ఫైవ్ స్టార్ హోటళ్లలో.. వీళ్ల చేతి మొఘలాయి రుచులు!

వారంతా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన వారిని ఉన్న చోట ఉండనివ్వలేదు. కానీ వారి అత్తింటి వారు ఇందుకు ససేమిరా అన్నారు. ‘మీరు బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. అంతా ఒక్కచోట చేరి.. ఓ చిన్నసైజు వంటశాలను.......

Updated : 21 Apr 2022 17:27 IST

(Photo: Instagram)

వారంతా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన వారిని ఉన్న చోట ఉండనివ్వలేదు. కానీ వారి అత్తింటి వారు ఇందుకు ససేమిరా అన్నారు. ‘మీరు బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. అంతా ఒక్కచోట చేరి.. ఓ చిన్నసైజు వంటశాలను ఏర్పాటు చేసుకున్నారు. గరిట పట్టి తమ గతి మార్చుకున్నారు. ఇప్పుడు ఎన్నో ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాల్ని తయారుచేయడమే కాదు.. ఏడు శతాబ్దాల నాటి మొఘలాయి రుచుల్ని ఐదు నక్షత్రాల హోటల్స్‌కి చేరవేస్తూ ఆహార ప్రియుల మనసు దోచుకుంటున్నారు. ‘ఆడవాళ్లైనంత మాత్రాన ఆర్థిక స్వేచ్ఛ పొందకూడదని ఎక్కడ రాసుంద’ని ఈ వివక్షాపూరిత సమాజాన్ని ప్రశ్నిస్తోన్న ఈ కుకింగ్‌ క్వీన్స్‌ సక్సెస్‌ఫుల్‌ జర్నీ ఏంటో తెలుసుకుందాం రండి..

దిల్లీకి చెందిన నూర్జహాన్‌కు ఆరో తరగతి పూర్తయ్యాక పెళ్లి చేసేశారు. 23 ఏళ్లు వచ్చే నాటికి ఆమె ఓ బిడ్డకు తల్లి. జీవితంలో ఏదో సాధించాలని ఉన్నా.. చంటి బిడ్డను వదిలి వెళ్లలేదు.. అలాగని వాడిని ఆరళ్లు పెట్టే అత్తగారికీ అప్పగించలేదు. దీనికి తోడు ‘పని సాకుతో నువ్వు బయటికి వెళ్తే.. బాబును ఎవరు చూసుకుంటారు?’ అంటూ ఆమె అత్తింటి వారు దెప్పిపొడిచేవారు. అయినా కాలమే సమాధానం చెబుతుందన్నట్లుగా ఇవన్నీ మౌనంగా భరించిందామె. అంతలోనే బాబుకు మూడేళ్లు నిండాయి. దీంతో వాడిని అటు స్కూల్లో చేర్పించి.. ఇటు తన తపనపై దృష్టి పెట్టిందామె.

వ్యక్తిగత సవాళ్లను జయించి..!

నిజానికి నూర్జహాన్‌కు వంటలంటే చిన్నప్పట్నుంచే ఇష్టం. అందుకే ఈ నైపుణ్యంతోనే ఆర్థిక స్థిరత్వం పొందాలని నిర్ణయించుకుందామె. కానీ ఎలా? వ్యాపారమంటే మాటలు కాదు.. డబ్బుతో ముడిపడిన వ్యవహారం.. లాభాల మాట ఎలా ఉన్నా నష్టమొస్తే నిరుత్సాహపరిచే వారే ఆమె చుట్టూ ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే తనలాంటి మరో పది మంది స్థానిక మహిళల గురించి తెలుసుకుందామె. వాళ్లకూ ఏదైనా చేయాలని ఉన్నా.. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలు, కుటుంబ ఒత్తిళ్ల వల్ల వెనకడుగు వేస్తున్నారని గ్రహించింది నూర్‌. అయినా సరే.. అందరూ కలిసి కట్టుగా అడుగు ముందుకేసి, ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించగలిగారు. ఇలా వీరి పట్టుదలకు ‘ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారం తోడైంది. ఫలితంగా ‘జైకా-ఇ-నిజాముద్దీన్‌’ పేరుతో వారుంటోన్న నిజాముద్దీన్‌ బస్తీలోనే ఓ స్వయం సహాయక బృందంగా ఏర్పడ్డారు ఈ పదకొండు మంది మహిళలు. ఈ క్రమంలోనే ఓ మినీ అధునాతన వంటశాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వాళ్ల ఆలోచన కార్యరూపం దాల్చినట్లైంది.

బస్తీ నుంచి క్యాటరింగ్‌ దాకా..!

నిజానికి ఈ వంటశాలకు బీజం పడింది 2012లోనే..! అయితే ‘మొదట తమ ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు’గా.. తమ బస్తీలో తిష్ఠ వేసిన పోషకాహార లోపం సమస్యపై దృష్టి సారించింది నూర్‌ బృందం. ఈ క్రమంలోనే సమస్య మూలాలేంటో తెలుసుకున్న వారు.. జంక్‌ఫుడే దీనంతటికీ కారణమని గ్రహించారు. దీంతో ఈ అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా హెల్దీ లడ్డూలు, ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. వంటివి తయారుచేయడం మొదలుపెట్టారు. ఇలా తాము తయారుచేసిన విభిన్న వంటకాల్ని అక్కడి పిల్లలకు అందించడమే కాదు.. ఫుడ్‌ స్టాల్స్‌, ఆహార ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడంతో ఈ కుకింగ్‌ క్వీన్స్‌ నైపుణ్యాలు దిల్లీ అంతటా పాకాయి. ఇలా క్రమంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చిన నూర్‌ బృందం.. మరో అడుగు ముందుకేసి 2015లో క్యాటరింగ్‌ సేవల్నీ ప్రారంభించింది.

ఐకమత్యమే మా బలం..!

కలిసికట్టుగా కృషి చేస్తే అసాధ్యాన్నీ సుసాధ్యం చేయచ్చంటారు.. తమ సక్సెస్‌కూ ఇదే కారణమంటున్నారీ మహిళలు. ‘మా నైపుణ్యాలు ఆహార ప్రియుల్ని చేరుకోవడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఓవైపు కుటుంబాలు, సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటూ.. మరోవైపు ఇంటిని-పిల్లల్ని-పనిని బ్యాలన్స్ చేసుకుంటూ ఎంతో కష్టపడ్డాం. ఇదిలా ఉంటే మా రుచులు కస్టమర్లను చేరడానికి, వారిని సంతృప్తి పరచడానికి కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ముందు నుంచీ ఎలాంటి సమయంలోనైనా కలిసికట్టుగా ఉన్నాం.. సమస్యల్నీ ఐకమత్యంతోనే పరిష్కరించుకున్నాం.. అందుకే ఈ సవాళ్లను దాటుకొని నిలబడగలిగాం..’ అంటూ ఈ బృంద సభ్యురాలైన సైబా చెబుతోంది.

ఐదు నక్షత్రాల హోటళ్లకు క్యాటరింగ్..!

ఇక ప్రస్తుతం తమ వంటకాల్ని ఫుడ్‌ ఎగ్జిబిషన్లు/స్టాల్స్‌లో ప్రదర్శించడమే కాదు.. సోషల్‌ మీడియా వేదికగా మరెంతోమందికి చేరువ చేస్తున్నారు. ‘చెఫ్స్‌ స్పెషల్‌ సండే’ పేరుతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అంతేకాదు.. ఏడు శతాబ్దాల క్రితం నాటి మొఘలాయి వంటకాల్ని ఆరోగ్యకరమైన రీతిలో వండుతూ.. భోజన ప్రియుల మనసు దోచుకుంటున్నారీ కుకింగ్‌ క్వీన్స్.

‘సంప్రదాయబద్ధమైన మొఘలాయి వంటకాలకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అందుకే వీటికి పూర్వ వైభవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాం. ఈ క్రమంలోనే ఖీర్‌, ఫిర్ని, కెబాబ్స్‌, హలీమ్, సూప్స్‌, బిరియానీ, పచ్చళ్లు, కూర్మా.. వంటి వంటకాలు మా వద్ద తయారవుతున్నాయి. అది కూడా ఎలాంటి కృత్రిమ రంగులు, ఇతర ప్రిజర్వేటివ్స్‌ వాడకుండానే వీటిని వండుతున్నాం. తద్వారా అటు రుచి, ఇటు ఆరోగ్యాన్నీ అందరికీ చేరువ చేస్తున్నాం. అంతేకాదు.. మా వద్ద తయారయ్యే మొఘలాయి వంటకాలతో ఐదు నక్షత్రాల హోటల్స్‌కి కూడా క్యాటరింగ్‌ సేవల్ని అందిస్తున్నాం.. అలాగే పలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాం..’అంటున్నారు నూర్.

ఒకప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడిన వీరు.. ఇప్పుడు చేతి నిండా డబ్బుతో తగిన బ్యాంక్‌ బ్యాలన్స్‌ మెయింటెయిన్‌ చేస్తున్నారు. ఏడాది తిరిగే సరికి లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మరోవైపు ఇంట్లో వాళ్ల మెప్పూ పొందుతున్నారు.. ఇక వీరి వంటకాలకు భోజనప్రియులు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఎలాగూ ఇస్తున్నారనుకోండి..!

ఎలాంటి ఆధారం, ప్రోత్సాహం లేకుండా స్వయం శక్తితో ఎదిగిన ఈ మహిళలు ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పడం అతిశయోక్తి కాదు..!

హ్యాట్సాఫ్‌ కుకింగ్‌ క్వీన్స్!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని