శాండ్‌విచ్‌లు అమ్ముతూ సాధిస్తున్నారు..

‘ సినిమా కష్టాలు’ అని ఎందుకు అంటారు? అలాంటివి కేవలం చిత్రాల్లో మాత్రమే చూస్తామని..

Updated : 09 Dec 2022 15:49 IST

‘ సినిమా కష్టాలు’ అని ఎందుకు అంటారు? అలాంటివి కేవలం చిత్రాల్లో మాత్రమే చూస్తామని.. వాటిని దాటుకుని రావడం అసాధ్యమని చెప్పడానికి! ఈ తల్లీకూతుళ్లవీ అలాంటి కష్టాలే కానీ వాటిని దాటుకుని చక్కటి విజయం నమోదుచేశారు. అచ్చంగా సినిమాల్లోలాంటి విజయం అది. కచ్చితంగా చెప్పాలంటే అమీర్‌ఖాన్‌ చిత్రం ‘దంగల్‌’లో చూపించిన జీవితంలాంటిది! ఆ కథేమిటో మీరే చదవండి..

ముంబయి-గోవా జాతీయ రహదారిలో వెళ్తుంటే వస్తుందా గ్రామం. పేరు లోనెరె. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లాలోని మాన్‌గావ్‌ తాలూకా పరిధిలోకి వస్తుంది. జాతీయ రహదారికి దగ్గర్లో ఉంటుంది కాబట్టి కాస్త పెద్ద గ్రామమే అనుకోవచ్చుదాన్ని. ఉదయం, సాయంత్రాలలో అక్కడికి వస్తూపోయే ప్రయాణికుల కోసం టీ, శాండ్‌విచ్‌ అమ్ముతుంటారు ఆ దంపతులు. ఆయన పేరు జయంత్‌ పటేకర్‌. ఆమె పేరు జ్యోతిక. దాదాపు పాతికేళ్లుగా వీళ్లు అక్కడ ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న వాళ్లమ్మాయి వైభవి కాలేజీ పూర్తికాగానే వీళ్ల దుకాణానికి వచ్చి తల్లిదండ్రులకి చేదోడువాదోడుగా ఉంటుంది. ఆ కుటుంబం అక్కడికి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న గోరెగావ్‌ గ్రామంలో ఉంటుందని తప్ప.. వాళ్ల గురించి ఇంకేమీ తెలియదు లోనెరె వాసులకి! నిజానికి వాళ్ల జీవితం ఇలాగే సాగితే మనం చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ ఓ రాత్రి జ్యోతిక తన కూతురు వైభవిని పక్కన కూర్చోబెట్టుకుని పంచుకున్న జ్ఞాపకాలు కొన్ని ఆ ఇద్దరి జీవితాన్నే మార్చేశాయి.
ఏమిటా జ్ఞాపకం..? అది 1984. నాటి బొంబాయిలోనే పాఠశాల విద్యార్థినుల కోసం పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు జరగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కాదు ఉత్తరాదిలోనే అమ్మాయిల తొలి పవర్‌లిఫ్టింగ్‌ జట్టు అదే. అందులో జ్యోతిక కూడా ఒకరు. ముంబయిలోని చెంబూరు హైస్కూల్‌ బాలికగా ఆ పోటీల్లో తనదైన ప్రతిభ చూపిందామె. ఆ తర్వాత జరిగిన పోటీలన్నింటా ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ఆ విజయపరంపర ఎంతోకాలం సాగలేదు. పేదరికం కారణంగా మొదట క్రీడల్నీ, ఆ తర్వాత చదువుకీ దూరమైంది. 1990లో పెళ్లి చేసుకుని గోరెగావ్‌ వచ్చేసింది. ఇవన్నీ వైభవితో పంచుకుంది జ్యోతిక. ‘ఆరోజుల్లో మా బడిలో మధుకర్‌ ధరేకర్‌ అనే పీఈటీ మాస్టారు ఉండేవారు. ఆయనంటే నాకెంత హడలో! కానీ ఆయన లేకుంటే నేను ఈ పోటీలోకే వచ్చి ఉండేదాన్ని కాను!.’ అని తన జ్ఞాపకాలకి చుక్కపెట్టింది. కళ్లు విప్పార్చి వింటూ ఉన్న వైభవి ‘నాకూ పవర్‌లిఫ్టింగ్‌ నేర్పకూడదూ..!’ అని అడిగింది. మొదట జ్యోతిక ఒప్పుకోలేదు. ‘మనం రోజంతా శ్రమిస్తే కానీ పూటగడవదు. ఈ ఆటలో ఏవైనా గాయాలైతే బతకడం కష్టం!’ అంది. వైభవి పట్టువీడలేదు. చివరికి జ్యోతిక సరేనంది. కానీ తండ్రి అడ్డుచెప్పాడు. ఈసారి ఆ ఇద్దరూ కలిసి ఆయన్ని ఒప్పించారు!
రాత్రుల్లో శిక్షణ.. ఐదునెలల కిందట.. ఓ రాత్రి. తల్లీకూతుళ్లిద్దరూ స్థానిక వ్యాయామ కేంద్రానికి వెళ్లారు. పగలైతే అందరూ వస్తారుకాబట్టి.. వీళ్లు సాధనకు రేయినే ఎంచుకున్నారు. దాదాపు ముప్పై ఏళ్ల కిందట తన పీఈటీ మాస్టారు నేర్పించిన అవే పవర్‌లిఫ్టింగ్‌ మెలకువలని కూతురికి చెప్పించడం మొదలుపెట్టింది జ్యోతిక. వైభవి చకచకా నేర్చుకుంది. స్క్వాట్‌, బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌ అన్నింటా పట్టుసాధించింది. నవంబర్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో 180 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. ముంబయి డివిజన్‌ స్థాయిలోనూ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాతి నెలే రాష్ట్రస్థాయిలో జరిగిన జల్‌గావ్‌ పోటీల్లో నాలుగోస్థానం అందుకుంది. కానీ ఇందులో విశేషమేమిటంటే అదే చోట జరిగిన ఓపెన్‌ కేటగిరీ పోటీల్లో ఆమె తల్లి జ్యోతిక కూడా పాల్గొనడం. అంతేకాదు అందులో బంగారు పతకం అందుకోవడం! ‘ముప్పైఏళ్ల తర్వాత అమ్మ మళ్లీ ఈ క్రీడలో తలపడటం.. పతకం అందుకోవడం చూస్తే అది నేనే సాధించినట్టుంది!’ అంటోంది వైభవి. ఈ ఇద్దర్నీ ఇప్పుడు ‘దంగల్‌ జట్టు’ అంటున్నారు మహారాష్ట్రలో. జ్యోతిక తన కూతుర్నే కాదు.. ఆ ప్రాంతంలోని ఆడపిల్లలందరికీ శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక పాఠశాల ఏర్పాటుచేస్తానని చెబుతోంది. ఆ కల సాకారానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా భార్య జరీనా నడుపుతున్న స్వదేశ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్