వరదల్లో 47 మందిని కాపాడి..!
నేటి తరం మహిళలు గ్లాస్ సీలింగ్‌ను బద్దలుకొట్టి వివిధ రంగాల్లో తమదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. రక్షణ రంగం సైతం ఇందుకు అతీతం కాదు. పురుషులతో సమానంగా మహిళలూ ఇందులో....
(Photos: Twitter)
నేటి తరం మహిళలు గ్లాస్ సీలింగ్‌ను బద్దలుకొట్టి వివిధ రంగాల్లో తమదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. రక్షణ రంగం సైతం ఇందుకు అతీతం కాదు. పురుషులతో సమానంగా మహిళలూ ఇందులో రాణిస్తున్నారు. తమదైన ప్రతిభ, ధైర్యసాహసాలతో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన వింగ్ కమాండర్ దీపికా మిశ్రా ఇటీవలే వాయుసేన శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు. గ్యాలంట్రీ అవార్డు అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆమె గురించి మరిన్ని విశేషాలు..
మొదటి మహిళగా...
రాజస్థాన్‌కు చెందిన దీపికా మిశ్రా చిన్నప్పట్నుంచి వాయుసేనలో చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివారు. అలా 2006లో వాయుసేన అకాడమీలో కమిషన్డ్ ఆఫీసర్‌గా ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలోనే భారత వాయుసేనకు సంబంధించిన ఓ పరేడ్‌కు వెళ్లారు. ఆ పరేడ్‌లో సారంగ్, సూర్య కిరణ్ బృందాలు చేసిన విన్యాసాలకు ఆమె ముగ్ధులయ్యారు. ఈ బృందాలు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటాయి. దాంతో ఎప్పటికైనా ఆమె ఆ బృందంలో చేరాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ, అప్పట్లో ఈ బృందంలో చేరడానికి మహిళలకు అవకాశం ఉండేది కాదు. మహిళలకు కేవలం సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను మాత్రమే నడిపే అవకాశం ఉండేది. దాంతో దీపిక చీతా, చేతక్ హెలికాప్టర్లు నడిపే బృందంలో చేరారు. అలా 1600 గంటల పాటు హెలికాప్టర్లను నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.
నిబంధనలు మార్చడంతో...
భారత వాయుసేన 2010లో కొన్ని ప్రధాన నిబంధనలను మార్చింది. ఇందులో భాగంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ నడిపే మహిళలు ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్‌ను నడపడానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ నిర్ణయం దీపికకు వరంగా మారింది. దాంతో 2012లో దీపిక ఒక్కరే ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్ నడపడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అప్పటికే దీపికకు 18 నెలల చిన్నారి ఉండడంతో తను ట్రైనింగ్‌కి పూర్తి సమయం కేటాయించలేదనే కారణంతో ఆమె దరఖాస్తును వాయుసేన తిరస్కరించింది. అయినా ఆమె నిరుత్సాహపడకుండా 2013లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి తనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పలు పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత సాధించిన ఆమె తన కలను సాకారం చేసుకున్నారు. సారంగ్ బృందంలో స్క్వాడ్రన్ లీడర్‌గా చేరారు. తద్వారా ఈ బృందంలో చేరిన మొదటి వాయుసేన మహిళగా ఘనత సాధించారు. దీపిక భర్త సౌరభ్ కక్కర్ కూడా స్క్వాడ్రన్ లీడర్ కావడం గమనార్హం.
47 మందిని కాపాడి...!
గతేడాది ఆగస్టులో ఉత్తర మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆ సమయంలో భారత వాయుసేన నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దీపికకు సమాచారం అందింది. ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలో ముందుండే దీపిక సమాచారం అందుకున్న వెంటనే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమెకు ప్రతికూల వాతావరణం ఎదురైంది. బలమైన ఈదురు గాలులకు తోడు వెలుతురు తక్కువగా ఉంది. కానీ, అవేమీ లెక్క చేయకుండా దీపిక తన సహాయ కార్యక్రమాన్ని కొనసాగించారు. అలా పలువురు ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా వరద ప్రాంతానికి మొదటగా చేరుకోవడమే కాకుండా.. ఆ సమాచారాన్ని మిగతా సహాయ బృందాలకు అందించారు. ఆ సమాచారం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలకు ఎంతో ఉపయోగపడింది.
మరో సందర్భంలో తగినంత వెలుతురు లేకపోయినా రిస్క్ చేసి మరీ ఇంటి పైకప్పుపై చిక్కుకున్న నలుగురి ప్రాణాలను కాపాడారు. ఎనిమిది రోజుల పాటు నిరంతర సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న దీపిక.. మొత్తం 47 మంది ప్రాణాలను కాపాడారు. ఇందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు.
గ్యాలంట్రీ అవార్డు అందుకొని..
ఇందుకు గాను ఆమె గ్యాలంట్రీ అవార్డును అందుకున్నారు. భారత వాయుసేనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆఫీసర్లకు వివిధ విభాగాలలో విశిష్ట సేవా పురస్కారాలను అందిస్తారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవలే దిల్లీలో జరిగింది. ఇందులో భాగంగా ఎయిర్ ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి చేతుల మీదుగా దీపిక శౌర్య పతకం అందుకున్నారు. తద్వారా ఈ పతకం సాధించిన మొదటి మహిళగా ఘనత సాధించారు. కాగా, ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో మొత్తం 58 మంది అవార్డులను సొంతం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.