అలా 78 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా మారింది!

‘కలలు, ఆసక్తులు సాకారం చేసుకునేందుకు వయసుతో సంబంధం లేదు’ అని నిరూపిస్తూ ఇటీవల ఎందరో మహిళలు తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మలి వయసులోనూ తమ సృజనాత్మకతను చాటుకుంటూ మన్ననలు అందుకుంటున్నారు.

Published : 26 Oct 2021 19:20 IST

(Photo: Instagram)

‘కలలు, ఆసక్తులు సాకారం చేసుకునేందుకు వయసుతో సంబంధం లేదు’ అని నిరూపిస్తూ ఇటీవల ఎందరో మహిళలు తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మలి వయసులోనూ తమ సృజనాత్మకతను చాటుకుంటూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతారు 78 ఏళ్ల షీలా బజాజ్‌. చిన్నప్పుడు తన మనవరాలి కోసం సరదాగా స్కార్ఫులు, స్వెటర్లు అల్లిన ఈ బామ్మ... ఇప్పుడు అదే నైపుణ్యం, అదే మనవరాలి సహకారంతో వ్యాపారవేత్తగా మారిపోయింది.

78 ఏళ్ల వయసులో ‘స్మార్ట్’గా!

ఏడు పదుల వయసు దాటిందంటే కొందరికి శరీరం ఏ మాత్రం సహకరించదు. కొందరికి చేతులు, కాళ్లు కూడా వణుకుతుంటాయి. అయితే దిల్లీకి చెందిన షీలా మాత్రం వీరికి భిన్నం. 78 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. చిన్నపిల్లలకు అవసరమైన దుస్తులు, స్వెటర్లు, సాక్సులు, గ్లోవ్స్‌లు, స్కార్ఫ్‌లు అల్లుతున్నారు. ‘CaughtCraftHanded’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ‘స్మార్ట్‌’ గా వాటిని విక్రయిస్తూ తగిన ఆదాయం ఆర్జిస్తున్నారు.

మనవరాలికి అన్నీ తానై!

ఏడు పదుల వయసున్న షీలా బజాజ్‌ జీవితం గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. పున్నామ నరకం తప్పిస్తాడనుకున్న కుమారుడు కొన్నేళ్ల క్రితం హఠాత్తుగా కన్ను మూశాడు. అప్పటి నుంచి తన మనవరాలి (యుక్తి బజాజ్) రూపంలోనే తన కొడుకును చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తూ గతేడాది కోడలు కూడా అనారోగ్యంతో మరణించింది. ఈ క్రమంలో పిన్న వయసులోనే తల్లిదండ్రుల అనురాగానికి దూరమైన తన మనవరాలికి ఆ లోటు తెలియనీయకుండా పెంచారు షీలా. అన్నీ తానై వ్యవహరించారు.

ఒంటరిగా మిగిలిపోయారు!

యుక్తి తనతో ఉన్నన్ని రోజులు ఎంతో ధైర్యంగా ఉన్నారు షీలా. అయితే ఎప్పుడైతే ‘లాంగ్వేజ్‌ ఎక్స్‌పర్ట్‌’ గా ఓ సంస్థలో తన మనవరాలికి ఉద్యోగం వచ్చిందో అప్పటి నుంచి ఆమె ఒంటరిగా మిగిలిపోయారు. మలి వయసులో ఏం చేయాలో తోచలేదు. అయితే కరోనా కారణంగా యుక్తి మళ్లీ నానమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచే పని చేయడం ప్రారంభించింది. అప్పుడే ఆమెలోని ఒంటరితనాన్ని గుర్తించిన యుక్తి...తనను ఏదైనా పనిలో నిమగ్నం చేయాలనుకుంది. అప్పుడే తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.

సృజనాత్మకతను జోడించి!

‘నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నానమ్మ నా కోసం స్వయంగా తన చేతులతో స్వెటర్లు, స్కార్ఫ్‌లు అల్లేది. లాక్‌డౌన్‌లో ఇంటికొచ్చినప్పుడు మళ్లీ వాటిని తయారుచేయమని ఆమెను అడిగాను. దీంతో ఊలుతో చిన్నపిల్లల దుస్తులు, స్కార్ఫ్‌లు అల్లడం ప్రారంభించింది. అదేవిధంగా చలికాలంలో పిల్లల చేతులు, పాదాలకు తొడిగే గ్లోవ్స్‌, సాక్స్‌లను కూడా అల్లింది. ఆ తర్వాత ‘CaughtCraftHanded’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని క్రియేట్‌ చేసి అందులో వాటి ఫొటోలను అప్‌లోడ్‌ చేశాను. ప్రారంభంలో ఎవరూ స్పందించలేదు. అయితే నానమ్మ వెనక్కు తగ్గలేదు. తనకు తెలిసిన విద్యకు మరింత సృజనాత్మకతను జోడించింది. ఆకట్టుకునే దిండు కవర్లు, కుషన్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లు, మగ్‌ వార్మర్లు, హెడ్‌ బ్యాండ్స్‌, చెవిరింగులు, బ్యాగ్‌లను వివిధ రంగుల్లో రూపొందించింది. వీటికి ఊహించని స్పందన రావడంతో ఇక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది’..

ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది!

‘మేం గతేడాది ‘CaughtCraftHanded’ పేజీని ప్రారంభించాం. ప్రారంభంలో నెలకు 8-10 ఆర్డర్లు వచ్చేవి. అయితే క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నెలకు 20కు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంటోంది. విక్రయాలు, ఆదాయాల సంగతెలా ఉన్నా నానమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంటోంది. విశ్రాంతి తీసుకునే వయసులో ఒక వ్యాపకం కల్పించుకుని సంపాదిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందంటోంది. రోజూ పొద్దున లేవగానే ఇంటి పనులన్నీ పూర్తి చేస్తోంది. ఆ తర్వాత అల్లికల పనుల్లో మునిగిపోతోంది. ఎక్కడా ‘ఒంటరి’ అన్న భావన ఆమెలో కనిపించడం లేదు. నానమ్మను అలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా త్వరగా పని ముగించుకుని నానమ్మతో ఎక్కువ సమయం గడిపేందుకు ట్రై చేస్తున్నాను. తన పనుల్లో పాలుపంచుకుంటున్నాను’ అని అంటోంది యుక్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్