సెలెబ్రిటీల టీచరమ్మ!

భాషే తెలియని సంయుక్త మేనన్‌.. తెలుగులో డైలాగులు ఇరగదీసేస్తోంది. మన తెలుగబ్బాయి అభినవ్‌ గోమఠం.. చక్కగా తమిళం మాట్లాడుతూ కోలీవుడ్‌లోనూ అవకాశాలు పొందుతున్నాడు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన యువతి ఉన్నత విద్య కోసం విదేశానికి వెళ్లింది. ఇంగ్లిష్‌ మాట్లాడటమే తెలియని తనక్కడ ఉద్యోగం సాధించింది.

Published : 11 Mar 2024 02:23 IST

భాషే తెలియని సంయుక్త మేనన్‌.. తెలుగులో డైలాగులు ఇరగదీసేస్తోంది. మన తెలుగబ్బాయి అభినవ్‌ గోమఠం.. చక్కగా తమిళం మాట్లాడుతూ కోలీవుడ్‌లోనూ అవకాశాలు పొందుతున్నాడు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన యువతి ఉన్నత విద్య కోసం విదేశానికి వెళ్లింది. ఇంగ్లిష్‌ మాట్లాడటమే తెలియని తనక్కడ ఉద్యోగం సాధించింది. ప్రేమ పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడిందో కేరళ మహిళ. ఇక్కడి భాషే తెలియని ఆమె తెలుగులో పుస్తకాలు రాసేస్తోంది. ఒక్కరా ఇద్దరా... విద్యార్థుల నుంచి ప్రముఖుల వరకు ఎంతోమంది భాషపై పట్టు సాధించేలా చేస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన మంగళ ఆశా...

టీచర్‌గా విద్యార్థుల భవిష్యత్తు చక్కబెట్టాలనుకున్నారు... ఆశా. కానీ ఓ ప్రమాదంలో ఆమె కాలు విరగడంతో తన జీవితం మలుపు తిరిగింది. ఆరోగ్యం క్షీణించి... తన పని తాను చేసుకోలేని పరిస్థితికి వచ్చినా కుంగిపోకుండా ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులకు గురువయ్యారు. సాధారణ మహిళలు, కొత్త భాష నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు, సినిమా ప్రముఖులు ఇలా ఎందరో ఇప్పుడామె విద్యార్థులు. తొలిరోజుల్లో ఆంగ్ల పాఠాలే చెప్పేవారు. పుట్టి పెరిగిందంతా కడపలో అయినా ఈమె పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు. దీంతో తమిళంలోనూ ప్రావీణ్యం ఉంది. అలాంటప్పుడు కేవలం ఆంగ్లంలోనే ఎందుకు? తెలుగు, తమిళాల్లోనూ శిక్షణ ఇస్తే అన్న ఆలోచన వచ్చి ఆచరణలో పెట్టారు. ఆన్‌లైన్‌లో కదా... వింటూ భాషను నేర్చుకోగలమా అనే అనుమానం నేర్చుకునే వారికి సహజమే! అది పోగొట్టడానికి వైట్‌ బోర్డుపై అక్షరాలు రాస్తూ... అభ్యాసం చేయిస్తున్నారు. ఇప్పుడు అమెరికా, జార్జియా, సింగపూర్‌, దుబాయ్‌.. అనేక ప్రాంతాల్లోని పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు.

సినిమా రంగంలో..

చిత్ర పరిశ్రమలో కొత్తగా దూసుకొస్తున్న తారలెందరో. వేరే రాష్ట్రాలవాళ్లు మన దగ్గర, ఇక్కడ సాధించిన విజయాలతో ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతున్న మనవాళ్లనీ చూస్తూనే ఉన్నాం. వారికీ సాయం చేస్తున్నారు ఆశా. కేరళా కుట్టి సంయుక్త మేనన్‌, మన తెలుగబ్బాయి అభినవ్‌ గోమఠం, టెంపర్‌ వంశీ, సాయేషా సైగల్‌... ఇలా సినీరంగంలో 30 మంది తన దగ్గర భాష నేర్చుకుంటున్న వారే. ఇప్పటికీ సెట్‌లో ఉన్నప్పుడు ఏవైనా డైలాగులు, స్క్రిప్ట్‌ అర్థమవ్వకపోతే ఈమెనే సంప్రదిస్తారట. సెలెబ్రిటీలమని గొప్పలకు పోకుండా ఆసక్తిగా వింటారనీ చెబుతున్నారీమె. ‘పాన్‌ ఇండియా స్థాయిలో బాహుబలి విడుదలయ్యాక విద్యార్థులు పెరిగారు. ఎన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చినా ఆ సినిమాని తెలుగులో చూడటానికే ఇష్టపడి ఎంతోమంది భాష నేర్చుకున్నారు. నేను చిన్న పిల్లల వాయిస్‌నీ చక్కగా ఇమిటేట్‌ చేస్తా. రేడియోలో చాలాసార్లు వాయిస్‌ ఓవర్‌ కూడా ఇచ్చా. ప్రేమ పెళ్లి చేసుకుని వేరే చోట స్థిరపడిన ఎంతోమంది మహిళలకు తమిళం, తెలుగు నేర్పించా’నని చెబుతోన్న ఆశా రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డునీ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్