మంచుఖండంలో.. ఎముకలు కొరికే చలిలో.. సాధించేసింది!

చాలామంది చలికాలంలో తొందరగా లేవాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆ చలిలో పొద్దున్నే లేచి రన్నింగ్‌ చేయమంటే వారికి ఉదయమే చుక్కలు కనిపిస్తుంటాయి. అలాంటిది లాట్వియా దేశానికి చెందిన ఓ మహిళ అంటార్కిటికాలో ఐస్‌ మారథాన్‌ చేసి ఔరా అనిపించింది.

Published : 24 Dec 2021 13:34 IST

(Photo: Instagram)

చాలామంది చలికాలంలో తొందరగా లేవాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆ చలిలో పొద్దున్నే లేచి రన్నింగ్‌ చేయమంటే వారికి ఉదయమే చుక్కలు కనిపిస్తుంటాయి. అలాంటిది లాట్వియా దేశానికి చెందిన ఓ మహిళ అంటార్కిటికాలో ఐస్‌ మారథాన్‌ చేసి ఔరా అనిపించింది. నాలుగు గంటల ఆరు నిమిషాల పదకొండు సెకన్లలో 42.195 కిలోమీటర్ల మారథాన్‌ పూర్తి చేసి ఎనిమిదేళ్ల క్రితం నాటి రికార్డును బద్దలుకొట్టింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..

అసాధారణ ఉష్ణోగ్రతల నడుమ...

అమెరికాకు చెందిన రన్‌బక్‌ అనే సంస్థ ఏటా అంటార్కిటిక్‌ ఐస్‌ మారథాన్‌ను నిర్వహిస్తుంటుంది. 2005లో మొట్టమొదటిగా ఈ మారథాన్‌ జరిగింది. ఇందులో భాగంగా 42.195 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇది అంటార్కిటికాలోని యూనియన్‌ గ్లేసియర్‌ క్యాంప్‌లో జరుగుతుంది. ఈ క్యాంప్‌ దక్షిణ ధృవానికి ఆరు వందల మైళ్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉష్టోగ్రతలు -24° నుంచి -1 డిగ్రీల° మధ్య ఉంటూ మంచు మెత్తగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తీవ్రమైన చలిగాలులు వస్తుంటాయి. ప్రస్తుత మారథాన్ కూడా మంచు తుఫాన్ వల్ల మూడు రోజుల వాయిదా తర్వాత జరిగింది. ఇలాంటి వాతావరణంలో మారథాన్‌ అంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ. పదహారోసారి జరిగిన ఈ మారథాన్‌లో 18 దేశాల నుంచి 62 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

ఎనిమిదేళ్ల నాటి రికార్డుని బ్రేక్‌ చేసింది...

ప్రస్తుత మారథాన్‌ డిసెంబర్‌ 17న జరిగింది. ఇందులో లాట్వియా దేశానికి చెందిన ఎవిజా రీన్ అనే ముప్పై ఏళ్ల మహిళ నాలుగు గంటల ఆరు నిమిషాల పదకొండు సెకన్ల (04:06:11)లో లక్ష్యాన్ని పూర్తి చేసి ఎనిమిదేళ్ల నాటి రికార్డుని బద్దలుకొట్టింది. అంతకుముందు 2013లో బ్రిటన్‌కు చెందిన ఫియోనా ఓక్స్ నాలుగు గంటల ఇరవై నిమిషాల మూడు సెకన్ల (4:20:02)లో ఈ మారథాన్‌ని పూర్తి చేసింది. ప్రస్తుత మారథాన్‌లో అమెరికాకు చెందిన గ్రేస్ యావో (05:10:10) రెండో స్థానంలో నిలవగా, బ్రిటన్‌కు చెందిన జులియా హంటర్ (05:34:03) మూడో స్థానం సంపాదించింది. ‘వరల్డ్‌ మారథాన్‌ ఛాలెంజ్‌’ కూడా ఈ మారథాన్‌తోనే ప్రారంభమవుతుంటుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఏడు రోజుల్లో ఏడు ఖండాల్లో 42.195 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలా కలను సాకారం చేసుకుంది...

ఎవిజాకు మారథాన్లలో పాల్గొనడమంటే చాలా ఇష్టం. గత 11 సంవత్సరాలుగా ఆమె 34 మారథాన్లలో పాల్గొంది. ఆమె 2017లో రోటర్ డ్యామ్లో చేసిన మారథాన్ ఆమె కెరీర్‌లో నిలిచిపోతుంది. ఆ మారథాన్‌ని ఆమె 3:17:44 సమయంలో పూర్తి చేసింది. అయితే ఆమె కల మాత్రం ఐస్ మారథాన్‌లో పాల్గొనడమే. ప్రస్తుత ఐస్‌ మారథాన్ కోసం ఎవిజా ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తోంది. రోజులు లెక్కపెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టులే దానికి నిదర్శనం. అయితే ఈ ఐస్‌ మారథాన్‌లో పాల్గొనే క్రమంలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ఓ సందర్భంలో పేర్కొంది.

‘ఈ పోటీలు చాలా ఖరీదైనవి. దీనికోసం చేసిన ఖర్చుతో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనచ్చు. దీనికి కావాల్సిన షూలు కూడా ఎంతో ఖరీదైనవి. వాటిని కొనలేక నేను అద్దెకు తీసుకున్నాను. వీటితో -100 డిగ్రీల చలిలో కూడా పరిగెత్తచ్చు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు పోటీలకు ముందు దాదాపు 11 సార్లు కొవిడ్‌ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందట. అలాగే నాలుగుసార్లు నిర్ణీత సమయానికి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయట.

వాటికి దూరంగా..! 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టే ఈ రన్నర్‌.. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలకు దూరంగా ఉంటుందట. ‘గత రెండు వారాలుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు దూరంగా ఉన్నాను. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడం వల్ల జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేయచ్చు. ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిగా నిద్ర పోవచ్చు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి.. అది కుదరకపోతే కనీసం పరిమితంగా ఉండండి’ అంటూ తన అభిమానులకు చెప్పుకొచ్చిందీ రన్నర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్