తండ్రే భర్తను చంపిస్తే.. స్వశక్తితో రాణిస్తోంది!

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. తమిళనాడులోని ఉడుమాల్‌పేట్‌ నగరం నడిబొడ్డున జరిగిన పరువు హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! కౌసల్య అనే ఉన్నత కులానికి చెందిన మహిళ, దళితుడైన శంకర్‌ను వివాహం చేసుకుందన్న కక్షతో అమ్మాయి తండ్రే పన్నాగం పన్ని ఇద్దరిపై.....

Published : 02 Nov 2022 13:20 IST

(Photos: Screengrab, Instagram)

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. తమిళనాడులోని ఉడుమాల్‌పేట్‌ నగరం నడిబొడ్డున జరిగిన పరువు హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! కౌసల్య అనే ఉన్నత కులానికి చెందిన మహిళ, దళితుడైన శంకర్‌ను వివాహం చేసుకుందన్న కక్షతో అమ్మాయి తండ్రే పన్నాగం పన్ని ఇద్దరిపై దాడి చేయించాడు. ఈ క్రమంలో శంకర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. కౌసల్య తీవ్ర గాయాలతో బయటపడింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను దూరం చేసుకున్న ఆమె.. నిస్సహాయురాలిగా మిన్నకుండిపోలేదు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేసింది.. ఈ పోరాటమే తనను యాక్టివిస్ట్‌ని చేసిందంటోంది కౌసల్య. నాటి దాడికి సంబంధించిన చేదు జ్ఞాపకాల్ని నెమ్మదిగా చెరిపేస్తూ.. ఇలాంటి పరువు హత్యలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తోంది. మరోవైపు తన భర్త పేరు మీద ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి వెనకబడిన కులాల పిల్లల అభివృద్ధికి కృషి చేస్తోంది. హత్యోదంతం నుంచి బయటపడి.. ఓవైపు సమాజ సేవ చేస్తూనే.. మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోన్న కౌసల్య కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

ప్రేమ కులమతాలెరుగదన్నట్లు.. ఒకే కాలేజీలో చదువుతున్న కౌసల్య, శంకర్‌ల మధ్య ప్రేమ పుట్టింది. అయితే పెద్దలు వీళ్ల పెళ్లికి అంగీకరించకపోవడంతో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఇది కౌసల్య తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తన కూతురు తన మాట కాదని.. తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకున్న ఆయన.. ఇద్దరినీ చంపించడానికి ప్లాన్‌ చేశాడు.

భర్త కోసం పోరాడినా..!

పథకం ప్రకారం ఉడుమాల్‌పేట్‌ నగరం నడిబొడ్డున పట్టపగలే ఇద్దరిపై దాడి చేయించాడు కౌసల్య తండ్రి. దీంతో శంకర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. కౌసల్య తీవ్ర గాయాలతో బయటపడింది. తన ప్రాణానికి ప్రాణమైన భర్తను తనకు శాశ్వతంగా దూరం చేసిన వారిని వదిలిపెట్టాలనుకోలేదామె. ఈ క్రమంలోనే తన తండ్రిపై కేసు పెట్టి.. తన భర్తకు న్యాయం జరగాలని పోరాటం కొనసాగించింది. ఈ క్రమంలో 2017లో జిల్లా సెషన్స్‌ కోర్టు కౌసల్య తండ్రితో పాటు మరో ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును రద్దు చేస్తూ 2020లో మద్రాస్‌ హైకోర్టు కౌసల్య తండ్రితో పాటు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేయడం గమనార్హం! ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు చెప్పుకొచ్చింది కౌసల్య.

ప్రభుత్వోద్యోగం వదులుకొని మరీ..!

పరువు హత్య పేరుతో భర్తను కోల్పోయిన కౌసల్యకు ప్రభుత్వం వెల్లింగ్టన్‌లోని కంటోన్మెంట్‌ బోర్డులో క్యాషియర్‌గా ఉద్యోగం ఇచ్చింది. కానీ స్వీయానుభవంతో చేసిన పోరాటం ఆమెలో ధైర్యం నింపింది. అదే తనను సోషల్ యాక్టివిస్ట్‌గా మారేందుకు ప్రేరేపించిందంటోంది  కౌసల్య. ‘ప్రభుత్వోద్యోగంలో నాకు సంతృప్తి లభించలేదు.. పైగా ఉద్యోగం చేస్తూ.. పూర్తి స్థాయి యాక్టివిస్ట్‌గా కొనసాగడం కుదరదు. దీంతో నా మనసు చెప్పిందే విన్నా. ఉద్యోగానికి రాజీనామా చేసి.. కులవివక్ష, పరువు హత్యలపై పోరాటం చేయడమే నా లక్ష్యంగా మార్చుకున్నా. నా భర్త పేరు మీద ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. ఆ వేదికగా వెనకబడిన కులాల పిల్లల అభివృద్ధికి పాటుపడుతున్నా..’ అంటోన్న కౌసల్య.. ఇంట్లో ఆడ, మగ పిల్లల్ని సమాన దృష్టితో పెంచితే సమాజంలో ఇలాంటి అఘాయిత్యాలు జరగవంటోంది.

ప్రస్తుతం ఈ సామాజిక సమస్యల గురించి పలు వేదికలపై తన గళాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా వినిపిస్తోన్న ఆమె.. 2018లో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువు హత్యోదంతం తర్వాత ఆయన భార్య అమృత, ప్రణయ్‌ తల్లిదండ్రులను కూడా కలిసింది. అలాగే రాజస్థాన్‌లో మాదిరిగా పరువు హత్యలకు వ్యతిరేకంగా తమిళనాడులో ఓ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది కౌసల్య.

అందుకే వ్యాపారంలోకొచ్చా..!

చిన్నతనం నుంచీ తనకు ఆసక్తి ఉన్న అంశంపై దృష్టి పెట్టడం అలవాటున్న కౌసల్య.. వ్యాపారంపై తనకున్న మక్కువతో ఇటీవలే ఓ బ్యూటీ సెలూన్‌ తెరిచింది. కోయంబత్తూర్లోని వెల్లలూర్‌లో ‘ఝా ఫ్యామిలీ సెలూన్‌’ పేరుతో ఏర్పాటుచేసిన ఈ పార్లర్‌ను నటి పార్వతీ తిరువోతు చేతుల మీదుగా ప్రారంభింపజేసింది కౌసల్య.

‘కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చిన్నతనం నుంచే అలవాటు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు బ్యుటీషియన్‌ కోర్సుపై నాకు ఆసక్తి ఉందని అర్థమైంది. దీంతో ఆరు నెలలు డిప్లొమా కోర్సు చేసి ఈ సెలూన్‌ను ప్రారంభించా. గతంలో నేను పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు బ్యాంక్‌లో కొంత రుణం తీసుకొని ఈ పార్లర్‌ని తెరిచా. ప్రస్తుతం నా వ్యాపారానికి మంచి స్పందన వస్తోంది. మున్ముందు దీన్ని మహిళా సాధికారత కోసం వినియోగించాలనుకుంటున్నా. కుల వివక్షకు గురై, పలు రకాలుగా హింసను ఎదుర్కొన్న మహిళలకు వ్యాపార విషయంలో మార్గనిర్దేశనం చేయడం, ఉపాధి కల్పించడమే నా లక్ష్యాలుగా పెట్టుకున్నా..’ అంటోంది కౌసల్య. ఝా సెలూన్‌ ప్రారంభించిన ఫొటోల్ని, కౌసల్య కన్నీటి కథను నటి పార్వతి మొన్నామధ్య సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్