బిడ్డ సమస్యే వ్యాపార సూత్రమైంది!

పసిపిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది బిడ్డకు పుట్టుకతోనే లోపాలున్నాయని తెలిస్తే.. వాటిని అధిగమించడానికి కొత్త మార్గాల్ని అన్వేషించడానికీ వెనకాడదు. గురుగ్రామ్‌కు చెందిన హరిణి శివకుమార్‌ కూడా ఇదే చేసింది.

Updated : 14 Oct 2021 20:19 IST

(Photo: Instagram)

పసిపిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది బిడ్డకు పుట్టుకతోనే లోపాలున్నాయని తెలిస్తే.. వాటిని అధిగమించడానికి కొత్త మార్గాల్ని అన్వేషించడానికీ వెనకాడదు. గురుగ్రామ్‌కు చెందిన హరిణి శివకుమార్‌ కూడా ఇదే చేసింది. ప్రత్యేక అవసరాలు కలిగిన తన కొడుకు చర్మ సమస్యల్ని దూరం చేయడానికి ఏకంగా ఓ బ్యూటీ ఉత్పత్తుల బ్రాండ్‌నే నెలకొల్పిందామె. సహజసిద్ధమైన పదార్థాలతో సబ్బులు, ఇతర వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్ని తయారుచేస్తూ ఎంతోమందికి చేరువైంది. ఈ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించడమేమో గానీ అందరికీ ఉపయోగపడే ఉత్పత్తులు తయారుచేస్తున్నానన్న సంతృప్తే ఎక్కువగా ఉందంటోన్న ఆమె తన వ్యాపార ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

మాది గురుగ్రామ్‌. రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసి బ్యాంకింగ్‌ కెరీర్‌లో స్థిరపడ్డాను. 2009 దాకా ఇల్లు, ఉద్యోగం.. ఇవే నా లోకమయ్యాయి. అయితే అదే ఏడాది నాకు కొడుకు పుట్టాడు. ఏ స్త్రీ అయినా తల్లైతే ఎనలేని ఆనందంలో మునిగి తేలుతుంది. కానీ ఆ క్షణం నా జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. ఎందుకంటే నా కొడుకు డౌన్‌ సిండ్రోమ్‌ సమస్యతో జన్మించాడు. దీనికి ఎగ్జిమా అనే చర్మ సమస్య కూడా తోడవడంతో.. వాడిని ఈ సమస్యల నుంచి బయటపడేయడానికి ఏం చేయాలో పాలుపోలేదు.

కొడుకు కోసమని..!

దీనికి తోడు ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, తద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలున్నాయన్న విషయం తెలుసుకున్నా. పైగా ఎగ్జిమా ఉన్న వారికి బయట దొరికే సువాసన భరిత, రసాయనాలతో కూడిన సబ్బులు పడవని తెలుసుకొని, ఇవి లేని సబ్బుల కోసం అన్వేషణ సాగించా. కానీ అలాంటి ఉత్పత్తి ఒక్కటీ దొరకలేదు. ఈ క్రమంలోనే ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం సహజసిద్ధమైన ఉత్పత్తులే సరైనవని తెలుసుకొని.. అలాంటి వాటిపై దృష్టి పెట్టా. పైగా ఇవి అన్ని చర్మతత్వాల వారికి, అన్ని వయసుల వారికీ సరిపడతాయనిపించింది. అయితే అంతకుముందే నాకు సబ్బుల తయారీ గురించి కొన్ని మెలకువలు తెలుసు. అవి ఇప్పుడు పనికొచ్చాయి. మొత్తానికి ఎన్నో పరిశోధనలు, సమాచార సేకరణ తర్వాత ఎగ్జిమా, సొరియాసిస్‌.. వంటి చర్మ సమస్యలున్న వారికోసం ఇంట్లోనే సబ్బుల తయారీ ప్రారంభించా.

ఇంటి నుంచే మొదలైంది!

