Updated : 09/11/2021 17:30 IST

అరోమా థెరపీతో.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ..

(Photo: Instagram)

తండ్రి కోరిక మేరకు కంప్యూటర్ చదువులు అభ్యసించింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడాలనుకున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెట్టింది. అప్పుడే అక్కడి మామిడి, చామంతి, గులాబీ, మల్లె తోటలను చూసింది. వాటి ప్రయోజనాలేంటో క్షుణ్ణంగా తెలుసుకుంది. క్రమంగా అరోమా థెరపీపై ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు వెళ్లి ప్రాక్టిషనర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఆపై ఇండియాకు తిరిగొచ్చి క్లినిక్‌ను ప్రారంభించింది. తద్వారా దేశంలోనే తొలిసారిగా అరోమా థెరపీ క్లినిక్‌ సెంటర్‌ను నెలకొల్పిన మహిళగా గుర్తింపు పొందింది. ఆమే రూపల్ షబ్నం త్యాగి. తన విజయ ప్రస్థానం గురించి తనేమంటోందో విందాం రండి..

పెళ్లితో అనుకోని మలుపు!

‘నేను చిన్నప్పుడు పార్శీ స్కూల్‌లోనే ఎక్కువగా చదువుకున్నాను. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజెస్ అంటే బాగా ఆసక్తి. దీనికి తోడు మా నాన్న కూడా నన్ను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా చూడాలనుకున్నారు. అయితే పెళ్లి తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. నా భర్త యూపీలోని బిజ్నూర్‌ రాజ కుటుంబానికి చెందిన వారు. వారికున్న 500 ఎకరాల భూమిలో మామిడి, చామంతి, గులాబీ, మల్లె, నారింజ మొదలైన వాటిని సాగుచేసేవారు. పెళ్లయ్యాక క్రమం తప్పకుండా నేను ఆ తోటలను సందర్శించేదాన్ని.

ఇక గర్భం ధరించినప్పుడు కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాను. అప్పుడు మా అమ్మమ్మ నాకు స్నానం చేయించే ముందు బాత్‌ టబ్‌లో మత్తా లేదా మజ్జిగ, గులాబీ, చామంతి రేకులు, మల్లె మొగ్గలు, నారింజ తొక్కలతో పాటు కొన్ని రకాల ఎసెన్షియల్‌ నూనెలు కలిపేది. అప్పుడే సహజ నూనెలు, మూలికలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకున్నాను. మరింత సమాచారం కోసం పుస్తకాలు, జర్నల్స్‌ చదివి అరోమా థెరపీపై ఆసక్తి పెంచుకున్నాను. ఆ తర్వాత లండన్‌కు వెళ్లిపోయాను. అక్కడే అరోమా థెరపీ ప్రాక్టిషనర్‌ కోర్సు పూర్తి చేశాను. ఇండియాకు తిరిగొచ్చి న్యూదిల్లీ వేదికగా ‘Wika’ అరోమా క్లినిక్‌ను ప్రారంభించాను’..

ఆ సమస్యలకు పరిష్కారం!

అరోమా థెరపీ ద్వారా పీఎంఎస్, ఆర్థ్రైటిస్, మైగ్రెయిన్ వంటి వాటితో పాటు  కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, క్రీడల వల్ల అయ్యే గాయాలు.. మొదలైనవాటికి పరిష్కారం చూపించచ్చు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులు ఏదో ఒక రకంగా మనపై దుష్ర్పభావం చూపుతున్నాయి. అయితే అరోమా థెరపీలో ఉపయోగించే నూనెలు, మూలికలతో ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

ఉదాహరణకు కడుపు నొప్పి తగ్గేందుకు పుదీనా-రోజ్‌మేరీ ఆయిల్‌ను, కండరాల నొప్పుల నివారణకు లావెండర్‌ - చామోమైల్‌ నూనెను అందిస్తాం. ఇవి సహజ సిద్ధంగా తయారుచేసిన నూనెలు కావడంతో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. పైగా వీటిని వాడడం వల్ల మెదడు, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. అదేవిధంగా లవంగాలు, దాల్చిన చెక్క కాంబినేషన్‌లో తయారుచేసిన జాస్మిన్‌ సాంబక్‌ ఆయిల్‌తో నిద్ర బాగా పడుతుంది. చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది.

అరోమా థెరపీకి సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేను ఎక్కువగా ఫ్రాన్స్, జర్మనీ, మొరాకో, దుబాయి తదితర దేశాలకు వెళుతుంటాను. అక్కడి నుంచే అరోమా థెరపీకి అవసరమయ్యే నూనెలు, మూలికలు, బ్యూటీ ఉత్పత్తులు, పెర్‌ఫ్యూమ్స్‌ను దిగుమతి చేసుకుంటాం’ అని చెప్పుకొచ్చింది రూపల్.

ఈ క్రమంలో- భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సహకారంతో చర్మానికి హాని కలిగించని ఒక కొత్తరకం శానిటైజర్‌ను తయారుచేయడానికి రూపల్ ముందుకు రావడం గమనార్హం. 'ఇందులో ఉపయోగించే వివిధ రకాల ఎసెన్షియల్ నూనెలు చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. పైగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా సువాసనలు కూడా వెదజల్లుతాయి’.. అని చెబుతోంది రూపల్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని