ఆయనకు సాయం చేద్దామనుకున్నా! కోట్ల వ్యాపారమైంది!

పదోతరగతి మాత్రమే చదివారామె.. తీరిక దొరికినప్పుడు చీరలపై పెయింట్‌ వేయడం తన అభిరుచి. ఆ కళతోనే వ్యాపారాన్ని ప్రారంభించి నేడు 2 వేలమందికిపైగా ఉపాధినిస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన వేమిరెడ్డి గాయత్రిరెడ్డి.

Updated : 27 Apr 2023 10:03 IST

పదోతరగతి మాత్రమే చదివారామె.. తీరిక దొరికినప్పుడు చీరలపై పెయింట్‌ వేయడం తన అభిరుచి. ఆ కళతోనే వ్యాపారాన్ని ప్రారంభించి నేడు 2 వేలమందికిపైగా ఉపాధినిస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన వేమిరెడ్డి గాయత్రిరెడ్డి.. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లని వసుంధరతో ముచ్చటించారు...

నెల్లూరు జిల్లా మైపాడు మా సొంతూరు. మావారు శ్రీనివాస్‌రెడ్డి, సివిల్‌ కాంట్రాక్టర్‌. 1991లో హైదరాబాద్‌కొచ్చాం. నేను చదివింది పదోతరగతే. పెళ్లి తర్వాతే దూరవిద్యలో డిగ్రీ చేశా. ఆయన ఉత్తరాది రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తుంటే.. నేను పిల్లలు, చదువుల కోసం హైదరాబాద్‌లోనే ఉండి పోయా. 2008లో ఆయనకు  బిల్లులు రావడం ఆలస్యమైంది. చాలా ఆర్థిక ఇబ్బందులెదురయ్యాయి. అప్పటికి పిల్లలు కాస్త ఎదిగారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఏం చేయగలనా అని ఆలోచించా. చిన్నప్పుడు పెయింటింగ్స్‌ బాగా వేసేదాన్ని. చీరలంటే ఇష్టం. ఈ రెండింటినీ కలిపితే? అన్న ఆలోచనొచ్చింది. ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్‌ డిజైనర్‌ స్టూడియో’ని ప్రారంభించా. అప్పట్లో నేత చీరలపై మాత్రమే ప్రింటింగ్‌ కనిపించేది. నేను ఉప్పాడ, వెంకటగిరి నేత చీరలపైనా ప్రింట్లు వేయించాలనుకున్నా. ఇద్దరు సిబ్బందితో ఆ పనిని ప్రారంభించా.

22 గంటలు నిలుచునే..

పని మొదలు పెట్టినంత తేలిక్కాదు మార్కెట్‌లోకి వెళ్లడమని కొన్ని రోజులకే అర్థమైంది. చాలా సమస్యలెదుర్కొన్నా. మా ఉత్పత్తుల గురించి తెలియడానికి మూడేళ్లు పట్టింది. పట్టు చీరలపైనా ప్రింటెడ్‌ డిజైన్లు చేసేదాన్ని. ఎంతో ఖర్చు పెట్టి చేసిన తర్వాత... అమ్మో ఇంత ఖరీదా అనేవారు. అమ్ముడుపోయినా అవీ అరువు బేరాలు. డబ్బు కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఏదేమైనా ముడిసరకు సరఫరాదారులకు, సిబ్బందికి డబ్బు చెల్లించాలి కదా. ఇలా చాలా ఇబ్బందులెన్నో దాటా. ఎవరైనా ప్రింటెడ్‌ డిజైన్లు కావాలని అడిగితే 22 గంటలపాటు నిలబడే పని చేసేదాన్ని. పనిలో మా నాణ్యత, వైవిధ్యం చూసి నెమ్మదిగా అమ్మకాలు పెరిగాయి.

దేశవ్యాప్తంగా..

నాణ్యమైన వస్త్రం కోసం దేశమంతా తిరిగేదాన్ని. అప్పటివరకు ఒంటరిగా కాలు బయట పెట్టని నేను, ఇతర రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు భయం వేసేది. నాకు నేనే ధైర్యం చెప్పుకొనే దాన్ని. పెళ్లైన కొత్తలో ఉత్తరాదిన ఉండేవాళ్లం. అప్పుడే హిందీ నేర్చుకున్నా. అది నాకిప్పుడు ఉపయోగపడింది. అలా తమిళనాట 50 గ్రామాల నుంచి దాదాపు 100మందికిపైగా చేనేత కళాకారుల నుంచి పట్టు వస్త్రాన్ని, ఉత్తరాది నుంచి పట్టు సహా మరికొన్ని రకాలను ఎంపిక చేసి తెప్పిస్తున్నా. మొదట్లో ఒక్కోసారి ఇంత కష్టపడాలా అని నిరుత్సాహమొచ్చేది. ఆ వెంటనే... వెనకడుగు వేయకూడదు, ఎలాగైనా విజయం సాధించాలని అనుకునేదాన్ని. నా ప్రయత్నం ఫలించింది. ఏడేళ్లు కష్టపడ్డాక పూర్తిగా నిలదొక్కుకోగలిగా. ఇప్పుడు మగ్గం వర్క్‌, ప్రింటింగ్‌.. ఇలా పలు విభాగాలు, కళాకారులు కలిసి మొత్తం 2 వేలమందికి ఉపాధినివ్వగలుగుతున్నా. వీళ్లలో వెయ్యిమందికిపైగా మహిళలే! మా ఉత్పత్తులు అమెరికా, లండన్‌ దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.

కరోనాలో..

అందరిలానే మేమూ సరకు అమ్ముడుపోక చాలా ఇబ్బందులు పడ్డాం. రూ.10 లక్షల ఉత్పత్తులు గోడౌన్‌లోనే ఉండిపోయాయి. ఏం చేయాలా అనుకున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌లో చీరల వీడియోలు పెట్టేదాన్ని. వాటిని వేలమంది చూసేవారు. లాక్‌డౌన్‌ ఎత్తేసేసరికి మా షోరూం ముందు కార్లు క్యూ కట్టాయి. వారం పదిరోజులు ఆ వీధంతా కిక్కిరిసిపోయింది. అలా పుంజుకున్నాం. మాతో కలిసి పని చేస్తున్న చేనేత కళాకారులందరికీ కరోనా సమయంలో రూ.కోటి వరకూ సాయం చేశా. ఇప్పుడు మాకు హైదరాబాదు నగరంలో 4 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ఏడాదికి రూ.60 నుంచి రూ.80 కోట్ల వరకూ వ్యాపారం చేస్తున్నాం. రాజకీయ ప్రముఖులు, నటీనటులు మా వినియోగదారులు అంటే గర్వంగా ఉంటుంది. మనసుకు నచ్చిన పనిచేస్తే గెలవడం సులభం. అలాగే చేసే పనిపై అవగాహన పెంచుకోవాలి. మీకంటూ కొత్త దారి వేసుకోవాలి. అప్పుడే విజయం మీదవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్