మనం సంస్కృతం చదవడమేంటంటే.. 5 స్వర్ణాలు సాధించింది!

సాధారణంగా కుటుంబ పెద్దను కోల్పోతే కూతుళ్లను చదువు మాన్పించి పెళ్లి చేయడం, కొడుకుల్ని పైచదువులు చదివించడం.. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం. అయితే లక్నో అమ్మాయి గజాలా కుటుంబం ఇందుకు భిన్నం. పదో తరగతిలో ఉండగానే తండ్రిని కోల్పోయిన ఆమెను చదివించడానికి ఆమె ఇద్దరు అన్నయ్యలు, అక్క చదువు మానేసి పనిలో చేరారు.

Published : 12 Feb 2022 18:57 IST

(Photo: Instagram)

సాధారణంగా కుటుంబ పెద్దను కోల్పోతే కూతుళ్లను చదువు మాన్పించి పెళ్లి చేయడం, కొడుకుల్ని పైచదువులు చదివించడం.. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం. అయితే లక్నో అమ్మాయి గజాలా కుటుంబం ఇందుకు భిన్నం. పదో తరగతిలో ఉండగానే తండ్రిని కోల్పోయిన ఆమెను చదివించడానికి ఆమె ఇద్దరు అన్నయ్యలు, అక్క చదువు మానేసి పనిలో చేరారు. చిన్న వయసు నుంచీ చదువులో మెరుగ్గా రాణించే ఆమె.. వాళ్ల శ్రమను వమ్ము చేయలేదు. ముస్లిం అయినా సంస్కృతాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకొని.. డిగ్రీ, పీజీల్లో తన అద్భుత ప్రతిభతో సత్తా చాటింది. ఇందుకు ప్రతిగా లక్నో యూనివర్సిటీ నుంచి ఐదు బంగారు పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది. వేద సాహిత్యంలో పీహెచ్‌డీ చేయడమే తన లక్ష్యమంటోన్న ఈ బ్రిలియంట్‌ గర్ల్.. తన అద్భుతమైన ప్రతిభతోనే మతం పేరుతో భాషలకు ఉన్న హద్దుల్ని చెరిపేస్తోంది.

స్కూల్లో చదువుకునే రోజుల్లో టీచర్లు బోధించే విధానాన్ని బట్టి ఆయా సబ్జెక్టులపై మక్కువ పెంచుకుంటాం. అలా తనకు ఐదో తరగతిలో సంస్కృతంపై ఇష్టం పెరిగిందంటోంది గజాలా. లక్నోలోని నిషంత్‌గంజ్లో నివసించే ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. తన మతంతో సంబంధం లేకుండా ఇంటర్‌, డిగ్రీ, పీజీల్లో సంస్కృతాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకొని అందులో బంగారు పతకాలు సాధించడం విశేషం.

మీనా టీచర్‌ పాఠాలే ఆదర్శం!

‘నాకు చిన్నప్పట్నుంచే సంస్కృతం అంటే ఇష్టం. స్కూల్లో చదివేటప్పుడు అన్నింటికంటే దీనిపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టేదాన్ని. ఇక ఐదో తరగతిలో ఉన్నప్పుడు మీనా టీచర్‌ పాఠాలు విని ముందు ముందు దీన్నే ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. పదో తరగతి దాకా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను.. ఆర్యకన్య ఇంటర్‌ కాలేజీలో చేరాను. అక్కడా సంస్కృతం సబ్జెక్టులో మంచి మార్కులు సాధించా. ఆపై కరామత్‌ హుస్సేన్‌ ముస్లిం గర్ల్స్‌ పీజీ కాలేజీలో సంస్కృతం ప్రధాన సబ్జెక్టుగా బీఏలో చేరాను. ప్రస్తుతం లక్నో యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నా. ప్రతి దశలోనూ ఈ సబ్జెక్టులో నేను సాధించిన మార్కులు, అందుకున్న పతకాలు చూసి అటు టీచర్లు, ఇటు విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేవారు.. నన్ను మరింతగా ప్రోత్సహించేవారు..’ అంటోంది గజాలా.

ఐదు బంగారు పతకాలివే!

