AI Anxiety: ఏఐ యుగంలో ఉద్యోగం పోతుందని భయమా?

ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నేటి యువతలో నెలకొంది.

Published : 10 Aug 2023 15:14 IST

అడిగింది ఏ టాపిక్ అయినా.. సరే క్షణాల్లో కంటెంట్‌ని సృష్టించే ‘చాట్‌జీపీటీ’..
పదాల్ని బొమ్మల రూపంలో మార్చి చూపే ‘మిడ్‌ జర్నీ’..
కావాల్సిన భాషలో వార్తలు చదివి పెట్టే.. ‘ఏఐ న్యూస్‌ యాంకర్లు’..
మనకు అసిస్టెంట్‌గా పనిచేసే ‘అలెక్సా’..

ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నేటి యువతలో నెలకొంది. పలు అధ్యయనాలు, పరిశోధనలూ ఇదే విషయం చెబుతున్నాయి. ఈ భయాన్నే ‘ఏఐ యాంగ్జైటీ’గా పేర్కొంటున్నారు నిపుణులు. కొందరు ఈ భయంతోనే ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగం పైనా పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారట! అయితే రాబోయే నష్టాన్ని తలచుకొని డీలా పడడం కంటే.. సరికొత్త సాంకేతికతతో కలిసి పనిచేసే నైపుణ్యాల్ని అలవర్చుకుంటే.. భవిష్యత్తుకు ఢోకా ఉండదంటున్నారు. తద్వారా ఉద్యోగ అభద్రతను దూరం చేసుకొని ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఆ రంగాల్లో..

కృత్రిమ మేధతో ప్రపంచమంతా ఆటోమేటిక్‌గా మారిపోతోన్న ఈ తరుణంలో.. రాబోయే కాలంలో ఉద్యోగాల కోత చాలామందిని భయపెడుతోంది. ఏఐ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు భవిష్యత్తులో సుమారు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ ‘గోల్డ్‌మన్‌ శాక్స్‌’ అంచనా వేసింది. అయితే కృత్రిమ మేధ ఉద్యోగాలపై చూపించే ప్రభావం ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. అడ్మినిస్ట్రేటివ్‌ రంగంలో 46 శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44 శాతం ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇక నిర్వహణ, ఇన్స్టలేషన్‌, రిపేర్‌, నిర్మాణ రంగ ఉద్యోగాలకు ఏఐతో తక్కువ ముప్పు పొంచి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్లు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు సంతృప్తికరంగానే ఉన్నా.. ఏఐ, ఇతర డిజిటల్‌ సాంకేతికతతో వీరి ఉద్యోగాలకే ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నట్లు, అందుకు కారణం శాస్త్రసాంకేతిక రంగాల్లో (STEM) వీరు వెనకబడిపోవడమే కారణమంటోందీ సంస్థ. కాబట్టి నవతరాన్ని ఈ రంగాల్లో ప్రోత్సహించడంతో పాటు, మహిళలూ వీటిలో నైపుణ్యాల్ని పెంచుకోవడం వల్ల తమ ఉద్యోగాల్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పట్టు పెంచుకోవాలి!

కృత్రిమ మేధ, ఇతర డిజిటల్‌ సాంకేతికతతో కొన్ని రంగాలలో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందన్నది వాస్తవమే అయినా.. ఇదే ఏఐ పరిజ్ఞానంతో దాదాపు 26 దేశాల్లో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు ‘ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)’ విడుదల చేసిన ఓ నివేదిక చెబుతోంది. ఇలాంటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలంటే ముందుగా.. ఆయా రంగాల్లో ఏఐతో వస్తోన్న మార్పుల్ని పసిగట్టి ఆ నైపుణ్యాలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించుకునే విధానం లోతుగా తెలిసుండాలి. ఇందుకోసం ప్రస్తుతం వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నేర్చుకోవడంతో పాటు.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు.. వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ని పెంచుకోవడమూ ముఖ్యమే! ఈ రెండింటి కలయికతోనూ ఏఐ యుగంలోనూ ఉద్యోగాల్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

సాంకేతికతతో చెలిమి..!

సాధారణంగానే మహిళలకు ఓపిక, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువ. నిజానికి ఏఐ యుగంలో ఇవే వారికి సానుకూలాంశాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. డేటా నిర్వహణ, సమస్యల్ని గుర్తించి సమర్థంగా పరిష్కరించగల నైపుణ్యాలు ఉండడం వల్ల.. పని ప్రదేశంలో ఏఐతో కలిసి పనిచేయడానికి సహజంగానే మహిళలు సరిపోతారంటున్నారు. అయితే ఇది సాధ్యం కావాలంటే.. మహిళలు స్వయంగా సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు.. కార్యాలయాలు కూడా ఇప్పట్నుంచే తమ ఉద్యోగులకు వాళ్ల స్థాయులు, రోల్స్‌ని బట్టి నూతన సాంకేతికతలో శిక్షణ ఇవ్వాలంటున్నారు.

భర్తీ కాదు.. భరోసా ఇవ్వండి!

మన దేశంలో మిగతా రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఆరోగ్యం, ఫైనాన్స్, రిటైల్‌ రంగాలు కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థకు 500 బిలియన్‌ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులోనూ ఆరోగ్య రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రంగంలో పనిచేసే పురుషుల కంటే మహిళల శాతం ఎక్కువని.. ముఖ్యంగా ల్యాబ్‌ టెక్నీషియన్లు, హెల్త్‌కేర్‌ నిపుణుల సంఖ్య అధికంగా ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మహిళల ఉద్యోగాల్ని ఏఐతో భర్తీ చేయడం కంటే.. వ్యాధి నిర్ధారణ, క్లిష్టమైన పరిశోధనలు నిర్వహించడం.. తదితర ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఉపయోగించడంలో వారికి శిక్షణ ఇస్తే.. కృత్రిమ మేధకు సపోర్ట్‌ టూల్‌గా వారి సేవల్ని వినియోగించుకోవచ్చంటున్నారు. తద్వారా వారి ఉద్యోగాల్ని కూడా సంరక్షించచ్చని చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని భావిస్తున్నారా?

ప్రతిభకే పట్టం!

ప్రస్తుతం చాలా రంగాల్లో లింగ వివక్ష, వేతన వ్యత్యాసం.. వంటివి మహిళల అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. కానీ కృత్రిమ మేధ యుగంలో మహిళలకు ఇలాంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామర్‌ ఏఐతో కలిసి పనిచేయలేరు. దీన్ని ఉపయోగించాలంటే ప్రత్యేకమైన నైపుణ్యాలు, ప్రతిభ కావాలి. కాబట్టి ఈ రెండూ ఉంటే.. ఆడ, మగ అన్న తేడా లేకుండా అవకాశాలు వరిస్తాయంటున్నారు. ఇక ప్రతిభను బట్టి వేతనమూ ఘనంగానే ఉంటుందంటున్నారు. అలాగే ఆఫీస్‌కే వెళ్లి పనిచేయాలని కాకుండా.. ఇంటి నుంచే సులభంగా పని చేసుకునే వెసులుబాటూ మహిళలకు దొరుకుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఏఐ సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలంటే.. ముందు నుంచే తమ కెరీర్‌కు ఈ దిశగా బాటలు వేసుకోవాలంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్