Sundar Pichai: తన వల్లే గూగుల్‌లో ఉన్నా..
నేనీ స్థాయికొచ్చానంటే అంజలే కారణం. మేం ఖరగ్‌పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది.
సుందర్ పిచాయ్, సీఈవో, గూగుల్
నేనీ స్థాయికొచ్చానంటే అంజలే కారణం. మేం ఖరగ్‌పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. బీటెక్ అయ్యాక మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లా. తను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా చేరింది. అప్పట్లో అమెరికా నుంచి కాల్ చేయడానికి చాలా ఖర్చయ్యేది. నాదగ్గరేమో డబ్బులుండేవి కావు. ఆరునెలలు మాకు మాటల్లేవు. ఆ దూరం మమ్మల్ని మరింత దగ్గర చేసింది. నేను ఉద్యోగంలో చేరాక వాళ్ల అమ్మానాన్నల అనుమతితో పెళ్లి చేసుకున్నాం.
తన పాత్ర.. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది. ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన తన నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా.
సేవాగుణం.. తనవన్నీ స్వతంత్రభావాలు. మహిళలకు విద్య, ఆర్థిక స్వేచ్ఛ ఎంతో ముఖ్య మంటుంది. మేం అమెరికా వచ్చాక స్టాన్‌ఫర్డ్‌లో మాస్టర్స్ చేసింది. ఇంటి బాధ్యత, ఇద్దరు పిల్లల సంరక్షణతోపాటు ‘ఇన్‌ట్యూట్’లో బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్ గానూ రాణిస్తోంది. ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయం చేయడమెలాగో తన నుంచి నేర్చుకోవచ్చు. అవతలివారి కష్టాన్ని గుర్తించి, సాయం చేయడంలో ముందుంటుంది. చాలా స్వచ్ఛంద సంస్థల తరఫున సేవలందించడమే కాదు, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ వంటి సేవా సంస్థలకు విరాళాలిస్తుంది. భారతదేశంలో కొవిడ్ బాధితులకు రూ1.20 కోట్లు వితరణగా ఇద్దామన్నది తన ఆలోచనే. క్యాలిఫోర్నియాలో ఉన్న ‘ద బే ఏరియా డిస్కవరీ మ్యూజియం’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేద పిల్లల చదువు కోసం కృషి చేస్తోంది. ఆఫ్రికన్ల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఓ సాంస్కృతిక సంస్థతోనూ కలిసి పని చేస్తోంది. ఇవన్నీ నాకు స్ఫూర్తినిస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.