‘జల’ దేవతగా భావించి గెలిపించారు!

ఎన్నికల ప్రచారంలో హామీలివ్వడం.. గెలిచాక వాటి గురించి మర్చిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే! అయితే చదువుకున్న యువత రాజకీయాల్లోకొస్తే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందంటోంది ఆర్‌ షారుకళ. తమిళనాడులోని స్థానిక ఎన్నికల్లో అతి పిన్న పంచాయతీ ప్రెసిడెంట్‌గా తాజాగా గెలుపొందిందీ 23 ఏళ్ల అమ్మాయి.

Updated : 20 Oct 2021 17:26 IST

(Image for Representation)

ఎన్నికల ప్రచారంలో హామీలివ్వడం.. గెలిచాక వాటి గురించి మర్చిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే! అయితే చదువుకున్న యువత రాజకీయాల్లోకొస్తే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందంటోంది ఆర్‌ షారుకళ. తమిళనాడులోని స్థానిక ఎన్నికల్లో అతి పిన్న పంచాయతీ ప్రెసిడెంట్‌గా తాజాగా గెలుపొందిందీ 23 ఏళ్ల అమ్మాయి. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు నాయకురాలిగా తన పంచాయతీ ప్రజల వెతల్ని తీర్చుతానని ప్రతిజ్ఞ చేసిన షారు విజయగాథ ఇది!

పరిపాలనా సౌలభ్యం కోసం తమిళనాడులో ఇటీవలే 9 కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది అక్కడి ప్రభుత్వం. వీటిలో టెంకాశీ ఒకటి. ఈ జిల్లాలోని వెంగడంపట్టి పంచాయతీకి ఇటీవలే అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అక్కడి లక్ష్మీయుర్‌ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఆర్‌ షారుకళ పోటీ చేసింది. నిజానికి ఆమెకు గతంలో ఎన్నికలు, రాజకీయాలతో అనుబంధం లేదు. అయితే ఈ ఎన్నికల్లో నిలబడడానికి తన గ్రామం ఎదుర్కొంటోన్న వెతలే కారణమంటోంది షారుకళ.

ఆ కష్టాలు తీర్చాలని..!

ప్రస్తుతం కోయంబత్తూర్‌లోని ‘హిందుస్థాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ’లో మాస్టర్స్‌ చదువుతోంది షారుకళ. ఆమె తండ్రి రైతు. తల్లి టీచర్‌గా పనిచేస్తోంది. తనకో తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే తన గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో నీటి సంక్షోభం ఎక్కువ. వానలు పడితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటాయి అక్కడి పరిస్థితులు. ఇలా ప్రజలు పడే తిప్పలు చూడలేక.. తన సొంత డబ్బుతో రెండేళ్ల పాటు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా అక్కడి వారికి నీరందించారు షారు తండ్రి. ఇక ఈ నీటి సంక్షోభాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చిన్నతనం నుంచీ ఇలా తన గ్రామం పడుతోన్న నీటి అవస్థల్ని గమనించిన షారు.. ఎలాగైనా ఈ సమస్యను తీర్చాలనుకుంది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం సెలవుల రీత్యా ఇంటికి చేరుకున్న ఆమె.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసింది. అయితే తన నిర్ణయం తన పేరెంట్స్‌కి చెప్తే తొలుత ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత పూర్తి మద్దతిచ్చారని అంటోందీ అమ్మాయి.

సరదాగా అంటున్నానేమో అనుకున్నారు!

‘పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అమ్మానాన్నలతో చెప్పినప్పుడు సరదాకు అలా అంటున్నానేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిజం తెలుసుకొని పూర్తి మద్దతిచ్చారు. ప్రచారంలో ప్రజలు కూడా నా వెంటే నిలబడ్డారు. నన్ను వాళ్ల సొంత కూతురిగా భావించి నాకు ఓటేశారు. నన్ను గెలిపించారు. ప్రచారంలో ఏ హామీలైతే నేను వారి ముందుంచానో వాటిని నెరవేర్చడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. అయితే అన్నింటికంటే ముందు మా గ్రామంలో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడం. ఇదే విషయమై ఎన్నోసార్లు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఫలితం లేదు. వాళ్ల వల్ల కాని పని ఇప్పుడు నేను సాధించి చూపిస్తా..’ అంటోందీ యంగ్‌ పంచాయతీ ప్రెసిడెంట్.

<

ఇంటింటికీ నీళ్లిప్పిస్తా!

పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఇప్పుడు తనపై చాలా బాధ్యతలున్నాయని.. అయితే అన్నింటికంటే నీళ్ల సమస్యను తీర్చడానికే మొదటి ప్రాధాన్యమిస్తానంటోంది షారు. ‘పంచాయతీ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం నా ముందు చాలానే బాధ్యతలున్నాయి. అయితే ప్రస్తుతం ఇంటింటికీ నీళ్లిప్పించడం పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా. అలాగే మా గ్రామంలో క్రీడలపై ఆసక్తి కనబరిచే యువతీయువకులు చాలామందే ఉన్నారు. సరైన సదుపాయాల్లేక వారి ప్రతిభ బయటి ప్రపంచానికి తెలియట్లేదు. అలాంటి వారికోసం ఆటస్థలం ఏర్పాటుచేయడం, వారు జిల్లా స్థాయిలో పోటీ పడేలా సకల సదుపాయాలు సమకూర్చడం.. వంటివి చేయాలనుకుంటున్నా. అలాగే గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం.. వంటివి కూడా నా ప్రాధాన్యాల్లో ఉన్నాయి..’ అంటూ తన ఒక్కో లక్ష్యం గురించి వివరించిందీ యంగ్‌ పొలిటీషియన్.

ఇళ్లు మునిగిపోకుండా..

పంచాయతీ అధ్యక్షురాలిగా తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని సమస్యల్ని తీర్చడం తన బాధ్యత. ఈ క్రమంలోనే ముంపు గ్రామమైన ముతమాల్పురం వరద సమస్యను తీర్చడానికి తానేం చేయబోతోందో కూడా ఈ సందర్భంగా వివరించింది షారుకళ. ‘మా పంచాయతీలోనే ముతమాల్పురం అనే గ్రామం ఉంది. చిన్నపాటి వర్షానికే ఇక్కడి ఇళ్లు నీట మునుగుతాయి. ఈ సమస్యను తీర్చడానికి నేను త్వరలోనే పైఅధికారుల్ని కలుస్తాను. పరిష్కారం కోసం ప్రయత్నిస్తా.. అంతేకాదు.. ఇక్కడ సరైన రవాణా సదుపాయాలు కూడా లేవు. వాటిపైనా దృష్టి సారిస్తా..’ అంటోందీ యువ రాజకీయ నాయకురాలు. విద్యావంతులు, యుక్తవయసులో ఉన్న వారు రాజకీయాల్లోకొస్తే.. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతోందీ యంగ్‌ ప్రెసిడెంట్‌. గతంలో షారు తండ్రి రవి కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు.. అప్పుడు ఆయన గెలవకపోయినా.. ప్రస్తుతం కూతురి గెలుపును మనసారా ఆస్వాదిస్తున్నారాయన.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్