అందుకే వీళ్ల ఆభరణాలంటే సెలబ్రిటీలకూ ‘క్రష్’!

ఎన్ని ఆభరణాలు ఉన్నా వాటిని అల్మరాకే పరిమితం చేస్తుంటారు చాలామంది. ఏదైనా పెద్ద అకేషన్‌ అయితే తప్ప బయటికి తీయరు. కారణం.. అవీ భారీగానే ఉండడం..! దీంతో నిత్యం ఉద్యోగాలకు వెళ్లే వారు సింపుల్‌గా ఉండే చెయిన్.....

Published : 12 Jun 2022 14:12 IST

(Photo: caratcrush.com)

ఎన్ని ఆభరణాలు ఉన్నా వాటిని అల్మరాకే పరిమితం చేస్తుంటారు చాలామంది. ఏదైనా పెద్ద అకేషన్‌ అయితే తప్ప బయటికి తీయరు. కారణం.. అవీ భారీగానే ఉండడం..! దీంతో నిత్యం ఉద్యోగాలకు వెళ్లే వారు సింపుల్‌గా ఉండే చెయిన్, ఇమిటేషన్ జ్యుయలరీ.. వంటివి ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది వీటితో సంతృప్తి చెందరు. రోజువారీ ధరించేవి కూడా బంగారంతో చేసిన స్టైలిష్‌ జ్యుయలరీ అయితే బాగుండనుకుంటారు. అలాంటి వారి నాడిని పట్టుకున్నారు ముంబయికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు. ఉద్యోగినులే లక్ష్యంగా, వారి మనసు దోచుకునేలా విభిన్న బంగారు ఆభరణాలు రూపొందిస్తున్నారు. అవి కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల్నీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మరి, ఇంతకీ ఆ అక్కచెల్లెళ్లు ఎవరో, వాళ్ల ఆభరణాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి..

ఆంచల్‌, అర్పన్‌.. ముంబయికి చెందిన ఈ సోదరీమణులకు వ్యాపార రంగంలో స్థిరపడాలన్న ఆలోచన ముందు నుంచే ఉంది. ఈ క్రమంలోనే తమ చదువును కొనసాగించారు. ఆంచల్‌- యూకేలోని ఆస్టన్‌ యూనివర్సిటీ నుంచి ‘అంతర్జాతీయ వ్యాపారం’లో మాస్టర్స్ పూర్తి చేయగా.. అర్పన్‌- లండన్‌లోని రెజెంట్స్‌ యూనివర్సిటీ నుంచి ‘లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగంలో పీజీ చదివింది. ఆపై ఇద్దరూ కలిసి ముంబయిలోని ఓ ప్రముఖ జ్యుయలరీ సంస్థలో మార్కెటింగ్‌-పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగంలో కొన్ని నెలల పాటు పనిచేశారు.

ఉద్యోగినులే లక్ష్యంగా..!

లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు.. విజయం సాధించడానికి పెద్ద సమయం పట్టదంటారు. ఆంచల్, అర్పన్‌ విషయంలో ఇది నిరూపితమైంది. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాక.. తాము పని చేసే సంస్థకు అనుబంధంగా 2015లో ‘క్యారట్‌ క్రష్‌’ పేరుతో సొంతంగా జ్యుయలరీ విభాగం ప్రారంభించారు. ఈ క్రమంలో రోజువారీ ఉద్యోగం చేసే మహిళల్నే లక్ష్యంగా ఎంచుకున్నారు. వారి కోసం ట్రెండీగా బంగారు ఆభరణాలు రూపొందించడమే ఈ బ్రాండ్‌ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా వజ్రాలు పొదిగిన లేయర్డ్‌ చెయిన్స్‌, లాకెట్స్‌, ఉంగరాలు, బ్రేస్‌లెట్స్‌, మంగళసూత్రాలు, చెవిదిద్దులు.. వంటివన్నీ విభిన్న డిజైన్లలో తయారుచేస్తున్నారు. అంతేకాదు.. వినియోగదారుల కోరిక మేరకు కస్టమైజ్డ్ డిజైన్లలో కూడా ఆభరణాలు తయారుచేస్తున్నారీ అక్కచెల్లెళ్లు.

సెలబ్రిటీలూ ఫిదా!

వీళ్ల జ్యుయలరీ డిజైన్లలో లేయర్డ్‌ చెయిన్స్ ప్రత్యేక ఆదరణ పొందడం గమనార్హం. ఇందుకు వీటిలో ఉండే వందలాది వెరైటీలే కారణం! అందుకే ఇవి ప్రియాంక చోప్రా, సోనమ్‌ కపూర్‌, దీపికా పదుకొణె, ఆలియా భట్‌, అనన్యా పాండే, భూమీ పెడ్నేకర్‌, సారా అలీ ఖాన్‌.. వంటి ఎందరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. ఆయా వేడుకల కోసం వీటిని ఎంచుకుంటూ మెరిసిపోతున్నారీ అందాల తారలు.

‘వ్యాపారం ప్రారంభించిన మొదట్లో నిలదొక్కుకోగలమా? అన్న సందిగ్ధత ఉండేది. కానీ మా డిజైన్లకు వచ్చే ఆదరణ చూశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. మా జ్యుయలరీ డిజైన్లు సెలబ్రిటీలకూ నచ్చడంతో తిరుగులేకుండా ముందుకు సాగుతున్నాం. ఈ వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉద్యోగినులకు హుందా లుక్‌ని అందిస్తాయి..’ అంటూ తమ వ్యాపారం గురించి చెబుతున్నారీ సిస్టర్స్.

ప్రస్తుతం బాంద్రా, దిల్లీ.. నగరాల్లో స్టోర్లను నిర్వహిస్తోన్న ఆంచల్‌, అర్పన్.. ఆన్‌లైన్ వేదికగానూ తమ జ్యుయలరీని విక్రయిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్