Updated : 14/06/2022 17:39 IST

క్యాన్సర్ కబళిస్తోన్నా.. కలలు నెరవేర్చుకుంటోంది!

(Photos: Instagram)

‘కష్టాలనే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేం.. అదే మన లక్ష్యాలపై దృష్టి పెడుతూ సాధించే ఒక్కో విజయం ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది..’ అంటోంది జర్మనీకి చెందిన స్విమ్మర్‌ ఎలేనా సెమెచిన్‌. ఓ అరుదైన సమస్య కారణంగా చిన్న వయసులోనే కంటి చూపుకి దూరమైన ఆమె.. తనకిష్టమైన ఈతపై పట్టు సాధించింది. వివిధ క్రీడా వేదికలపై పతకాల పంట పండించింది. ‘కెరీర్‌ గాడిలో పడింది.. ఇక పెళ్లి చేసుకుందామ’నుకునే సరికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆమె ఆశలకు గండికొట్టింది. అయినా ప్రస్తుతం ఓవైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు క్రీడలోనూ రాణిస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానంటోన్న ఎలేనా క్రీడా జర్నీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

ఎలేనా సెమెచిన్‌.. ఎలేనా క్రాజౌ పేరుతోనూ ఆమె సుపరిచితమే! 1993లో కజకిస్తాన్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆమె.. రష్యాలో పెరిగింది. ఏడేళ్ల వయసున్నప్పుడు Macular Degeneration అనే అరుదైన సమస్య కారణంగా చాలా వరకు కంటి చూపును కోల్పోయిందామె. ఈ సమస్య కారణంగా స్కూల్లోనూ పలు ఇబ్బందుల్ని ఎదుర్కొందామె.

ఈతపై మక్కువతో..!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంపై ఆసక్తి ఉంటుంది. అలా తన అభిరుచి ఈతే అని 11 ఏళ్ల వయసులో గుర్తించింది ఎలేనా. అయితే అప్పటికే తన కుటుంబంతో సహా రష్యా నుంచి జర్మనీకి మారిందామె. అక్కడే ఈతపై పట్టు సాధించింది. ఫ్రీస్టైల్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌.. రెండు విభాగాల్లో ఆరితేరిందీ యువ స్విమ్మర్‌. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ ఈవెంట్లలో పలు పతకాల్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె.. 2012 లండన్‌ పారాలింపిక్స్‌లో రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక వేదికపై పసిడి గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎలేనా కల.. 2016 రియోలోనూ నెరవేరలేదు. అయినా పట్టు వీడకుండా 2020 టోక్యోలో బంగారు పతకం సాధించి మురిసిపోయిందీ చేప పిల్ల.

ఈసారి క్యాన్సర్‌ కారణంగా..!

కెరీర్‌ బాగుంది.. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఈసారి క్యాన్సర్‌ రూపంలో విధి మరోసారి తనకు సవాలు విసిరిందంటోంది ఎలేనా. ‘బంగారు పతకం సాధించాలన్న నా కల 2020 టోక్యో పారాలింపిక్స్‌తో తీరింది. ఆ మరుసటి ఏడాదే నా బాయ్‌ఫ్రెండ్‌, కోచ్‌ ఫిలిప్‌ సెమెచిన్‌ని పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకున్నా. కానీ కొన్ని రోజుల ముందు నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని తేలింది. దీంతో నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఓవైపు భయం, మరోవైపు అనిశ్చితితో కూడిన ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా ఈ బాధను దిగమింగి గుండె ధైర్యం తెచ్చుకున్నా. నా బ్రెయిన్‌ ఆపరేషన్‌కి రెండు రోజుల ముందు ఫిలిప్‌, నేను పెళ్లి చేసుకున్నాం..’ అంటూ తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుందీ జర్మన్‌ స్విమ్మర్.

ఓవైపు చికిత్స.. మరోవైపు సాధన..!

ఆపరేషన్‌ జరిగిన వారం రోజుల్లోపే తిరిగి సాధన మొదలుపెట్టింది ఎలేనా. తర్వాత్తర్వాత కీమోథెరపీ సెషన్స్‌ కొనసాగిస్తూనే.. ప్రాక్టీస్‌కు సమయం కేటాయిస్తూ వస్తోందామె. నిజానికి ఈ సాధన తను త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందంటోన్న ఎలేనా.. ఆపరేషన్‌ జరిగిన ఐదు నెలలకు ‘జర్మన్‌ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచింది. ‘ప్రస్తుతం నాకు కీమోథెరపీ జరుగుతోంది. సానుకూల దృక్పథంతోనే ఈ మహమ్మారితో పోరాడుతోన్నా. అనారోగ్యం ఉందన్న కారణంగా నన్ను నేను బంధించుకోలేను. అందుకే రాబోయే ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ (జూన్‌ 18-జులై 3 వరకు)తో పాటు 2024 ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ తన తదుపరి లక్ష్యాల గురించి పంచుకుందీ బ్రిలియంట్‌ స్విమ్మర్.

నిజానికి ఇలా ఓవైపు క్యాన్సర్‌తో పోరాటం చేస్తూనే.. మరోవైపు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోన్న ఎలేనా.. త్వరలోనే ఈ మహమ్మారిని జయించి తన కలల్ని నెరవేర్చుకోవాలని ఆశిద్దాం..!

ఆల్‌ ది బెస్ట్‌ ఎలేనా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని