Updated : 22/03/2022 15:05 IST

ఆ అరుదైన కోవలో మనం ఉండాలి!

(Photo: Twitter)

‘మహిళలు అందిపుచ్చుకోవాలే గానీ.. ఈ రోజుల్లో వారికోసం బోలెడన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు ఎదురుచూస్తున్నాయి’ అంటున్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉప కులపతి నజ్మా అఖ్తర్‌. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అందుకున్న ఆమె.. ఈ విద్యా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. తన కెరీర్‌లో వివిధ విద్యా సంస్థల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తూ.. నాణ్యమైన విద్యను అందించడంలో మార్పు తీసుకొచ్చే దిశగా కృషి సలిపారు. ఓ విద్యావేత్తగా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సాహిత్యం, విద్యారంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగానే తాజాగా ‘పద్మ శ్రీ’ పురస్కారం అందుకున్నారు నజ్మా. ‘అందరూ కష్టపడతారు.. కానీ గుర్తింపు కొందరికే వస్తుంది.. ఆ అరుదైన కోవలోనే మనముండాలి..’ అంటూ మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న ఈ విద్యావేత్త గురించి కొన్ని విశేషాలు మీకోసం..

* 1953, నవంబర్‌లో జన్మించారు నజ్మా అఖ్తర్‌. అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె.. తన ప్రతిభకు గుర్తింపుగా బంగారు పతకం అందుకున్నారు. ‘జాతీయ సైన్స్‌ ట్యాలెంట్‌ స్కాలర్‌షిప్‌’ సైతం గెలుచుకున్నారు.

* కురుక్షేత్ర యూనివర్సిటీలో ‘సంప్రదాయ, దూర విద్యా విధానంపై తులనాత్మక అధ్యయనం’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమెకు యూకేలోని వార్‌విక్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ‘కామన్వెల్త్‌ ఫెలోషిప్‌’ లభించింది.

* చదువు పూర్తయ్యాక దిల్లీలోని NIEPA రీసెర్చ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు నజ్మా. అదే విశ్వవిద్యాయంలో 15 ఏళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.

* తాను చదువుకున్న అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌ డైరెక్టర్‌గా మరికొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. UNESCO, UNICEF, DANIDA.. వంటి సంస్థలకు సలహాదారుగా కూడా వ్యవహరించారు నజ్మా.

* IGNOU విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తల కోసం శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే కోర్సులు రూపొందించే బృందానికి నాయకత్వం వహించారు.

* ఇక 2019లో దిల్లీలోని ‘జామియా మిలియా ఇస్లామియా’ యూనివర్సిటీకి ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టిన నజ్మా.. ఆ విశ్వవిద్యాలయ వందేళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. దిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింటిలోకెల్లా తొలి మహిళా వీసీగా కీర్తి గడించారు.

* తన పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీలో నాణ్యమైన విద్యను అందించడంలో మార్పులు తీసుకురావడం, కొత్త కోర్సుల్ని ప్రవేశ పెట్టడం.. వంటి లక్ష్యాల్ని చేరుకోవడంలో సఫలీకృతురాలయ్యారామె. ఈ క్రమంలోనే JMIకి NAAC.. A++ గుర్తింపు దక్కింది. ఈ ఘనతను అందించిన మొదటి మహిళా వీసీ కూడా నజ్మానే!

* నజ్మా నేతృత్వంలోని JMI.. NIRFలో 6వ ర్యాంక్‌ సాధించింది. అంతేకాదు.. 2019-20కి గాను అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోకెల్లా 95.23 శాతం స్కోర్‌ సాధించడం ద్వారా అత్యుత్తమ పనితీరును కనబరిచింది.

ఇలా విద్యారంగంలో తాను చేసిన కృషికి గుర్తింపుగా తాజాగా ‘పద్మశ్రీ’ అందుకున్నారు నజ్మా. ‘ఇది నాకు దక్కిన గొప్ప పురస్కారం. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు నాకు మరింత ప్రోత్సాహం లభించింది. అందరూ కష్టపడతారు.. కానీ ఇలాంటి అరుదైన గుర్తింపు కొందరికే దక్కుతుంది. అందులో నేనుండడం గర్వకారణం..!’ అంటారు నజ్మా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని