Parenting: కోపానికి కారణం తెలుసుకోవాలి
ఆకలితో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గే పరిస్థితి పిల్లల్లోనూ ఉంటుంది. ఇది ఇరిటేషన్, మూడ్‌స్వింగ్, తీవ్ర కోపానికి దారి తీస్తుంది. అకస్మాత్తుగా పిల్లలు ప్రదర్శించే తీవ్ర కోపం వెనుక మరేదైనా కారణం కూడా ఉండొచ్చు. పెద్దవాళ్లు గుర్తించి పరిష్కరించాలంటున్నారు నిపుణులు.
ఆకలితో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గే పరిస్థితి పిల్లల్లోనూ ఉంటుంది. ఇది ఇరిటేషన్, మూడ్‌స్వింగ్, తీవ్ర కోపానికి దారి తీస్తుంది. అకస్మాత్తుగా పిల్లలు ప్రదర్శించే తీవ్ర కోపం వెనుక మరేదైనా కారణం కూడా ఉండొచ్చు. పెద్దవాళ్లు గుర్తించి పరిష్కరించాలంటున్నారు నిపుణులు.
కోపాలొద్దు..
పిల్లల జీర్ణాశయం పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. ఆహారాన్ని ఎక్కువగా ఒకేసారి తీసుకోలేరు. దీంతో తక్కువ సమయంలోనే తిరిగి ఆకలి వేస్తుంటుంది. దీంతో కలిగే చికాకును కోపంగా ప్రదర్శిస్తారు. ఆ తర్వాత వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులపై తల్లిదండ్రులు కోపాన్ని ప్రదర్శించకూడదు. పిల్లలు తిని ఎంత సేపయిందో గమనించుకొని విరామం ఎక్కువగా ఉన్నట్లైతే వెంటనే ఆహారాన్ని అందించాలి. తీవ్రస్థాయిలో విసుగును ప్రదర్శిస్తూనే ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే వారిలో మరేదో ఆందోళన ఉండి ఉండొచ్చు. వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే నిద్రలేమో, అనారోగ్యమో మరేదైనా సమస్యో ఎదురై ఉంటుంది. బుజ్జగింపుగా మాట్లాడి కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
తేలికగా..
పిల్లలను సాధారణ స్థితికి తీసుకురాగలగాలి. అలాగని వాళ్లు అడిగిందల్లా తినడానికి ఇవ్వకూడదు. తేలికగా జీర్ణమయ్యే స్నాక్స్‌ను ప్రయత్నించాలి. అలాకాకుండా వారు కోరిన జంక్‌ఫుడ్స్‌లాంటివి ఇస్తే, ఆ తర్వాత తీసుకోవాల్సిన పోషకాహారంపై ఆసక్తి చూపించరు. సమయపాలన లేకుండా పిల్లలు ఆహారాన్ని తీసుకొనే అలవాటును పెద్దవాళ్లు మాన్పించాలి. దీనివల్ల అనారోగ్యాలు, అధిక బరువువంటి సమస్య లెదురయ్యే ప్రమాదం ఉంది. ఆహారానికి కూడా సమయపాలన, ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకోవడం వంటి నియమాలను చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఈ విషయంలో పిల్లలు ఎటువంటి అసహనం ప్రదర్శించినా మృదువుగా తగ్గించడానికి కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.