వయసు 70: చేతులు కట్టేసుకుని ఈత కొట్టింది..!

కొద్దిగా వయసు పైబడ్డాక చాలామంది మా పని అయిపోయిందంటూ కొత్త పనులు చేయడానికి వెనకాడుతుంటారు. కానీ, వీరికి భిన్నంగా కొంతమంది వయసుతో సంబంధం లేకుండా కొత్త విద్యలు నేర్చుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తుంటారు.....

Published : 28 Jun 2022 20:26 IST

(Photos: Screengrab)

కొద్దిగా వయసు పైబడ్డాక చాలామంది మా పని అయిపోయిందంటూ కొత్త పనులు చేయడానికి వెనకాడుతుంటారు. కానీ, వీరికి భిన్నంగా కొంతమంది వయసుతో సంబంధం లేకుండా కొత్త విద్యలు నేర్చుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తుంటారు. కేరళకు చెందిన అరిఫా కూడా ఈ కోవలోకే వస్తారు. 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు ఏకంగా చేతులకు తాళ్లు కట్టుకుని మరీ స్విమ్ చేస్తోంది. ఈ వయసులో స్విమ్మింగ్‌ ఏం నేర్చుకుంటామని అనుకునే వాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో అరిఫా స్విమ్మింగ్‌ ప్రస్థానం గురించి తెలుసుకుందామా...

2018లో వచ్చిన వరదలు కేరళను అతలాకుతలం చేసిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో కొంతమంది ఈత రాకపోవడం వల్ల కూడా చనిపోయారు. ఇది గమనించిన అరిఫా స్విమ్మింగ్‌ నేర్చుకోవడం ఎంతో అవసరమని భావించింది. ఈ క్రమంలో తన మనవరాలిని స్థానికంగా ఉండే కోచ్‌ దగ్గర జాయిన్‌ చేసింది. అతను స్విమ్మింగ్‌ కోచింగ్‌లో నిష్ణాతుడు. గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతోమందికి స్విమ్మింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అందులో సీనియర్‌ సిటిజెన్స్‌తో పాటు వికలాంగులు కూడా ఉన్నారు.

మొదటి సంవత్సరంలోనే..

అరిఫా ఒకరోజు తన మనవరాలు ఈత కొట్టడం చూడాలని అకాడమీకి వెళ్లింది. మనవరాలి స్విమ్మింగ్ చూసి తను కూడా నేర్చుకోవాలని అనుకుంది. అక్కడే ఉన్న కోచ్ అభిప్రాయాన్ని కోరింది. అతను కూడా ప్రయత్నించండని చెప్పడంతో 68 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలా ఈత నేర్చుకోవడం మొదలుపెట్టిన అరిఫా మొదటి సంవత్సరంలోనే పెరియార్‌ నదిలో 500 మీటర్ల మేర ఈత కొట్టి ఔరా అనిపించింది. అలా మొదటిసారి వార్తల్లో నిలిచింది.

చేతులకు తాళ్లు కట్టుకుని...

స్విమ్మింగ్‌లో అన్ని వయసుల వారిని ప్రోత్సహించడానికి స్థానిక స్విమ్మింగ్‌ క్లబ్‌ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మూడు రకాల ఏజ్‌ గ్రూప్స్‌ ఉన్న వారిని ఎంపికి చేసి వారి చేతులకు తాడు కట్టి ఈత కొట్టించాలని భావించింది. సాహసాలు చేయడంలో ముందుండే అరిఫా తను కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలనుకుంది. అలా ఇటీవలే జరిగిన ఈ కార్యక్రమంలో అరిఫా మరో ఇద్దరితో కలిసి చేతులకు తాడు కట్టుకుని పెరియార్‌ నదిలో ఈదడం మొదలుపెట్టింది. అలా కోచ్‌ పర్యవేక్షణలో 45 నిమిషాల్లోనే దాదాపు 780 మీటర్ల పొడవు మేర ఈత కొట్టి ఔరా అనిపించింది. అలా మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా మనవరాలు ఈత కొట్టడం చూసి నేను కూడా స్విమ్మింగ్‌ నేర్చుకోవాలనుకున్నాను. దానికి కోచ్‌ సాజీ ప్రోత్సాహం కూడా తోడైంది. ఈ సంవత్సరం మొదట్లో పెరియార్‌ నదిలో ఈత కొట్టాను. ఇప్పుడు చేతులు కట్టుకుని మరీ స్విమ్ చేయగలిగాను.. దీని ద్వారా నేను చెప్పేది ఒక్కటే.. మనం అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అంతే కాదు.. ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవడం ఎంతో అవసరం’ అని చెప్పుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్