సంస్కృతాన్ని సబ్జెక్టుగానే కాదు.. తన ప్రాణంగా భావించింది గజాలా. అందుకే కాలేజీల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సంస్కృతం శ్లోకాలు, గాయత్రీ మంత్రం, సరస్వతీ వందనం.. మొదలైనవి ఆమెతోనే చదివించేవారట అక్కడి ప్రొఫెసర్లు. అలా తన సంస్కృత నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచే ఆమె.. ప్రస్తుతం లక్నో యూనివర్సిటీలో ఎంఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే సంస్కృతం సబ్జెక్టులో తాను చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఐదు బంగారు పతకాల్ని అందుకుంది గజాలా.
* వేదాలకు సంబంధించి ఎంఏ రెండో సంవత్సరంలో (2021లో) నిర్వహించిన పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ‘శ్రీమతి చంద్రకాళి పాండే మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌’ అందుకుంది గజాలా.

* ఎంఏ (సంస్కృతం)లో ఉత్తమ పీజీ విద్యార్థినిగా నిలిచి మరో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.

* బీఏ మూడో సంవత్సరం, ఎంఏ మొదటి-రెండో సంవత్సర పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ‘గంగా దేవి మెమోరియల్ గోల్డ్‌ మెడల్‌’ సాధించిందీ బ్రిలియంట్‌ గర్ల్.

* ఎంఏ (సంస్కృతం)లో సంయుక్త ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన గజాలా ‘రాధాకృష్ణ అరుణ్‌వంశీ గోల్డ్‌ మెడల్‌’ అందుకుంది.

* ఎంఏ (సంస్కృతం)లో అత్యధిక మార్కులు సాధించిన అమ్మాయిగా ఘనత సాధించి.. ‘శ్రీమతి ఇంద్రాణీ దేవి మెమోరియల్‌ నగదు బహుమతి’ సొంతం చేసుకుంది.

ఈ పతకాలన్నీ వాళ్లకే అంకితం!

ఇలా సంస్కృతంలో తన ప్రతిభతో సాధించిన పతకాలు/మెడల్స్‌ అన్నీ తన కుటుంబానికే అంకితమిస్తున్నానంటోంది గజాలా. ‘నేను పదో తరగతి చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు. నిజానికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ సమయంలోనే నేను చదువు ఆపేయాల్సింది. కానీ అన్నయ్యల వల్ల నా చదువు నిరాటంకంగా ముందుకు సాగింది. నాకోసం వాళ్లు చదువు మానేసి గ్యారేజీలో పనికి చేరారు. అక్క సేల్స్‌ గర్ల్‌గా మారింది. ఇక ఇంటి బాగోగులు చూసుకునే బాధ్యత అమ్మపై పడింది. ఇలా నా చదువు కోసం వాళ్లు తమ జీవితాల్నే త్యాగం చేశారు. అందుకే నేను అందుకున్న ఈ బంగారు పతకాలు వాళ్లకు అంకితమిస్తున్నా. ఇప్పుడనే కాదు.. ఒక ముస్లిం అయి ఉండి సంస్కృతం, వేదాలు చదవడమేంటని కొందరు తమ మాటలతో గాయపర్చాలని చూసినా.. నా కుటుంబం మాత్రం నన్నే సపోర్ట్‌ చేసింది. ఇలా వాళ్ల ప్రోత్సాహమే నేనీ స్థాయికి చేరుకోవడానికి కారణమైంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ చదువుల తల్లి.

ఇది దేవతల భాష!

రోజూ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి నమాజ్‌ చేస్తుంటుంది గజాలా. ఆ తర్వాత ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేసి.. కాలేజ్‌కి వెళ్తుంది. తిరిగొచ్చాక సంస్కృత పఠనం యథావిధిగా కొనసాగిస్తుంటుంది. ‘రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు సంస్కృతం సబ్జెక్టు చదవనిదే నాకు నిద్ర పట్టదు. ఇది దేవతల భాష.. మనందరికీ తల్లి లాంటిది. ఇందులోని సాహిత్యం, కవిత్వంలో ఏదో తెలియని మహత్తు దాగుంది. భవిష్యత్తులో వేద సాహిత్యంలో పీహెచ్‌డీ చేసి సంస్కృతం ప్రొఫెసర్‌గా స్థిరపడదామనుకుంటున్నా. అలాగే ప్రజా సేవ చేయడం మరో లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాలను పంచుకుంది గజాలా.

మతమేదైనా మన మనసుకు నచ్చిన పని చేయడానికి, ఇష్టపడిన సబ్జెక్టును ఎంచుకోవడానికి భయపడకూడదని.. ఈ ధైర్యమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహదం చేస్తుందంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోందీ సరస్వతీ పుత్రిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్