Published : 15/12/2021 18:03 IST

Leena Nair: కొల్హాపూర్‌ నుంచి ఆ కంపెనీ సీఈవో దాకా!

(Photo: Instagram)

‘ఏదో ఒక కోర్సు తీసుకున్నామా? చదివామా? అన్నట్లుగా కాకుండా మన చదువు మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఉపయోగపడాలి.. మనలోని ప్రత్యేకతల్ని తట్టి లేపాలి..’ నాడు ప్రొఫెసర్‌ చెప్పిన ఈ మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది లీనా నాయర్‌. ఇంజినీరింగ్‌లో పైచదువులు చదవాలన్న తన ఆలోచనను మార్చుకొని మేనేజ్‌మెంట్‌ వైపు అడుగులు వేసింది. Unilever వంటి ప్రముఖ కంపెనీలో ట్రైనీగా కెరీర్‌ ప్రారంభించి హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగింది. ఇక తాజాగా అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’ కి గ్లోబల్‌ సీఈఓగా నియమితురాలైందామె. దీంతో విదేశీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతికొద్ది మంది భారతీయుల సరసన చేరి చరిత్ర సృష్టించింది లీనా. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

లీనా నాయర్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించింది. స్థానికంగా స్కూలింగ్‌ పూర్తి చేసిన ఆమె.. అక్కడి సంగ్లి సిటీలోని వాల్‌చంద్‌ కాలేజ్‌లో ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌’ విభాగంలో ఇంజినీరింగ్‌ చేసింది. అయితే ఇదే దిశగా తన పైచదువులు కొనసాగించాలనుకున్న ఆమె.. తన ప్రొఫెసర్‌ స్ఫూర్తితో కెరీర్‌ను మార్చుకున్నానని చెబుతోంది.

ప్రొఫెసర్‌ సలహాతో..!

‘కాలేజీ రోజుల్లో అందరిలాగే నేనూ ఓ పెద్ద ఇంజినీర్‌ కావాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ఇంజినీరింగ్‌ డిగ్రీ చేశా. అయితే అదే సమయంలో మా కాలేజీ ప్రొఫెసర్‌ ఒకరు నాకో గొప్ప సలహా ఇచ్చారు. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని.. ‘నువ్వో పెద్ద ఇంజినీర్‌ అవుతావు.. అందులో సందేహమే లేదు. అయితే నువ్వు మేనేజ్‌మెంట్‌ విభాగంలో మరిన్ని అద్భుతాలు సృష్టించగలవని నాకనిపిస్తోంది. ఎందుకంటే ఇతరులతో సులభంగా మమేకమయ్యే నైపుణ్యాలు నీలో కనిపిస్తున్నాయి.. నీ జీవిత లక్ష్యమేంటో ఒక్కసారి లోతుగా ఆలోచించి చూడు! కెరీర్‌లో ఏ స్థాయిలో ఉన్నా ఇతరుల నుంచి నేర్చుకోవడం మాత్రం మానకు!’ అన్నారాయన. ఇలా ఆ ప్రొఫెసర్‌ చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి రగిలించాయి. నా జీవిత లక్ష్యంపై నాకు పూర్తి స్పష్టత వచ్చేలా చేశాయి. అందుకే ఆ తర్వాత ఇంజినీరింగ్‌ నుంచి ఎంబీఏ వైపు అడుగులేశా. జెంషెడ్‌పూర్‌లోని ‘జేవియర్ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నా..’ అని చెప్పుకొచ్చారు లీనా.

మూడు దశాబ్దాల అనుబంధం అది!

చదువు పూర్తయ్యాక 1992లో ప్రతిష్ఠాత్మక ‘Hindustan Unilever’ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా కెరీర్‌ ప్రారంభించారు లీనా. ఈ క్రమంలో కోల్‌కతా, తమిళనాడు, మహారాష్ట్రల్లోని ఆ సంస్థ ఫ్యాక్టరీల్లో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆ సంస్థ ఫ్యాక్టరీల్లో పనిచేసిన అతికొద్ది మంది మహిళల్లో లీనా ఒకరు. అలా పురుషాధిపత్యం ఉన్న రంగంలోనూ మహిళలు రాణించగలరని నిరూపించారు. ఇక అప్పట్నుంచి ఆ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారామె. 2007లో యూనీలీవర్ దక్షిణాసియా నాయకత్వ బృందానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ‘Diversity and Inclusion’ గ్లోబల్‌ హెడ్‌గా కొనసాగారు. ఇక 2016 నుంచి ఈ సంస్థకు తొలి మహిళా ‘ప్రధాన మానవ వనరుల అధికారి (CHRO)’గా, ‘యూనీలీవర్ లీడర్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌’ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇలా తన మూడు దశాబ్దాల కెరీర్‌ను ఈ సంస్థకు అంకితం చేసిన లీనా.. ఈ వ్యవధిలో సుమారు 50 దేశాలకు పైగా విస్తరించిన ఈ కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

ఆ కంపెనీ సీఈఓగా!

సుమారు 30 ఏళ్ల పాటు Unilever కంపెనీలో వివిధ బాధ్యతల్లో కొనసాగిన లీనా.. తాజాగా ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’కు గ్లోబల్‌ సీఈఓగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఈ పదవి చేపట్టనున్న ఆమె.. ‘ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం.. బృహత్తర బాధ్యత!’ అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో అంతర్జాతీయంగా పేరు మోసిన కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతికొద్ది మంది భారతీయుల సరసన చేరారు లీనా.

మెంటర్లను మర్చిపోను!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ఉన్నత వ్యక్తుల దగ్గర్నుంచి సలహాల్ని స్వీకరించాలని ఆనాడు తన ప్రొఫెసర్‌ చెప్పిన మాటల్ని నేటికీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నానంటున్నారు లీనా. ఇందుకు నిదర్శనమే ఆమె తరచూ పెట్టే ఇన్‌స్టా పోస్టులు! ఈ క్రమంలో ఇటీవలే Unilever ఏర్పాటు చేసిన ఓ మానసిక అవగాహన కార్యక్రమంలో ఇంద్రానూయీ (Pepsi Bottling Group)ని కలిసిన ఆమె.. తనని తన మెంటర్‌గా పేర్కొంటూ ఆమెతో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

పైఅధికారిగా కాదు.. ఫ్రెండ్‌లా!

* వృత్తిలో ఉన్నప్పుడు హోదా ప్రదర్శించడం తనకు నచ్చదంటారు లీనా. ఈ క్రమంలోనే తన కింది స్థాయి ఉద్యోగులు, సహచరులతో ఎంతో ఫ్రెండ్లీగా మెలుగుతుంటారు. సందర్భం వచ్చినప్పుడు వాళ్లతో కలిసి కాలు కూడా కదుపుతుంటారు. ఈ ఇన్‌స్టా పోస్టే అందుకు నిదర్శనం!

* పెళ్లై ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటి బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తోన్న ఆమె.. పుస్తకాలు చదవడం, రన్నింగ్, డ్యాన్స్‌ చేయడం.. వంటి వ్యాపకాలతోనే పూర్తిగా రిలాక్సవుతానంటున్నారు.

* తన ప్రతిభకు, పనితనానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె.. ఈ ఏడాది ఫార్చ్యూన్‌ విడుదల చేసిన ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

* ఉన్నత వ్యక్తులు చెప్పే మాటల్ని స్వీకరించడం, తాను స్ఫూర్తి పొందడమే కాదు.. ఆయా కొటేషన్స్‌ని ఇన్‌స్టా పోస్టుల రూపంలో పంచుకోవడం లీనాకు అలవాటు!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని