అక్కలా ఎవరూ కాకూడదనే...!

డాక్టర్‌ అయి... నాన్నకిచ్చిన మాట నెరవేర్చాలనుకుంది ఆ పిచ్చితల్లి. పొత్తిళ్లలో మూణ్నెళ్ల పసిబిడ్డతో పీజీ వైద్యవిద్యలో సీటు దక్కించుకుంది. పట్టుదలతో అనుకున్నది సాధించినా...  కొందరు ప్రొఫెసర్ల నీచబుద్ధికి బలై పోరాటం చేసింది... 

Updated : 08 Dec 2022 22:07 IST

 

డాక్టర్‌ అయి... నాన్నకిచ్చిన మాట నెరవేర్చాలనుకుంది ఆ పిచ్చితల్లి. పొత్తిళ్లలో మూణ్నెళ్ల పసిబిడ్డతో పీజీ వైద్యవిద్యలో సీటు దక్కించుకుంది. పట్టుదలతో అనుకున్నది సాధించినా...  కొందరు ప్రొఫెసర్ల నీచబుద్ధికి బలై పోరాటం చేసింది.  వైద్యురాలు కావాలనే తన కోరికని 
తుంచేస్తే తట్టుకోలేకపోయింది.  ఆమే పీజీ వైద్య విద్యార్థిని శిల్ప. అయితేనేం ఆమె చావుకి కారణమైన వారిని మాత్రం శిల్ప చెల్లెలు వదల్లేదు. న్యాయాన్ని గెలిపించే దిశగా అడుగులు వేసింది. అదంతా శ్రుతి మాటల్లోనే... 
అలా అక్క జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ తనకోసం వెళ్లా. అయితే అక్క ఎలాగూ రాదు. కానీ తనలా ఇతర ఆడపిల్లలు బాధపడి జీవితం చాలించకూడదు. తప్పు చేసిన వాళ్లని చట్టానికి పట్టించాలి అని నిర్ణయించుకున్నా. మాకు రాజకీయంగా ఎలాంటి పలుకుబడి లేదు. అయినా నేను పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశా. ఆడపిల్లల బాధను అర్థం చేసుకోమని కోరా. ప్రభుత్వం వెంటనే ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. సీఐడీ సిట్‌కు బదిలీ చేసింది. ఐదుగురు సీఐలతో దర్యాప్తునకు ఆదేశించింది. నిజానికి పట్టించుకోరేమో అనుకున్నా కానీ కేవలం నాలుగు నెలల్లోనే నిజాలు నిగ్గుదేల్చారు పోలీసు అధికారులు. వాళ్లను అరెస్టు చేయమన్నారు. కనీసం ఇప్పుడైనా మా అక్క ఆత్మకు శాంతి చేకూరుతుంది. మరికొందరు బాధితురాళ్లకూ నిందితుల అరెస్టుతో ఊరట వస్తుందని అనుకుంటున్నా. సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు. దాన్ని మానసిక స్థైర్యంతో తిప్పి కొట్టడమే అసలైన విజయం. మా అక్క అలా కాకుండా చావుతో విజయం సాధించాలనుకుంది. అది మాత్రమే బాధాకరం. 
ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి పడుకున్నా. ఇంతలో బావ ఫోన్‌. ‘శ్రుతీ... మీ అక్క ఇక లేదు’ అని ఇంకా ఏదో చెబుతున్నారు. ఒక్క క్షణం నా చుట్టూ అంతా స్తంభించినట్టైంది. వెంటనే బెంగళూరు నుంచి తిరుపతికి బయల్దేరా. కళ్లు మూసుకుంటే అక్క ఆలోచనలే! అసలేమైందంటే... 
మాది చిత్తూరు జిల్లా పీలేరు. మా నాన్న బ్యాంకు ఉద్యోగి. మేమిద్దరం ఆడపిల్లలం. అక్క శిల్పకీ, నాకూ మూడేళ్లు తేడా. ఇద్దరం తోబుట్టువుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్లం. నాన్న మా ఇద్దర్నీ చదువుల పరంగా ఎంతో ప్రోత్సహించేవారు. ఎందుకో తెలియదు గానీ అక్కని డాక్టర్‌ చేయాలని నాన్న కలలు కనేవారు. పైగా అక్క చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. నాన్న కోసం పట్టుదలతో ఎంసెట్‌ రాసి... ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు తెచ్చుకుంది. కష్టపడి చదివి డిస్టింక్షన్‌లో పాసైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పని చేసింది. ఆ తరువాత   పీజీ చేయాలనిపించింది. మా బావ కూడా అదే రంగంలో ఉండటంతో చదువుకోమని ప్రోత్సహించారు. 
చంటి బిడ్డతో చదువు: అలా పిల్లల వైద్యురాలు కావాలని అర్హత పరీక్షకు దరఖాస్తు చేసింది. అప్పటికి అక్కకి ప్రసవమై మూడు నెలలు. పసిబిడ్డని చూసుకుంటూనే.. కేవలం మూడంటే మూడు నెలలు చదివి పరీక్ష రాసింది. మంచి ర్యాంకు తెచ్చుకుని ఉచిత సీటుకు ఎంపికైంది. 2015లో అక్క పీజీ విద్యార్థినిగా ఎస్వీ క్యాంపస్‌లో చేరింది. మొదటి ఏడాది సాఫీగానే సాగింది. తనకి ఎప్పుడూ రాత్రి షిఫ్టు వేసేవారు. ‘నిద్ర సరిపోవట్లేదు, ఒత్తిడిగా ఉంటోంది, తరచూ తలనొప్పి వస్తోంది’ అని చెప్పేది. రెండో ఏడాది నుంచే సమస్యలు మొదలయ్యాయి. ‘కొందరు ప్రొఫెసర్లు అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటోంది. వారి మాటతీరు,  చూపులతోనే ఏం కోరుకుంటున్నారో తెలుస్తోంది’ అంటూ ఏడ్చేది. కొన్ని రోజుల తరువాత వారికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది. దానికి ఫలితంగా తరగతిలో అక్కతో ఎవరూ మాట్లాడకుండా ఆమె కాస్‌మేట్స్‌ నోర్లు కట్టేశారు ఆ ప్రొఫెసర్లు. గంటల తరబడి పాఠాలు చదువుకునే చోట ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో నేను అర్థంచేసుకున్నా. పైగా అది కావాలని చేసిందని తెలిస్తే ఇంకెంత బాధగా ఉంటుంది. 

బాధలు భరించింది: రోజురోజుకీ సమస్యలు పెరిగాయి తప్ప తగ్గలేదు. రోగుల ముందు అవమానించడం, కొట్టడం వంటివి చేశారు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌. ఒకసారి ఏకంగా ముఖంపై వేడి వేడి టీ విసిరికొట్టాడట. తరచూ చేతిలోని ఫైళ్లు, పుస్తకాలు విసరడం.. చించి మీద వేయడం కూడా అక్క ఎదుర్కొంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ తప్పులు వెతుకుతుండేవాడు. సమయం దొరికితే చాలు లైంగికంగా వేధించి మాటలతో హింసించేవాడు. ఏం మాట్లాడినా అందులో ద్వంద్వార్థం ఉండేది. ఆయనతోపాటు ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరీటీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశికుమార్‌లు కూడా అక్కని కుంగిపోయేలా ఒంటరిని చేశారు. ఇలాంటి ఎన్ని సమస్యలున్నా అక్క చదువుని వదల్లేదు. ఒకరోజు వారి వికృత చేష్టలు భరించలేకపోయింది. తనలా మౌనంగా బాధపడుతోన్న ఇతర అమ్మాయిలకోసమైనా ఏదో ఒకటి చేయాలని అనుకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌కి సమస్యని వివరిస్తూ మెయిల్‌ పెట్టింది. వెంటనే ఓ కమిటీని వేయాలంటూ రాజ్‌భవన్‌ నుంచి అక్కడి కలెక్టర్‌కి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు మా బావ కూడా సమస్యని అర్థం చేసుకుని అడుగడుగునా అక్క పక్కనే ఉండేవారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. 
పక్కన పెట్టేశారు: ప్రొఫెసర్లేమో ‘నువ్వు పరీక్షల్లో ఎలా పాసవుతావో చూస్తాం’ అంటూ బెదిరించేవారు. అయినా అక్క ‘నా కష్టాన్ని నేను నమ్ముకున్నా’ అని ధైర్యంగా ఉండేది. వైవా సమయంలో విద్యార్థులందర్నీ ప్రశలడిగి అక్కని మాత్రమే పక్కన పెట్టేశారు. గంటలతరబడి ఎదురు చూసేలా చేసేవారు. ఎందుకిలా అని అడిగినా పట్టించుకోలేదు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన అక్క ఆ సంఘటనతో మరింత ఒత్తిడికి లోనైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరీక్షలు జరిగాయి.   ఆ తరువాత బాబుతోనే ఎక్కువ సమయం గడిపేది. తన గురించి తెలిసి మేం బాధపడుతోంటే... ‘వీడిని చూసుకుంటూ బతికేస్తా.. నాకేం కాదు’ అని మాకు ధైర్యం చెప్పేది. జులైలో ఫలితాలు వచ్చాయి. కేవలం ఎనిమిది మార్కులతో ఫెయిల్‌ అయింది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. ఎక్కడన్నా పొరబాటు జరిగిందేమోనని రీవాల్యూయేషన్‌కీ దరఖాస్తు చేయించాం. 
అది తట్టుకోలేకపోయింది: ఆగష్టు 8నే ఆ ఫలితాలు కూడా వచ్చాయి. అక్క మాకు ఫోను చేసి ‘మార్కులు ఏమీ అదనంగా రాలేదు. ఫెయిల్‌ అయ్యా’ అని చెప్పింది. పైగా ఆ రోజు క్యాంపస్‌లో రవికుమార్‌ బృందం కేకు కోసి, అందరికీ పంచి.. అక్క వైఫల్యాన్ని సంతోషంగా జరుపుకొందట. ఆ ఫొటోలు తనకి ఎవరో పంపారు. అది తెలిసి తట్టుకోలేకపోయింది. సాయంత్రం వేళ ‘నేను వంట చేయలేను. బాబుకి ఏమైనా తినిపించండి’ అని బావని, బాబుని బయటకు పంపి ఉరివేసుకుంది...

- పద్మ వడ్డె

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్