నాన్న స్ఫూర్తితో నేవీ ఆఫీసర్‌ అయింది!

నలుగురిలా కాకుండా నలుగురిలో ‘ఒక్క’రిలా ఉండాలనుకుంటారు కొంతమంది. తమిళనాడుకు చెందిన ఆర్‌.మీరా కూడా అలాంటి అమ్మాయే! తండ్రి వృత్తి రీత్యా చిన్నతనం నుంచి సైనిక వాతావరణంలో పెరిగిన ఆమె.. తానూ పెద్దయ్యాక త్రివిధ దళాల్లోకి....

Updated : 04 Jun 2022 17:12 IST

నలుగురిలా కాకుండా నలుగురిలో ‘ఒక్క’రిలా ఉండాలనుకుంటారు కొంతమంది. తమిళనాడుకు చెందిన ఆర్‌.మీరా కూడా అలాంటి అమ్మాయే! తండ్రి వృత్తి రీత్యా చిన్నతనం నుంచి సైనిక వాతావరణంలో పెరిగిన ఆమె.. తానూ పెద్దయ్యాక త్రివిధ దళాల్లోకి అడుగుపెట్టాలనుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అదే దిశగా అడుగులు వేసింది. భారత నావికా దళానికి ఎంపికై తన కలను నెరవేర్చుకుంది. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె.. భారత నావికా దళంలో సబ్‌ లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరనుంది. తద్వారా తమిళనాడులోని బడగా తెగకు చెందిన ఆమె.. ఈ తెగ నుంచి నేవీ ఆఫీసర్‌గా ఎంపికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ‘సాయుధ దళాల్లో పనిచేయడమే ఓ గొప్ప గౌరవం’ అంటోన్న మీరా నేవీ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి..

బడగా తెగ.. తమిళనాడులోని నీలగిరీస్‌ జిల్లాలో ఉన్న అతిపెద్ద తెగ ఇది. ఈ తెగకు చెందిన అమ్మాయే ఆర్‌. మీరా. ఈ తెగ విస్తరించి ఉన్న అచనకల్‌ గ్రామంలో పుట్టి పెరిగిందామె. నిజానికి ఇది వెనకబడిన ప్రాంతమే అయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొంతమంది అమ్మాయిలు తమ కలల్ని నెరవేర్చుకుంటున్నారు. మీరా కూడా అదే చేసింది.

ఆ వాతావరణ ప్రభావమే..!

మీరా తండ్రి రవీంద్రనాథ్‌ ఆర్మీ ఆస్పత్రిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే తండ్రి ఉద్యోగ బదిలీల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగిందామె. నీలగిరి జిల్లాలోని అరువంకాడు కేంద్రీయ విద్యాలయంలో చేరిన ఆమె.. పుణే, దిల్లీ, జమ్మూలోని పాఠశాలల్లో చదివింది. ఆపై కోయంబత్తూరులోని హిందుస్థాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ పూర్తి చేసింది. పెద్దయ్యే క్రమంలో ఆర్మీ వాతావరణంలో పెరగడం, తండ్రి కూడా అందులోనే విధులు నిర్వర్తించడంతో.. తానూ త్రివిధ దళాల్లో చేరాలని సంక్పలించుకుంది మీరా. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచి.. భారత నావికా దళంలో చేరే అరుదైన అవకాశం అందుకుందామె.

అవకాశాలు అందిపుచ్చుకోవాలి!

కేరళ ఎజిమాలాలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఇటీవలే ఆరు నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకుంది మీరా. దీంతో సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాలో త్వరలోనే ఉద్యోగంలో చేరనుందామె. తద్వారా బడగా తెగ నుంచి భారత నావికా దళంలో ఆఫీసర్‌గా ఎంపికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిందీ తమిళమ్మాయి. ఈ విజయంతో ఆమె పేరెంట్సే కాదు.. బడగా తెగ ప్రజలూ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం, ఆర్మీ వాతావరణంలో పెరగడం వల్లే త్వరగా లక్ష్యాన్ని చేరుకోగలిగానంటోంది మీరా.
‘నాన్న ఉద్యోగ రీత్యా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తిరిగాను. ఈ క్రమంలో హిందీ భాష ఒంటబట్టింది. ఇక ఆర్మీ వాతావరణంలో గడపడం వల్ల త్రివిధ దళాల్లో చేరతానన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలా నా కలకు అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా తోడైంది. సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేసే అవకాశం రావడం గొప్ప గౌరవం. ప్రస్తుతం ఈ రంగంలోనూ మహిళలకు బోలెడన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కావాల్సిందల్లా.. ఏదైనా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగల ధైర్యం. వీటితో పాటు పట్టుదల ఉంటే సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం..’ అంటోంది మీరా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని