అందుకే ఆ పదేళ్లూ మగాడి వేషంలోనే బతికా..!

విలన్లు సామాన్య ప్రజలపై దాడి చేయడం.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న కాన్సెప్ట్‌తో హీరో విలన్ల మధ్యే మారువేషంలో తిరుగుతూ తన పని తాను చేసుకుపోవడం.. ఇవన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అఫ్గానిస్థాన్‌కు చెందిన నదియా గుల్హమ్‌ దస్త్‌గిర్‌ జీవితాన్ని తరచి చూస్తే అచ్చం ఇలాంటి సినిమా కథనే తలపిస్తుంది.

Updated : 26 Aug 2021 18:10 IST

(Photo: Twitter)

విలన్లు సామాన్య ప్రజలపై దాడి చేయడం.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న కాన్సెప్ట్‌తో హీరో విలన్ల మధ్యే మారువేషంలో తిరుగుతూ తన పని తాను చేసుకుపోవడం.. ఇవన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అఫ్గానిస్థాన్‌కు చెందిన నదియా ఘులామ్ దస్త్‌గిర్‌ జీవితాన్ని తరచి చూస్తే అచ్చం ఇలాంటి సినిమా కథనే తలపిస్తుంది.

పదకొండేళ్ల ప్రాయంలో తాలిబన్ల ఆగడాలను సహించలేక కుటుంబ పోషణ కోసం మగాడిగా వేషం మార్చుకున్న ఆమె.. ఆ పదేళ్ల పాటు తాను ఆడపిల్లనన్న విషయమే మర్చిపోయానంటోంది. ఆ తర్వాత స్పెయిన్‌ వెళ్లిపోయిన ఆమె.. తన అనుభవాలను ఓ పుస్తకంలో పొందుపరిచింది. అప్పట్నుంచి విదేశంలో శరణార్థిగా ఉంటూ శరణార్థుల ఏకీకరణకు కృషి చేస్తోంది. మరోవైపు రచయిత్రిగానూ తనని తాను నిరూపించుకుంటోంది. ఇక ఇటీవలే తాలిబన్లు మళ్లీ అఫ్గాన్‌ను ఆక్రమించుకోవడంతో ‘హింస మళ్లీ మొదలైందం’టూ ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది నదియా.

రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ఆ సమయంలో అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. అప్పుడు నదియా వయసు ఎనిమిదేళ్లు. ఎప్పుడేమవుతుందోనని ప్రతి క్షణం ఒక యుగంలా భయంభయంగా గడుపుతోన్న తన కుటుంబంపై తాలిబన్లు బాంబు దాడి చేశారు. ఈ క్రమంలో నదియా సోదరుడు మరణించాడు. ఆమె అమ్మానాన్నలు మెంటల్‌ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈ దాడిలో నదియాకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రెండేళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్సలు, ఆపరేషన్ల మధ్యే గడపాల్సి వచ్చిందామె.

కుటుంబ పోషణ కోసం వేషం మార్చి..!

అన్నయ్య చనిపోవడంతో కుటుంబ భారం నదియా పైనే పడింది. కానీ ఆడపిల్లలు చదువుకోవడం, పనికెళ్లడం, ఉద్యోగాలు చేయడం.. ఇలా అన్నింటిపై నిషేధం విధించి వారిని ఇంటికే పరిమితం చేశారు తాలిబన్లు. అలాగని ఇంట్లో కూర్చుంటే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలా? అని ఆలోచించింది చిన్నారి నదియా. ఒకే ఒక్క ఐడియాతో ఈ సమస్యలన్నింటికీ స్వస్తి చెప్పాలనుకుంది.. తన అమ్మాయి రూపాన్ని దాచేసి, అబ్బాయిగా వేషం మార్చుకోవాలనుకుంది. ఒకవేళ దొరికిపోతే రిస్క్‌ అని తెలిసినా వెరవకుండా పదకొండేళ్ల వయసులో అబ్బాయిగా వేషం మార్చుకుంది నదియా. అచ్చం తాలిబన్ల డ్రస్సింగ్‌ని పోలి ఉండేలా దుస్తులు ధరించి ఓ మసీదులో పని చేయడానికి వెళ్లేది. వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చేది. ఇలా సుమారు పదేళ్ల పాటు అబ్బాయిగానే మారువేషంలో ఉండిపోయిన ఆమె.. ఇన్ని రోజులు తాను ఆడపిల్లనన్న విషయమే మర్చిపోయానంటోంది.

ఈ పదేళ్లూ ఎన్నో కోల్పోయా!

‘తాలిబన్ల దాడిలో అన్నయ్యను కోల్పోయా. నాన్న మానసికంగా అనారోగ్యం పాలయ్యారు. మరోవైపు.. అమ్మాయిలు గడప దాటకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు.. అంటూ తాలిబన్లు అమ్మాయిలపై ఎన్నో ఆంక్షలు విధించారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత నాపై పడినా ఇలా అన్ని దారులు మూసుకుపోవడంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే మగాడిగా వేషం మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా మంచి రోజులొస్తాయన్న ఆశతో పదేళ్లూ మగాడిగానే జీవించా. ఇన్నాళ్లూ నా సొంత గుర్తింపును కోల్పోయా.. బాల్యంలో ఉండే సరదాల్ని, స్నేహితుల్ని మిస్సయ్యా. ఇక దాడిలో నాకైన గాయాలకు చికిత్స చేసే క్రమంలో ఎన్నోసార్లు చచ్చిబతికాననిపించేది. కానీ ఇప్పుడు నా కుటుంబం కోసం, నాలాంటి బాధితుల ముఖాల్లో నవ్వులు పూయించడమే నా ఆశయంగా మార్చుకున్నా..’ అంటూ తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది నదియా.

