బంధానికి కాస్త విశ్రాంతినిద్దాం!

అలసిపోతే శరీరానికి విశ్రాంతినిస్తాం.. ఒత్తిడికి గురైతే మానసికంగా రిలాక్సవుతాం.. అనుబంధానికీ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. వైవాహిక బంధం శాశ్వతమైనా అప్పుడప్పుడూ దానికీ కాస్త రెస్ట్‌ ఇవ్వాలంటున్నారు. అదెలా సాధ్యం.. అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ మీతోనే గడిపే....

Updated : 10 Apr 2023 17:02 IST

అలసిపోతే శరీరానికి విశ్రాంతినిస్తాం.. ఒత్తిడికి గురైతే మానసికంగా రిలాక్సవుతాం.. అనుబంధానికీ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. వైవాహిక బంధం శాశ్వతమైనా అప్పుడప్పుడూ దానికీ కాస్త రెస్ట్‌ ఇవ్వాలంటున్నారు. అదెలా సాధ్యం.. అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ మీతోనే గడిపే మీ భాగస్వామికి వ్యక్తిగతంగా కాస్త సమయం కేటాయించుకునే అవకాశమిస్తే సరి! తద్వారా ఇటు మీరు, అటు మీ భాగస్వామీ తమకు నచ్చినట్లుగా సమయం గడపొచ్చు. మరి, ఇంతకీ భాగస్వామికి ఈ సమయం ఎందుకివ్వాలి? దీనివల్ల అనుబంధంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? రండి.. తెలుసుకుందాం..!

ఎందుకీ రెస్ట్‌?

ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఉంటాయి. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగిపోవడం, భాగస్వామికే పూర్తి సమయం కేటాయించడం, ప్రతి విషయంలో సర్దుకుపోవడం, రాజీపడడం, కెరీర్‌పై దృష్టిపెట్టడం.. ఇలా కారణమేదైనా.. మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. తద్వారా మానసికంగా ఒత్తిడికి గురవుతాం.. ఎమోషనల్‌ అవుతాం. తద్వారా దీని ప్రభావం వ్యక్తిగతంగానే కాదు.. అనుబంధంపైనా పడుతుంది. ఫలితంగా చీటికీ మాటికీ గొడవలు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు చిరాకు పడడం.. ఇలా క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ సన్నగిల్లుతూ వస్తుంది. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి బయటపడి తిరిగి పునరుత్తేజితం కావడానికే ఈ వ్యక్తిగత సమయం దోహదపడుతుంది. ఈ సమయంలో భాగస్వామి ఆలోచనలు పక్కన పెట్టి తమకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల మనసు చురుగ్గా మారుతుంది. తద్వారా భాగస్వామితో మరింత అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ సాన్నిహిత్యమే ఆలుమగల అనుబంధాన్ని శాశ్వతం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఇవి గుర్తుంచుకోండి!

అయితే దంపతులిద్దరూ ఇలా తమకంటూ కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడమే కాదు.. ఎవరికి వారుగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు.

ఎలాగూ తమకంటూ కాస్త వ్యక్తిగత సమయం దొరికిందన్న ఉద్దేశంతో ఏ ఆఫీస్‌ పనిలోనో లేదంటే ఇంటి పనుల్లోనో దూరిపోకుండా.. మిమ్మల్ని సంతోషపెట్టే అంశాలపై దృష్టి పెట్టాలి. కొంతమందికి షాపింగ్‌కి వెళ్లడం ఇష్టం ఉండచ్చు.. మరికొందరికి స్నేహితులతో గడపాలనిపించచ్చు.. కాసేపు ఇలా మీకు నచ్చిన పనులు చేస్తే మనసు పునరుత్తేజితమవుతుంది.

ప్రస్తుత బిజీ షెడ్యూళ్లలో భాగస్వామితో గడిపే సమయమే తక్కువంటే.. మీరేంటీ ఇంకా ఇలా విడివిడిగా గడపమంటారు.. అనుకుంటున్నారా?  ఇలా ప్రతి రోజూ ఎవరికి వారు విడివిడిగా గడపాల్సిన అవసరం లేదు.. నెలకో, రెండు నెలలకో ఓసారి ఇలా చేసినా చాలంటున్నారు నిపుణులు.

ఒకే ఇంట్లో ఎవరికి వారుగా సమయం గడపాలనుకునే భార్యాభర్తలు.. ఒకరినొకరు డిస్టర్బ్‌ చేసుకోకుండా వేర్వేరు గదుల్ని కేటాయించుకోవడం మంచిది. ఈ క్రమంలో ఫోన్లు చేసుకోవడం, సందేశాలు పంపుకోవడం.. వంటి వాటికీ విరామమివ్వాలి.

ఏదైనా సరే.. మొదలుపెట్టిన పనిని పూర్తిచేసినప్పుడే ప్రశాంతత చేకూరుతుంది. ఈ క్రమంలో మీకంటూ కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకుని మీ ఇద్దరూ విడివిడిగా చేయాలనుకున్న పనుల విషయంలో ఒక్కోసారి కొంత అదనపు సమయం కావాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో అంతమాత్రానికే  గొడవలు, అలకలు పెట్టుకోకుండా.. సర్దుకుపోవాలి. ఏదేమైనా ఈ సమయం పరోక్షంగా ఒకరినొకరు ప్రోత్సహించుకునేలా ఉండాలే తప్ప.. భాగస్వామిని నిరుత్సాహపరిచేలా ఉండకూడదు.

దాంపత్య బంధంలో ప్రతిదీ పారదర్శకంగా ఉన్నప్పుడే అనుబంధం దృఢమవుతుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత సమయం కేటాయించుకున్నా.. దాన్ని మీరు ఎలా గడిపారో.. భాగస్వామితో పంచుకోండి. ఈ క్రమంలో ఈసారి ఇంకాస్త బెటర్‌గా ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చన్న విషయంలో ఒకరి సలహాలు మరొకరు తీసుకోండి. ఫలితంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ పెరుగుతుంది.. బంధం బలపడుతుంది.

దంపతులిద్దరూ మధ్యమధ్యలో ఇలా తమకంటూ కొంత వ్యక్తిగత సమయం కేటాయించుకోకుండా ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. క్రమంగా ఇదో వ్యసనంలా మారుతుందని, ప్రతి దానికీ ఒకరిపై ఒకరు ఆధారపడేలా చేస్తుందని, తద్వారా అనుబంధం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇంత దాకా తెచ్చుకోకూడదంటే.. ఎవరికి వారుగా కాస్త సమయం కేటాయించుకోవడం మంచిదంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్