అయితే అప్పటి దాకా విదేశాల్లో ఉన్న మా స్నేహితుల సహాయంతో అక్కడ్నుంచి సబ్బులు తెప్పించుకొని నా కొడుకు కోసం వాడేదాన్ని. ఇక ఆ తర్వాత నా చేత్తో స్వయంగా తయారుచేసిన సబ్బుల్ని పలు పరీక్షల అనంతరం నా కొడుక్కి వాడడం మొదలుపెట్టా. అంతేకాదు.. అదనంగా తయారుచేసినవి నా స్నేహితులకు, ఇతర కుటుంబ సభ్యులకు ఇవ్వడం ప్రారంభించా. అవి వాళ్లకూ ఎంతో నచ్చడంతో ఇంకా కావాలంటూ నన్ను కోరేవారు. అప్పుడే ‘Soapworks India’ అనే సబ్బుల తయారీ సంస్థకు బీజం పడింది. మొదట్లో ఇదే పేరుతో ఇంట్లోనే సబ్బులు తయారుచేసి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అమ్మేదాన్ని. ఇక ఆ తర్వాత సహజసిద్ధమైన చర్మ సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన పలు కోర్సుల్ని నేర్చుకొన్న అనంతరం నా వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నా.

అన్నీ సహజసిద్ధమైనవే!

ఈ క్రమంలో నాకు నాన్న సహకారం కూడా తోడైంది. అప్పుడే కంపెనీ పేరును Earth Rhythmగా మార్చడంతో పాటు గురుగ్రామ్‌లోనే తయారీ పరిశ్రమను కూడా నెలకొల్పాం. అంటే.. ఉత్పత్తులే కాదు.. వాటిని నిల్వ చేసే వస్తువులూ పర్యావరణహితమైన, సౌందర్యానికి హాని కలిగించనివై ఉండాలన్నది దీని ముఖ్యోద్దేశం. అందుకే మా ఉత్పత్తుల ప్యాకింగ్‌లో ప్లాస్టిక్‌ అస్సలు వాడం. ఎక్కువగా కార్డ్‌బోర్డ్‌ బాక్సులకే ప్రాధాన్యమిస్తుంటాం. ఇక అందం విషయంలో 20-35 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా బయట దొరికే సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు. పైగా ఆ వయసులోనే మొటిమలు, పిగ్మెంటేషన్‌, కళ్ల కింద నల్లటి వలయాలు.. వంటి చర్మ సమస్యలొస్తుంటాయి. అలాగే జుట్టు సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అందుకే వాటికి చెక్‌ పెట్టేందుకు వివిధ రకాల సబ్బులు, షాంపూలు, సీరమ్స్‌, మాయిశ్చరైజర్స్‌, లిప్‌స్టిక్స్‌, లిప్‌బామ్స్‌.. వంటివి తయారుచేయడం మొదలుపెట్టాం. వీటిలోనూ శీకాకాయ, శెనగపిండి, మెంతులు, మందార, బీస్‌వ్యాక్స్‌, అవకాడో నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె.. వంటి సహజసిద్ధమైన పదార్థాల్నే ఉపయోగిస్తుంటాం. ఇలా మేము తయారుచేసిన ఉత్పత్తుల్ని ల్యాబ్స్‌లో పరీక్షల అనంతరమే మార్కెట్లోకి తీసుకొస్తున్నాం.. అన్ని చర్మతత్వాలు, జుట్టు తత్వాల వారికి సరిపోయేలా వీటిని తయారుచేస్తున్నాం.

నా కొడుకు చర్మ సమస్యలకు సరిపడే ఉత్పత్తి దొరికే దాకా కొన్ని ఇబ్బందులు పడినా.. ఆ తర్వాత మాత్రం నా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతోంది. ఏదేమైనా అన్నింటికంటే నా ఉత్పత్తి నలుగురికీ ఉపయోగపడుతుందన్న సంతృప్తే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తోంది.

జీవితంలో ఎదగాలనుకునే వారికి ఒక్కమాట చెప్పాలనుకుంటున్నా.. సవాళ్లకు వెరవకుండా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చినప్పుడే మనమేంటో నిరూపించుకోగలం! వ్యాపార రంగంలోకి అనుకోకుండా వచ్చినప్పటికీ ఇన్నేళ్ల వ్యాపారంలో నేను నేర్చుకున్నది ఇదే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్