Published : 06/05/2022 16:54 IST

స్కిప్పింగ్‌ రోప్‌తో లక్షలు సంపాదిస్తోంది!

(Photos: Instagram)

ఎవరైనా ఉద్యోగం కోల్పోతే ఏం చేస్తాం.. మొదట్లో కొన్నాళ్లు ఇబ్బంది పడతాం.. పరిస్థితులు సద్దుమణిగాక కొత్త ఉద్యోగం వెతుక్కుంటాం. ఇంగ్లండ్‌లోని సెయింట్‌ ఆల్బన్స్‌కు చెందిన లారెన్‌ ఫ్లైమెన్‌ అలా చేయలేదు. కరోనా ప్రభావంతో తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వ్యాయామాన్ని మార్గంగా ఎంచుకుందామె. అందులోనూ ముఖ్యంగా స్కిప్పింగ్‌ రోప్‌ ఎక్సర్‌సైజ్‌కు ఫిదా అయిపోయింది. ఆపై దాన్నే తన కెరీర్‌గా, ఆదాయ మార్గంగా మార్చుకుంది. ఇక ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా మారి లక్షలు సంపాదిస్తోంది. మరి, తనకు ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఆమె కథ చదవాల్సిందే!

కరోనా ప్రభావంతో ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.. ఆదాయం లేక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. లారెన్ ఫ్లైమెన్దీ ఇదే పరిస్థితి. ఇంగ్లండ్‌లోని సెయింట్‌ ఆల్బన్స్‌కు చెందిన ఆమె.. స్థానికంగా ఓ సేల్స్‌ కంపెనీలో పనిచేసేది. వృత్తిరీత్యా ఎక్కువ సమయం ఫీల్డ్ లోనే గడపాల్సి వచ్చేదామె. ఒక రకంగా ఇది ఆమెలో అసహనానికి దారితీసింది. ఇదే సమయంలో కరోనా విజృంభించడం, లారెన్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవడం.. చకచకా జరిగిపోయాయి.

ఆ ఆలోచనల్ని అధిగమించడానికి..!

ఎంత ఇష్టం లేకపోయినా ఉద్యోగం పోయిందంటే.. ఆర్థిక స్వేచ్ఛనిచ్చే ఆదాయ మార్గం కోల్పోయినట్లే! ఈ భావనతోనే మొదట్లో కొన్నాళ్లు బాధపడింది లారెన్. ఇక మరోవైపు కరోనా కారణంగా తన పెళ్లి కూడా వాయిదా పడింది. ఇలా తనకు కలిసి రాని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రతికూల ఆలోచనల్ని అధిగమించడానికి దగ్గర్లోని జిమ్‌ను ఆశ్రయించిందామె. అక్కడే మూలకు పడి ఉన్న స్కిప్పింగ్‌ రోప్‌ను చూసిందామె. దాంతో విభిన్న రకాలుగా స్కిప్పింగ్‌ సాధన చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో శారీరకంగా దృఢంగా మారడంతో పాటు.. మానసిక ప్రశాంతతను పొందడం గమనించింది లారెన్‌. అంతేకాదు.. తన స్కిప్పింగ్‌ రోప్‌ వీడియోలను, తనకు తెలిసిన ఫిట్‌నెస్‌ టిప్స్‌ను తన ఇన్‌స్టా కమ్యూనిటీతో పంచుకునేదామె. అలా క్రమంగా తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోయిన లారెన్‌.. ఏడాదిన్నర వ్యవధిలోనే ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మారిపోయింది.

స్కిప్పింగ్‌తో జీవితమే మారిపోయింది!

సోషల్‌ మీడియాలో ‘లారెన్ జంప్స్‌’ పేరుతో పాపులర్‌ అయిన లారెన్‌.. వారానికి ఆరు గంటలు స్కిప్పింగ్‌ వర్కవుట్‌కి సమయం కేటాయిస్తోంది. ఇక మిగతా సమయాన్ని దీనికి సంబంధించిన కంటెంట్‌ని, ట్యుటోరియల్‌ వీడియోలు రూపొందించడానికి వెచ్చిస్తోంది. ఈ క్రమంలోనే తన అనుభవాల గురించి అడిగితే.. మనసు నిండా ప్రశాంతత, చేతి నిండా డబ్బు.. ఈ రెండూ స్కిప్పింగ్‌తో తన సొంతమయ్యాయని చెబుతోందీ ఫిట్‌నెస్‌ లవర్.

‘సేల్స్‌ కంపెనీలో ఉద్యోగం చేసినన్నాళ్లూ అసంతృప్తిగా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఎంతో సంతృప్తితో, సంతోషంగా ఉన్నా. కారణం.. స్కిప్పింగ్‌ రోప్‌ వ్యాయామం. ఇది ఎన్నో రకాలుగా నా జీవితంలో మార్పులు తీసుకొచ్చింది. నాలో సానుకూల దృక్పథాన్ని నింపింది. గత ఉద్యోగంతో పోల్చితే ఆర్థికంగా మరింత దృఢమయ్యా. ఈ డబ్బుతో కనీస అవసరాలు తీర్చుకోవడమే కాదు.. కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది లారెన్.

ప్రచారకర్తగానూ..!

ప్రస్తుతం స్కిప్పింగ్‌ రోప్‌తో విభిన్న రకాలుగా వ్యాయామం చేయగలిగేంత నైపుణ్యం సాధించిన లారెన్‌కు ఇన్‌స్టాలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఆమె పెట్టే వీడియోలు, చెప్పే సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తూ తామూ ఈ వర్కవుట్‌తో ప్రయోజనం పొందుతున్నామంటూ కామెంట్లు పోస్ట్‌ చేస్తుంటారు చాలామంది. ఇలా తన స్కిప్పింగ్‌ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన లారెన్‌కు ఎన్నో ప్రముఖ డైట్‌ బ్రాండ్స్‌, స్పోర్‌్స్ వేర్‌ బ్రాండ్స్‌ నుంచి తమకు ప్రచారకర్తగా వ్యవహరించాలంటూ ఆహ్వానాలు అందాయి. ప్రస్తుతం వాళ్ల ఉత్పత్తుల్ని ధరిస్తూ - డైట్‌ టిప్స్‌ పాటిస్తూ.. స్కిప్పింగ్‌ రోప్‌ వ్యాయామాలు చేస్తూ లక్షలు సంపాదిస్తోంది లారెన్‌. అంతేకాదు.. విభిన్న రకాల స్కిప్పింగ్‌ రోప్స్ తయారుచేయిస్తూ.. వాటినీ సోషల్‌ మీడియాలో విక్రయిస్తోంది.

‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయక్కర్లేదు.. మనలోని తపనను కూడా ఆదాయ మార్గంగా మలచుకోవచ్చు..’ అంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది లారెన్.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని