హూలాహూప్‌తో విన్యాసాలు.. ఈమెను మించినోళ్లు లేరు!

నా పనేంటో నేను చేసుకుపోతే చాలు అనుకునేవారు కొందరైతే.. తమ పనులతో చుట్టూ ఉన్న వాళ్లలో అనునిత్యం ప్రేరణ కలిగించాలనుకునేవారు మరికొందరుంటారు.. లాస్‌ వెగాస్‌కు చెందిన గెట్టి కెహయోవా రెండో కోవకు చెందుతుంది. సర్కస్‌ ఫీట్లు చేస్తూ పొట్ట పోసుకునే కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. అదే విద్యను తన అణువణువూ నింపుకొంది. అక్క ప్రేరణతో హూలాహూప్‌ సాధన మొదలుపెట్టి గిన్నిస్‌ రికార్డు ఒడిసిపట్టే స్థాయికి ఎదిగింది.

Published : 09 Feb 2022 14:24 IST

(Photo: Instagram)

నా పనేంటో నేను చేసుకుపోతే చాలు అనుకునేవారు కొందరైతే.. తమ పనులతో చుట్టూ ఉన్న వాళ్లలో అనునిత్యం ప్రేరణ కలిగించాలనుకునేవారు మరికొందరుంటారు.. లాస్‌ వెగాస్‌కు చెందిన గెట్టి కెహయోవా రెండో కోవకు చెందుతుంది. సర్కస్‌ ఫీట్లు చేస్తూ పొట్ట పోసుకునే కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. అదే విద్యను తన అణువణువూ నింపుకొంది. అక్క ప్రేరణతో హూలాహూప్‌ సాధన మొదలుపెట్టి గిన్నిస్‌ రికార్డు ఒడిసిపట్టే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద హూలాహూప్‌తో విన్యాసాలు చేసి ఆమె సాధించిన గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె నైపుణ్యాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆమెకు ఇదెలా సాధ్యమైందని ఆరా తీసే పనిలో పడ్డారు.

లాస్‌ వెగాస్‌కు చెందిన గెట్టి కెహయోవాకు అప్పుడు తొమ్మిదేళ్లు. తన తండ్రి, అక్కతో కలిసి సర్కస్‌ ఫీట్లు చేయడానికి ప్రపంచ దేశాలు తిరిగేది. ఈ క్రమంలోనే వాళ్లు చేసే ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాల్ని దగ్గర్నుంచి గమనించేది. అంతేకాదు.. ఏడుగురు వ్యక్తులు కలిసి చేసిన పోల్‌ పిరమిడ్‌ విన్యాసంలో తన తండ్రి, ఎక్కువ సంఖ్యలో హూలాహూప్స్‌ తిప్పిన వ్యక్తిగా తన అక్క సాధించిన గిన్నిస్‌ రికార్డుల్ని చూసి స్ఫూర్తి పొందింది గెట్టి. తానూ వాళ్లలా గిన్నిస్కెక్కాలని కలలు కంది.

అక్కే తొలి గురువు!

ఈ క్రమంలోనే తన అక్క స్ఫూర్తితో పదకొండేళ్ల వయసులో హూలాహూప్‌ సాధన ప్రారంభించింది గెట్టి. రోజూ సర్కస్‌లో పని చేయడానికి ముందు, పని వేళలు ముగిశాక, వారాంతాల్లో.. హూలాహూప్‌ ప్రాక్టీస్‌కే పూర్తి సమయం కేటాయించేదామె. ఒకటి కంటే ఎక్కువ హూప్స్‌తో విన్యాసాలు చేయడం, డంబెల్స్‌-హ్యాంగింగ్‌ బార్స్‌తో వ్యాయామాలు చేస్తూ హూప్స్‌ చేయడం, గాల్లోకి ఎగురుతూ ఒకటి కంటే ఎక్కువ హూప్స్‌తో విన్యాసాలు చేయడం, డ్యాన్స్ చేస్తూ ఇతర ఆటలాడుతూ హూప్స్‌ చేయడం.. ఇలా ఆమెకు సాధ్యం కానిదేదీ లేదన్నట్లుగా ఈ విద్యలో ఆరితేరింది గెట్టి. అయితే గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా ముందుకు సాగిన ఆమె కల 2018లో ఫలించింది. 5.18 మీటర్ల వ్యాసార్థం (సుమారు 17 అడుగుల 0.25 అంగుళాల) గల హూలాహూప్‌ రింగ్‌తో విన్యాసాలు చేసి.. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద హూప్‌తో విన్యాసాలు చేసిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కిందామె.

‘ఈ రికార్డు సాధించడం అంత సులభమేమీ కాలేదు. హూప్‌ నా శరీరానికి తాకుతున్న ప్రతిసారీ ఎవరో బలంగా పంచ్‌ ఇచ్చినట్లుగా అనిపించేది. ఏదేమైనా అనుకున్నది సాధించానన్న సంతృప్తి ముందు ఈ గాయాల వల్ల కలిగిన బాధను మర్చిపోయా..’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గెట్టి.

అదే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్!

గత నాలుగేళ్లుగా కెనడాకు చెందిన Cirque du Soleil అనే ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. తన ప్రాణానికి ప్రాణమైన హూలాహూప్‌ను మాత్రం వదల్లేదు గెట్టి. ఈ విద్య తనకు మాత్రమే సొంతం కాదని.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో గత కొన్నేళ్ల నుంచి హూలాహూప్‌ తరగతుల్ని నిర్వహిస్తోంది. ఇక కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించిన ఈ హూప్‌ లవర్‌.. ఈ విద్యే తన ఫిట్‌నెస్  రహస్యమంటోంది. ‘నా రోజువారీ ఫిట్‌నెస్‌ రొటీన్‌లో హూలాహూప్‌ తప్పకుండా ఉంటుంది. ఇదే నన్ను అనునిత్యం దృఢంగా, నాజూగ్గా ఉండేలా చేస్తోంది. ఈ వర్కవుట్‌ సాధన చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా సొగసైన శరీరాకృతిని పొందచ్చు. అంతేకాదు.. ఒత్తిడి-ఆందోళనల్ని దూరం చేసి మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవాలన్నా ఇది చక్కటి సాధనం. అందుకే ఈ విద్యను నాలోనే దాచుకోకుండా నలుగురికీ నేర్పిస్తూ వాళ్లలో స్ఫూర్తి నింపాలని ఆరాటపడుతుంటా..’ అంటూ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ బయటపెట్టింది గెట్టి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్