స్పెయిన్‌కు శరణార్థిగా..!

ఈ పదేళ్లు అబ్బాయిగా తన సొంత గడ్డపై ఎన్నో కష్టాలు పడ్డ నదియా.. యవ్వనంలోకి ప్రవేశించాక ఆ వేషంలో కొనసాగలేకపోయింది. ఇక అక్కడే ఉంటే కుటుంబ పోషణ కష్టమవుతుందని భావించిన ఆమె.. అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్పెయిన్‌ వెళ్లిపోయింది. ఈ ఎన్జీవో సహకారంతోనే స్పెయిన్‌లోని క్యాటలోనియాలో ‘Facial Reconstructive Surgery’ చేయించుకుంది. ఇక ఎప్పుడైతే తన బాల్యం, పదేళ్ల పాటు మారువేషంలో తానెదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని ‘ది సీక్రెట్‌ ఆఫ్‌ మై టర్బన్‌’ అనే పుస్తకం రూపంలో తీసుకొచ్చిందో అప్పుడే నదియా గురించి ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు.. ఈ పుస్తకం ‘Prudenci Bertrana’ అవార్డును కూడా గెలుచుకుంది. ప్రస్తుతం క్యాటలోనియాలోనే నివాసముంటోన్న ఆమె.. ఇక్కడ శరణార్థినే అయినా తనకెంతో స్వేచ్ఛ దొరికిందని చెబుతోంది.

నాకు నచ్చిన పనులే చేస్తున్నా!

‘స్వేచ్ఛ లేని నా సొంత గడ్డపై జీవించడం దినదిన గండంగా అనిపించేది.. పీల్చుకునే ఊపిరి కూడా ఎవరో ఇచ్చిందే అన్న భావన కలిగేది. కానీ స్పెయిన్‌లో అందుకు పూర్తి భిన్నమైన జీవితం గడుపుతున్నా. ఇక్కడికొచ్చాకే చదువుకోవాలన్న ఆశ కలిగింది. ఈ క్రమంలోనే సోషల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశా. ఇక ఎవరి తోడు లేకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లగలను.. సొంతంగా డ్రైవింగ్‌ చేయగలను.. నాకు నచ్చినట్లుగా నేను బతకగలను.. అన్న భరోసా నాకు కల్పించిందీ దేశం..’ అంటోంది నదియా.

శరణార్థుల కోసం..!

2016లో ‘Bridges for Peace’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన నదియా.. ఈ వేదికగా క్యాటలోనియాలోని శరణార్థులకు భాషా కోర్సుల్ని నేర్పిస్తోంది. అంతేకాదు.. అఫ్గాన్‌లోని పిల్లలకు పాఠ్యాంశాలకు సంబంధించిన మెటీరియల్‌ని సైతం అందిస్తోంది. ఇలా ప్రస్తుతం శరణార్థుల ఏకీకరణకు నడుం బిగించిన ఆమె.. రచయిత్రిగానూ తనని తాను నిరూపించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘టేల్స్‌ దట్ హీల్డ్ మి’, ‘ది ఫస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది నైట్‌’.. వంటి పుస్తకాలు రాసింది. ఆమె జీవితంపై కార్లెస్‌ ఫెర్నాండెజ్‌ అనే దర్శకుడు ‘నదియా’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీలోనూ భాగమైందామె.

దయచేసి ఎవరూ ఆయుధాలు పంపకండి!

తాలిబన్లు తిరిగి అఫ్గాన్‌ను ఆక్రమించడంతో అక్కడే నివసిస్తోన్న తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతోందామె. ఈ నేపథ్యంలోనే ‘నా దేశంలో మళ్లీ తాలిబన్ల అరాచక పాలన ప్రారంభమైంది. ప్రస్తుతం నా కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. గత చేదు జ్ఞాపకాలు, వాటి తాలూకు భయాలు వెంటాడుతున్నాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ వెలుగు (స్వేచ్ఛ)లో గడిపిన నా దేశ ప్రజల జీవితాలు తిరిగి చీకట్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ ఇప్పటికీ పేదరికం ఉన్నప్పటికీ అసలు సమస్య అది కాదు.. స్వేచ్ఛ, శాంతి, రక్షణ కోల్పోవడమే అసలైన పేదరికం.. అదే అతి పెద్ద సమస్య. అందుకే అఫ్గాన్‌ను ఆదుకోవడానికి దేశాలన్నీ ఏకమవ్వాలి.. దయచేసి ఎవరూ అఫ్గాన్‌కు ఆయుధాలను పంపించద్దు. అవి ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలు తీస్తాయి. అలాంటి రక్తపు మరకకు నేను, నా కుటుంబమే ప్రత్యక్ష సాక్షి. ఇక ఆఖరుగా ప్రపంచ దేశాలను నేను కోరేది ఒక్కటే.. అఫ్గాన్‌ శరణార్థుల్ని అక్కున చేర్చుకోండి. వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మానసికంగా వారికి అండగా నిలవండి.. పరోక్షంగా వారి అభివృద్ధికి సహాయపడండి..’ అంటూ ఓ సందర్భంలో భాగంగా తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చింది నదియా.

ప్రస్తుతం తాను ఏ కలంతోనైతే తాలిబన్ల దుశ్చర్యలను, అఫ్గాన్‌ ప్రజల వెతల్ని ప్రపంచానికి చాటుతోందో.. ఆ కలమే ఎప్పటికైనా తాలిబన్ల అరాచకాలకు చరమగీతం పాడుతుందని బలంగా నమ్ముతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్