ఈ ఎస్ఐ మేడమ్‌ది ఎంత మంచి మనసో!

రెహానా షేక్‌.. ముంబయిలో ఓ సాధారణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఒకసారి తన కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిఠాయిలు పంచడానికి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కాళ్లకు చెప్పుల్లేని ఎందరో పేద విద్యార్థులు ఆమె కంటపడ్డారు. వారి దీనస్థితి చూసి చలించిపోయిన ఆ పోలీసమ్మ వెంటనే తన ముద్దుల తనయ పుట్టినరోజు వేడుకలు, ఈద్‌ షాపింగ్‌ను రద్దు చేసుకున్నారు.

Published : 12 Jun 2021 17:58 IST

Image for Representation

రెహానా షేక్‌.. ముంబయిలో ఓ సాధారణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఒకసారి తన కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిఠాయిలు పంచడానికి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కాళ్లకు చెప్పుల్లేని ఎందరో పేద విద్యార్థులు ఆమె కంటపడ్డారు. వారి దీనస్థితి చూసి చలించిపోయిన ఆ పోలీసమ్మ వెంటనే తన ముద్దుల తనయ పుట్టినరోజు వేడుకలు, ఈద్‌ షాపింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఆ డబ్బునంతా విద్యార్థుల సంక్షేమానికి విరాళంగా అందించారు. అప్పటికప్పుడు 50 మంది పేద విద్యార్థుల బాధ్యతలు తన భుజాలకెత్తుకున్నారు. వారి పదో తరగతి పూర్తయ్యే వరకు విద్య, వసతి.. ఇతర సదుపాయాలన్నీ సమకూర్చేందుకు ముందుకొచ్చారు.
వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేస్తూ..!
సాధారణంగా పోలీస్‌ శాఖలో పనిచేసే మహిళలకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వేళాపాళా లేని విధులు, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటే వారికి కత్తి మీద సామే. ఈ క్రమంలో ఇటు గృహిణిగా ఇంటి బాధ్యతలు, అటు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రజా రక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే పలు సహాయక కార్యక్రమాల్లో సైతం భాగమవుతున్నారు 40 ఏళ్ల రెహానా. 2000లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె మంచి వాలీబాల్‌ ప్లేయర్‌ కూడా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని పతకాలు కూడా సాధించారు.


వారి దీనస్థితికి చలించి!
రెహానా తండ్రి ముంబయిలోనే ఎస్‌ఐగా పనిచేసి  ఉద్యోగ విరమణ పొందారు. ఆమె భర్త కూడా పోలీస్‌ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది రాయ్‌గఢ్‌ జిల్లా వాజే తాలూకాలోని ఓ పాఠశాలను సందర్శించారు రెహానా. తన కూతురు పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేద్దామని అక్కడికి వెళ్లిన ఆమె... కాళ్లకు చెప్పులు కూడా లేని విద్యార్థుల దీనస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసి ఆ ఖర్చునంతా విద్యార్థుల సంక్షేమానికి విరాళంగా అందించారు. అదేవిధంగా ఈద్‌ షాపింగ్‌ కోసం దాచిన సొమ్మును కూడా ప్రిన్సిపాల్‌కి అందజేసి విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేయమని కోరారు.


50 మంది విద్యార్థుల బాగోగులు!
అదే సమయంలో ఆ పాఠశాలలో చదువుకుంటున్న 50 మంది పేద విద్యార్థుల బాధ్యతలను భుజాలకెత్తుకున్నారామె. పదోతరగతి పూర్తయ్యే దాకా వారికి విద్య, వసతి, భోజన సదుపాయాలన్నీ సమకూర్చేందుకు ముందుకొచ్చారు. ఇక కరోనా సమయంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు రెహానా. తన సహోద్యోగులు, ఇతరులతో కలిసి ఓ వాట్సప్‌ గ్రూపును ఏర్పాటుచేసి అవసరమైన వారికి పడకలు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ప్లాస్మా, రక్తం.. అందజేస్తున్నారు. ఒక్క ముంబయిలోనే కాదు.. పుణే, సతారా, నాసిక్‌, నాగ్‌పూర్‌ నగరాల్లోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్న రెహానా... ఇప్పటివరకు 54 మంది కరోనా బాధితులకు ఆపన్నహస్తం అందించారు.
సేవకు సత్కారం!
రెహానా, ఆమె సేవా గుణంపై స్థానిక మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఇటీవల ముంబయి పోలీస్‌ కమిషనర్ ఆమెను ఘనంగా సత్కరించారు. తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందించారు. అంతకుముందు డిప్యూటీ కమిషనర్‌ కూడా ఓ ప్రత్యేక సభను ఏర్పాటుచేసి రెహానా సేవలను గుర్తు చేశారు. ఇక ఆమె భర్త, సహోద్యోగులైతే ఆమెను ‘మదర్ థెరిసా’ అని ప్రేమగా పిలుచుకోవడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్