ ముందుకు కదిలా. చేతిలో డబ్బుండేది కాదు. ఇంట్లో ఉన్న వాటితోనే పెద్దవాళ్లకి వండిపెట్టేదాన్ని. నెమ్మదిగా ఆశ్రితుల సంఖ్య పెరిగింది. దాంతో కొన్నిసార్లు దుకాణాల్లో అప్పు చేసి సరకులు తెచ్చి, వాయిదా పద్ధతిలో చెల్లించే వాళ్లం. అంత్యక్రియలకూ ఎక్కువే ఖర్చయ్యేది. తర్వాత మా గురించి తెలిసి అన్నదానం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. జయంతి, వర్ధంతి, పుట్టిన రోజు వేడుకలప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అదో ఊరట. పుంగనూరు తర్వాత తిరుపతిలో రెండు, పాకాలలో ఒక ఆశ్రమాన్ని మొదలుపెట్టాం. పాకాలలో దాత ఒకరు భవనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఆశ్రమాలను నడిపేందుకు 25 మందికి ఉన్నారు. వీళ్లంతా పగలూ, రాత్రి పెద్దవాళ్లతోనే ఉండి సేవ చేస్తారు. వీళ్లలో చాలామందికి పిల్లలు ఉంటారు. కానీ పలకరించేది తక్కువే. వీళ్ల పింఛన్లు, ఏటీఎమ్‌ కార్డులు తీసేసుకుని ఏదన్నా అవసరం ఉంటే వస్తారు. అలాంటప్పుడు పెద్ద వాళ్లు పిల్లలతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు సర్దిచెబుతుంటాం. పెద్దవాళ్లు కదా...తరచూ ఏవో సమస్యలుంటాయి. అర్ధరాత్రైనా, అపరాత్రైనా వెళ్లి చూసొస్తా.


120మందికి అంత్యక్రియలు...

రోనా సమయంలో సమయానికి భోజనం అందించడం కోసం చాలా కష్టపడ్డాం. ఒక్కరికి కూడా కరోనా సోకకుండా జాగ్రత్తపడ్డాం. అదే సంతోషం. భోజనాల ఖర్చు తప్ప మిగి లిన వ్యయాన్ని మావారు భరిస్తున్నారు. మా అమ్మ భానుమతి.. తన పింఛను డబ్బుని ఈ సేవకే అందిస్తుంది. పెద్దవాళ్లకి తనే వండి పెడుతుంది. పెద్దబ్బాయి హర్షవర్ధన్‌ ఎంబీయే చదివి ఐటీ ఉద్యోగంలో చేరాడు. తన జీతాన్ని ఈ సేవకే ఖర్చు చేస్తున్నాడు. ఎందరో వైద్యులు ఉచిత వైద్యసేవలు చేస్తున్నారు. న్యాయమూర్తులు వచ్చి వృద్ధుల హక్కులపై అవగాహన కల్పిస్తుంటారు. వీళ్లందరి సహకారంతో ఈ సేవాప్రయాణం సజావుగా సాగుతోంది. ఇంత వరకూ 120 మందికి గౌరవంగా అంత్యక్రియలు చేశాం. జీవితమంతా ధారపోసిన పెద్దవాళ్లకి ఇది మా నివాళి అనుకుని తృప్తి పడుతుంటా.    

- యస్వీ రమణ, పుంగనూరు, చిత్తూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్