ఆ ఆసక్తే ఆమెను అందలమెక్కించింది!

ఆ అమ్మాయికి అర్థశాస్త్రమంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే అందులో ఉన్నత చదువులు చదివింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మరెన్నో కీలక పదవుల్లోనూ కొనసాగిన ఆమె.. 2018 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

Published : 03 Dec 2021 18:01 IST

(Photo: Instagram)

ఆ అమ్మాయికి అర్థశాస్త్రమంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే అందులో ఉన్నత చదువులు చదివింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మరెన్నో కీలక పదవుల్లోనూ కొనసాగిన ఆమె.. 2018 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమే.. మైసూరుకు చెందిన గీతా గోపీనాథ్‌. ఐఎంఎఫ్‌లో అత్యున్నత పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఘనతకెక్కిన గీత.. తాజాగా ఆ సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. కొవిడ్‌ కల్లోల సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఐఎంఎఫ్‌ను గాడిలో పెట్టేందుకు ఆమె సలిపిన కృషే ఆమెకు ఈ పదవిని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

అందుకు ఆమే సమర్థురాలు!

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో 2018లో చేరారు గీత. అప్పట్నుంచి చీఫ్‌ ఎకనమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. తాజాగా ‘డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎఫ్‌డీఎండీ)గా పదోన్నతి పొందారు. నిజానికి ఆమె పదవీ కాలం త్వరలోనే ముగుస్తుండడంతో తిరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా కొనసాగుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సంస్థలో అత్యున్నత హోదా దక్కించుకున్నారామె. కొవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆమె సేవలు ఐఎంఎఫ్‌కు చాలా అవసరమని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియేవా అభిప్రాయ పడ్డారు. కొవిడ్‌ సంక్షోభంతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పునర్నిర్మించడానికి ఆమె అందించిన మేధో నాయకత్వం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి అంటూ గీత సేవల్ని కొనియాడారు క్రిస్టలినా.

అర్థశాస్త్రంపై మక్కువతో..

* భారత - అమెరికన్ ఆర్థికవేత్తగా పేరుపొందిన గీతా గోపీనాథ్ 1971, డిసెంబర్ 8న మైసూర్‌లో టీవీ గోపీనాథ్, వీసీ విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి సంతానమైన ఇద్దరమ్మాయిల్లో గీత చిన్నవారు.

* మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌లో స్కూలింగ్ పూర్తిచేసిన గీత.. దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీ రాం మహిళా కళాశాలలో బీఏ పూర్తిచేశారు. ఈ సమయంలోనే అర్ధశాస్త్రాన్ని తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో 1990-91లో తొలిసారిగా భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తిందని, అదే తనని పీజీలో ఎకనమిక్స్‌ సబ్జెక్టు ఎంచుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరగడానికి దోహదం చేసిందని అంటారు గీత.

* దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా అందుకున్నారు. ఆపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసిన గీత.. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ సమయంలోనే ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ‘ప్రిన్స్‌టన్స్ వుడ్రూ విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు’ అందుకున్నారామె.

* ఆపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ‘ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్’ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ‘అమెరికన్ ఎకనమిక్ రివ్యూ’కి కో-ఎడిటర్‌గా, ‘కరెంట్ హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్’కి కో-ఎడిటర్‌గా, ‘రివ్యూ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్’కి మేనేజింగ్ ఎడిటర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌కి చెందిన ‘ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మ్యాక్రోఎకనమిక్స్ ప్రోగ్రాం’కి కో-డైరెక్టర్‌గా.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశారామె. ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ బ్యాంకు-ఐఎంఎఫ్‌ ఉన్నత స్థాయి సలహా బృందంలో సభ్యురాలిగా నియమితురాలయ్యారు.

* అర్థశాస్త్రంపై ఉన్న మక్కువే ఆమెను 2010లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి శాశ్వత ప్రొఫెసర్‌గా ఎంపికయ్యేలా చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌గా, మూడో మహిళగా నిలిచారు గీత. అంతకుముందు మన దేశం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో శాశ్వత ప్రొఫెసర్‌గా నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ ఎంపికయ్యారు.

* 2011లో 'వరల్డ్ ఎకనమిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్'లో ఒకరిగా గుర్తింపు పొందారు గీత.

* 2016-18 మధ్య కాలంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారు గీతా గోపీనాథ్.

* గీతలో మంచి ఆర్థికవేత్తే కాదు.. చక్కటి రచయిత్రి కూడా ఉన్నారు. వాణిజ్య, పెట్టుబడి, ద్రవ్య విధానం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేసి దాదాపు 40కి పైగా ఆర్టికల్స్ కూడా రాశారామె.

* గీత భర్త ఇక్బాల్ సింగ్ ధలివాల్. దిల్లీలో చదువుకునే రోజుల్లోనే ఆయన్ని కలిశారామె. ఈ జంటకు రోహిల్ అనే కుమారుడున్నాడు.

* 2018లో ఐఎంఎఫ్‌కి తొలి మహిళా చీఫ్‌ ఎకనమిస్ట్‌గా ఎంపికైన గీతా గోపీనాథ్.. ఈ పదవిని చేపట్టిన రెండో భారతీయురాలిగానూ నిలిచారు. ఆమె కంటే ముందు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఆయన ఈ పదవిలో 2003 నుంచి 2006 వరకు కొనసాగారు.

* 2015లో మైసూర్‌లోని మైరా బిజినెస్ స్కూల్ ‘వుమెన్ అఛీవర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో గీతకు చోటు కల్పించింది.

* ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎంపికైన గీత ఈ సందర్భంగా ‘ఈ పదోన్నతి నాకు గర్వకారణం. ప్రస్తుత కొవిడ్‌ కల్లోల సమయంలో పలు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు, సహచరులతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ ట్వీట్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్