అలంకరణ మొక్కలే ఆమె ఆదాయ మార్గం!

మన వ్యక్తిగత ఆసక్తి, మనం చేసే ఉద్యోగం ఒకటి కానప్పుడు అది మంచి ఉద్యోగమైనా, వేలల్లో జీతాలొచ్చినా మనసుకు తృప్తే ఉండదు.

Updated : 25 Dec 2021 19:33 IST

మన వ్యక్తిగత ఆసక్తి, మనం చేసే ఉద్యోగం ఒకటి కానప్పుడు అది మంచి ఉద్యోగమైనా, వేలల్లో జీతాలొచ్చినా మనసుకు తృప్తే ఉండదు. ఈ ఫీలింగ్‌తోనే తమకు అభిరుచి, తపన ఉన్న రంగాల వైపు అడుగులేయడానికి ఉన్నత ఉద్యోగాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంటారు కొందరు మహిళలు. కేరళకు చెందిన సుమి శ్యామ్‌రాజ్‌ ఇందుకు మినహాయింపు కాదు. సివిల్‌ ఇంజినీరింగ్‌, కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీలో మంచి ఉద్యోగం, వేల కొద్దీ జీతం.. ఇవేవీ ఇవ్వని సంతృప్తి వ్యవసాయంలో తనకు దక్కుతోందంటుందామె. ఈ విషయంలో తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అంటోన్న ఆమె.. టెర్రస్‌పైనే అలంకరణ మొక్కలు పెంచుతోంది. వేల ఆదాయం ఆర్జిస్తోంది. ‘మనసుంటే మార్గముంటుంద’న్నట్లు.. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అలవోకగా రాణించచ్చంటూ తన మాటలతోనూ నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది.

సుమి శ్యామ్‌రాజ్.. కేరళలోని అలువ సిటీలో నివసిస్తుంటుంది. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. చిన్నతనం నుంచీ వాళ్లను చూస్తూ పెరిగిన ఆమెకూ వ్యవసాయమంటే మక్కువ పెరిగింది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి.. కన్స్‌స్ట్రక్షన్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

ఉద్యోగం వద్దనుకొని!

మంచి ఉద్యోగం, వేల కొద్దీ జీతం వచ్చినా.. తన మనసులో వ్యవసాయం చేయాలని, సొంతంగా కూరగాయలు పండించుకోవాలని తపన పడేది. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు ఉద్యోగాన్ని వదులుకొని ఈ దిశగా అడుగేసింది సుమి. ఇందుకోసం పొరుగింట్లో సుమారు 16 సెంట్ల భూమిని లీజుకు తీసుకుంది. ఇందులోనే కాయగూరలు, అలంకరణ మొక్కలు పెంచడం మొదలు పెట్టిందామె. అయితే కొన్నాళ్లకు లీజుకు తీసుకున్న భూమిని యజమాని అమ్మేయడంతో.. ఇక చేసేది లేక తన గార్డెనింగ్‌ని డాబా పైకి మార్చిందీ గార్డెన్‌ లవర్‌. అప్పట్నుంచి మూడు సెంట్ల రూఫ్‌టాప్‌నే తన వ్యవసాయ క్షేత్రంగా చేసుకుంది సుమి. అయితే లాక్‌డౌన్‌ సమయం నుంచే తన వ్యాపారానికి గిరాకీ పెరిగిందని చెబుతోందామె.


లాక్‌డౌన్‌లో మొదలైంది!

‘మా వారిది టైర్ల బిజినెస్‌. అయితే లాక్‌డౌన్‌ సమయంలో షాపు మూసేయాల్సి రావడంతో ఆన్‌లైన్‌ వేదికగా ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నా. అప్పటికే మా టెర్రస్‌పై కాయగూరలు పండించడం, అలంకరణ మొక్కలు పెంచడంలో బిజీగా ఉన్న నాకు.. వీటినే ఆన్‌లైన్‌ వేదికగా అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ‘Sumi's Garden’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్‌ చేసి.. అలంకరణ మొక్కలకు సంబంధించిన ఫొటోల్ని అందులో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టా. దీంతో తెలిసిన వారి దగ్గర్నుంచే కాదు.. క్రమంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఆ మొక్కలు మాకు కావాలంటూ ఆర్డర్లొచ్చేవి. అలా క్రమంగా ఈ మొక్కలకు ఆదరణ పెరగడంతో ప్రస్తుతం కొన్ని దేశాలకూ వీటిని పంపిస్తున్నాం.. ఇలా సామాన్యులే కాదు.. మమ్ముట్టి వంటి దిగ్గజ నటులు కూడా ఈ అలంకరణ మొక్కలు కావాలంటూ మమ్మల్ని సంప్రదించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది..’ అంటూ తన బిజినెస్‌ గురించి పంచుకుందామె.


80కి పైగా రకాలు!

టొమాటో, క్యాబేజీ, క్యారట్‌, బెండకాయ.. వంటి వివిధ రకాల కాయగూరల్ని సాగు చేస్తోన్న సుమి రూఫ్‌ గార్డెన్‌లో.. సుమారు 80కి పైగా అలంకరణ మొక్కలున్నాయి. Episia, Begonia, Philodendron, Peperomia.. వంటివి అందులో కొన్ని! మొక్కను బట్టి సరసమైన ధరల్లోనే వాటిని విక్రయిస్తోన్న ఆమె నెలకు సుమారు 30 వేలకు పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నానంటోంది. ఇక చీడపీడల నుంచి వీటిని రక్షించడానికి ఫంగస్‌ స్ప్రేలు వాడతానని చెబుతోంది సుమి. అయితే వినియోగదారులకు మొక్కల్ని చేరవేయడంతో పనైపోయిందని చేతులు దులిపేసుకోకుండా.. వాటి సంరక్షణకు సంబంధించిన చిట్కాల్ని, మెలకువల్ని సైతం వారికి అందిస్తుంటుంది.


ప్రయత్నిస్తే పోయేదేముంది?!

మొక్కల వ్యాపారంలో మేటిగా రాణిస్తోన్న సుమి ‘కర్షకశ్రీ అవార్డు’ కూడా అందుకుంది. ‘ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ముందు మనసులోని ఆ తపనేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేసే పనికి చిన్న, పెద్ద అని పేరు పెట్టకుండా, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా ప్రయత్నిస్తే ఇంట్లో కూర్చొని కూడా సక్సెస్‌ సాధించచ్చు.. నేను నమ్మిన సిద్ధాంతమిదే!’ అంటూ తన మాటలతోనూ తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌. అంతేకాదు.. యూట్యూబ్‌ వేదికగా కాయగూరలు పండించడం, మొక్కల సంరక్షణ, అలంకరణ మొక్కల్ని పెంచడం.. వంటి అంశాలకు సంబంధించిన పాఠాలు కూడా చెబుతుంటుందీ ప్లాంట్‌ లవర్‌. ఇలా ఎంత బిజీగా ఉన్నా తన మూడేళ్ల చిన్నారితో గడిపే విషయంలో ఏమాత్రం రాజీ పడనంటోందీ బిజినెస్‌ మామ్‌.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్