Updated : 03/04/2021 03:38 IST

కొబ్బరితో.... కాఫీలు... లాభాలు!

గర్భిణిగా ఉన్న నీలిమ రోజూ కొబ్బరినీళ్లు తాగేవారు... ఆరోగ్యం కోసం. అవి ఒకరోజు పుల్లగా, మరో రోజు తియ్యగా... ఇంకో రోజు వగరుగా ఉండేవి. అలా కాకుండా ఆరోగ్యకరమైన కొబ్బరినీళ్లకు కొత్తరుచులని అద్దాలనుకున్నారు డాక్టర్‌ నీలిమా తిప్పావఝ్జల. ఆసక్తితో కొబ్బరి కాఫీ, ఐస్‌క్రీం... పల్ప్‌షేక్స్‌ ఇలా 120 రకాల రుచులకు శ్రీకారం చుట్టారామె. ప్రధానమంత్రి అభినందనలు అందుకున్న ఆమె వ్యాపార సూత్రాన్ని ఎన్నో అంతర్జాతీయ మ్యాగజైన్లూ ప్రశంసించాయి....
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నీలిమ వృత్తిరీత్యా దంత వైద్యురాలు. వివాహం తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నారు. గర్భిణిగా ఉండగా కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకొమ్మన్నారు వైద్యులు. రోజుకో తీరుగా ఉండేది వాటి రుచి. పరమచప్పగా ఉన్నరోజు తాగలేక ఇబ్బంది పడేవారు నీలిమ. అలాకాకుండా వీటికి నచ్చిన పండ్లను కలిపి తాగితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి.. అలానే చేసి చూశారు. నెలరోజులకే ఆరోగ్యం కుదుటపడింది. మనసులో మాత్రం ‘కొబ్బరినీళ్లతో ప్రయోగాలు చేస్తే?..’ అన్న ఆలోచన అలానే ఉండిపోయింది. కొన్నిరోజుల తర్వాత ఆ  ఆలోచనను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టారు. కానీ అన్ని రకాల పండ్లనూ కొబ్బరినీళ్లతో కలపలేం అని తెలుసుకున్నారు. కొబ్బరిలోని పోషకాల గురించే కాకుండా ఇతర పండ్లలోని పోషకాల గురించి కూడా తెలుసుకునేందుకు ఎమ్మెస్సీ న్యూట్రిషన్‌ కోర్సు చేశారు. మొదటిసారి కొన్ని ‘మాక్‌టైల్స్‌’ను తయారుచేసి ఆ శాంపిళ్లను చిన్నచిన్న రెస్టారెంట్లకు అందించారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ‘మావారు చైతన్య సాయంతో 2014లో ‘కోకోట్యాంగ్‌’ పేరుతో మా తొలి ఉత్పత్తులని విడుదల చేశాం. అక్కడ్నుంచి ఆరు నెలల్లోపే మరో 40 రకాలను తయారుచేశాం. పోషక విలువలున్న ఈ పానీయాలకు మంచి పేరు వచ్చింది.  అంతటితో ఆగిపోకుండా ‘పల్ప్‌ షేక్స్‌’ పేరుతో లేతకొబ్బరి మీగడకు పండ్లు, డ్రైఫ్రూట్స్‌వంటివి కలిపి మరో  50రకాల ఉత్పత్తులని విడుదల చేశాం. అయితే కొబ్బరి నీళ్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రత్యేక సమయంలో మాత్రమే చెట్టు నుంచి కాయలను దింపాలి. అలా చేస్తేనే వాటి రుచి కోరుకున్న విధంగా ఉంటుంది. రైతులకు తగిన సూచనలిచ్చి కొబ్బరినీళ్ల సేకరణ చేస్తుంటా’ అంటారు నీలిమ.

లేత కొబ్బరి మీగడతో వినూత్నమైన కాఫీలు, ఐస్‌క్రీమ్‌లు తయారు చేయడంలో ఎన్నో ప్రయోగాలు చేపట్టారు నీలిమ. పాలకు బదులుగా కొబ్బరి మీగడను వాడి 30 రకాల ప్రత్యేకమైన కాఫీలను తయారుచేస్తున్నారామె. ‘వీటి తయారీ, మార్కెటింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొబ్బరినీళ్లను ఎక్కువ సమయం సాధారణ వాతావరణంలో ఉంచలేం. అలా ఉంచితే వాటిలోని పోషకాలు నిర్వీర్యమవుతాయి. ముఖ్యంగా అన్నిరకాల కొబ్బరినీళ్ల్లు   ఒకలా ఉండవు. దాంతో రుచిలో తేడా వస్తుంది. అలా రాకుండా ఒకే రకం రుచితో మా ఉత్పత్తులని అందించడానికి ఎన్నోసార్లు ప్రయోగాలు చేశాను. చాలాసార్లు వైఫల్యాలని ఎదుర్కొన్నాను. ఒక్క ‘పల్ప్‌ షేక్స్‌’ తయారీ కోసమే ఏడాదిపాటు కష్టపడ్డాను.’ అనే నీలిమ కష్టం వృథా పోలేదు. ఒక్క హైదరాబాద్‌లోనే 13 అవుట్‌లెట్స్‌ని ప్రారంభించారామె. కొవిడ్‌ తర్వాత ఆన్‌లైన్‌ విక్రయాలను మొదలుపెట్టారు. 50మందికి ఉపాధిని కల్పిస్తున్న డాక్టర్‌ నీలిమ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. జేసీఐ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతోపాటూ ప్రధాని ప్రశంసలూ అందుకున్నారు. ది బెస్ట్‌ ఉమెన్‌ ఓన్డ్‌ ప్రాజెక్ట్స్‌లో భాగంగా దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ‘కోకోట్యాంగ్‌’ ఆలోచనకు ఈ మన్ననలు దక్కాయి. నాణ్యమైన ఉత్పత్తులని అందిస్తున్న సంస్థగా  బ్రిటీష్‌ రాయబార కార్యాలయం సైతం ప్రశంసించింది. ఈ వినూత్నమైన ఆలోచనకు ‘విజయలక్ష్మి దాస్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డు’తోపాటు రూ.లక్ష నగదు బహుమతినీ అందుకున్నారు నీలిమ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి