సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Updated : 13 Sep 2022 15:06 IST

Photos: Screengrab

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

పరిశ్రమలు, పరిశోధన, SMEలు (చిన్న మధ్య తరహా సంస్థలు), నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌, జీవిత సాఫల్యత.. వంటి ఐదు విభాగాల్లో ఏటా పురస్కారాల్ని అందిస్తోంది జర్మనీ కేంద్ర స్థానమైన యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌. ఐరోపా లోపల, వెలుపల దేశాల్లో విభిన్న రంగాల్లో విశేష కృషి చేసి సరికొత్త ఆవిష్కరణలకు తెర తీసిన వారికి ఈ అవార్డు అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు భారత సంతతి అమెరికన్‌ మహిళ సుమితా మిత్రా.

నానో టెక్నాలజీ సహాయంతో..!

ఎలాంటి దంత సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఇటు ఆరోగ్యం, అటు అందం ఇనుమడిస్తుంది.. అయితే కొంతమందిలో దంతాలు పుచ్చిపోవడం, ఇతర దంత సమస్యల కారణంగా వాటిని పూర్తిగా తొలగించాల్సి వస్తుంటుంది. వాటి స్థానంలో కృత్రిమ పళ్లు అమర్చడం లేదంటే దంతాల్ని ఫిల్‌ చేయడం.. వంటివి చేస్తుంటారు వైద్యులు. అయితే ఇందుకోసం ఉపయోగించే మెటీరియల్‌ నాణ్యత బాగున్నప్పుడే ఆ కృత్రిమ దంతాలు/ఫిల్లింగ్‌ ఎక్కువ రోజులు దృఢంగా ఉంటుంది.. వాటిపై పాలిష్‌ కూడా త్వరగా పోదు. అలాగే ఆహారం నమిలినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. కానీ మార్కెట్లో ఉన్న డెంటల్‌ ఫిల్లింగ్‌ మెటీరియల్స్‌లో ఆ నాణ్యతే లోపించిందన్న విషయం తన అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు సుమిత. దాంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

పాలిమర్‌ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఆమె.. తన బృందంతో కలిసి నానోటెక్నాలజీ సహాయంతో నాణ్యమైన డెంటల్‌ మెటీరియల్‌ను అభివృద్ధి చేశారు. వివిధ వ్యాసాలు కలిగిన నానోక్లస్టర్స్‌ కలిపి తయారుచేసిన ఈ కృత్రిమ దంత పదార్థం ఎంతో దృఢమైనదని, నాణ్యమైనదని చెబుతున్నారామె. అంతేకాదు.. దీన్ని అమర్చుకుంటే అసలైన దంతమేది, కృత్రిమ దంతమేదో కూడా గుర్తుపట్టలేనంతగా అందులో కలిసిపోయేలా ఉంటుందట ఈ డెంటల్ మెటీరియల్‌.

పదవీ విరమణ పొందినా..!

కోల్‌కతాలో పుట్టిపెరిగిన సుమిత.. తన తండ్రితో కలిసి తరచూ వాళ్ల కెమిస్ట్రీ ల్యాబ్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలోనే తనకు సైన్స్‌ అంటే మక్కువ పెరిగిందంటారామె. చదువు పూర్తయ్యాక అమెరికాకు చెందిన మల్టీనేషనల్‌ కంపెనీ ‘3M’లో దంత సంరక్షణ విభాగంలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన సుమిత.. 2010లో పదవీ విమరణ పొందారు. అయినా తన పరిశోధనలు మాత్రం ఆపలేదామె. రిటైరయ్యాక తన భర్తతో కలిసి ‘మిత్రా కెమికల్‌ కన్సల్టింగ్‌’ కంపెనీని స్థాపించారు. ఈ వేదికగా రసాయన శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, ప్రొడక్ట్ డిజైన్, నానోటెక్నాలజీ సహాయంతో డెంటల్‌ మెటీరియల్స్‌ని తయారుచేయడం.. వంటి అంశాల్లో కన్సల్టెన్సీ సేవల్ని అందిస్తున్నారు. ఇలా రసాయన శాస్త్రంలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు సైతం అందుకున్నారామె. ఈ క్రమంలో 1998లో ‘3M Carlton Society’కి ఎంపికయ్యారు. పరిశోధన-అభివృద్ధి విభాగంలో సుదీర్ఘకాలం సేవలందించిన వారికి సదరు సంస్థ అందించే విశిష్ఠ పురస్కారమిది.

అలాగే 2009లో అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ నుంచి ‘హీరోస్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ అవార్డు’, 2012లో ‘IADR Peyton Skinner Award’.. వంటి పురస్కారాలు అందుకున్నారు సుమిత. ఇక 2018లో ‘నేషనల్‌ ఇన్వెంటర్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో కూడా చోటు దక్కించుకున్నారు. తన సరికొత్త ఆవిష్కరణతో ఇటీవలే ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డు’ దక్కించుకున్న ఈ గ్రేట్‌ లేడీ.. ‘నానో టెక్నాలజీ నాకు సరికొత్త ఉత్పత్తిని రూపొందించే అవకాశాన్నిచ్చింది. ఇది ప్రతి ఒక్కరికీ ఆరోగ్యవంతమైన చిరునవ్వును అందిస్తుందనడం కంటే గొప్ప విషయం ఇంకేం కావాలి..’ అంటారామె. సైన్స్‌ పట్ల ఆసక్తి ఉన్న యువతను ఆ దిశగా తీర్చిదిద్దేందుకూ కృషి చేస్తున్నారీ సూపర్‌ ఉమన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్