కేరళ నుంచి ఖతార్‌కు.. కార్లో.. ఒంటరిగా..!

ఒకప్పుడు పురుషుల సహకారం లేనిదే మహిళలు ప్రయాణాలు చేసేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. మహిళలు ఒంటరిగా విదేశీ యాత్రలు కూడా చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఒంటరిగా సాహసయాత్రలు చేస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు. కేరళకు చెందిన నజీరా (33) ఈ జాబితాలో ముందు వరుసలో....

Updated : 07 Dec 2022 14:53 IST

(Photos: Instagram)

ఒకప్పుడు పురుషుల సహకారం లేనిదే మహిళలు ప్రయాణాలు చేసేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. మహిళలు ఒంటరిగా విదేశీ యాత్రలు కూడా చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఒంటరిగా సాహసయాత్రలు చేస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు. కేరళకు చెందిన నజీరా (33) ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. ఐదుగురు పిల్లల తల్లైనా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను ఐదు రోజుల్లోనే పూర్తి చేసింది. తాజాగా తన అభిమాన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ ఆడే మ్యాచ్‌ను చూడడం కోసం.. తన పిల్లలతో కలిసి సొంత వాహనంలో కేరళ నుంచి ఖతార్‌కు దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మహిళలు ఒంటరిగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని నిరూపిస్తోంది. ఆ విశేషాలు మీకోసం...

కేరళకు చెందిన నజీరా పూర్తి పేరు నజీరా నౌషద్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నజీరాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌ అంటే మక్కువ. ఎప్పుడైనా బస్సులో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు సంబరపడేది. అయితే ట్రావెలింగ్‌ అంటే ఇష్టం ఉన్నా తనకు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా వచ్చేది కాదు. పాఠశాలలో కూడా విహారయాత్రలు ఉండేవి కావు. దాంతో అప్పుడప్పుడు కుటుంబంతో చేసే ప్రయాణాలను ఆస్వాదించేది. నజీరాకు 18 సంవత్సరాల వయసులో పెళ్లైంది. ఆమె ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాలం గడిచినా నజీరాకు ట్రావెలింగ్‌పై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఆ అభిరుచి మరింత పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్‌ బ్లాగర్‌గా మారాలనుకుంది. తన భర్త కూడా ఇందుకు సహకరించడంతో ట్రావెల్‌ బ్లాగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఐదు రోజుల్లో బేస్ క్యాంప్‌ పైకి...

ట్రావెల్‌ బ్లాగర్‌గా నజీరా తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాలనుకుంది. ఈ క్రమంలో తనలాగే ట్రావెలింగ్‌ చేసే ఒక స్నేహితురాలితో కలిసి కేరళ నుంచి లద్దాఖ్‌ వరకు వెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే వీరిద్దరూ 60 రోజుల్లోనే తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, వారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటూ 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేశారు. నజీరా వీటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమెకు దాదాపు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. తన మొదటి యాత్ర విజయవంతం కావడంతో నజీరా మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సారి ‘హిచ్‌హైకింగ్’ ద్వారా ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంది. ఈ క్రమంలో ‘ఒంటరి మహిళా ప్రయాణికులకు మనదేశం సురక్షితమైనది.. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు’ అని ప్రపంచానికి చాటాలనుకుంది. అలా హిచ్‌హైకింగ్ ద్వారా కేరళ నుంచి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరాలనుకుంది. హిచ్‌హైకింగ్‌ అంటే లిఫ్ట్‌ అడుగుతూ వివిధ ప్రాంతాల్లో పర్యటించడం. అలా నజీరా 50 రోజుల పాటు ఒంటరిగా కేరళ నుంచి లుల్కా వరకు ప్రయాణించింది. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకోవాలంటే లుల్కా నుంచి ట్రెక్కింగ్‌ చేయాలి. అయితే దీనికి సాధారణంగా 8 రోజుల సమయం పడుతుంది. కానీ, నజీరా కేవలం ఐదు రోజుల్లోనే బేస్‌ క్యాంప్‌కు చేరుకుంది.

ఈసారి ఫిఫా వరల్డ్‌ కప్‌కు...

నజీరాకు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ జరుగుతుండడంతో మెస్సీని చూడడానికి ఖతార్‌ వెళ్లాలనుకుంది. సాధారణంగా ఖతార్‌ వెళ్లాలంటే విమాన ప్రయాణం చేస్తుంటారు. కానీ, నజీరా మాత్రం కారులో ఒంటరిగా వెళ్లాలని భావించింది. ఇందుకోసం తన ఎస్‌యూవీ వాహనాన్ని విహారయాత్రకు అనుగుణంగా మార్చుకుంది. దీనికి ‘ఒలు’ అని పేరు కూడా పెట్టుకుంది. ఒలు అంటే స్థానిక భాషలో మహిళ అని అర్థం. అలా తన ఐదుగురి పిల్లలతో కేరళలోని కన్నూరు నుంచి ముంబయి వరకు తన వాహనంలో ప్రయాణించింది. ఆ తర్వాత షిప్‌లో ఒమన్‌కు చేరుకుంది. ఆ తర్వాత గల్ఫ్‌ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, కువైట్‌, సౌదీ అరేబియా దేశాల మీదుగా ఖతార్‌ చేరుకుంది. ఇలా ఆమె దాదాపు 3 వేల కిలోమీటర్లు ఒంటరిగా పిల్లలతో ప్రయాణించి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా అర్జెంటీనా మ్యాచ్‌ను చూస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ప్రయాణంలో నజీరా తనకు కావాల్సిన ఆహారాన్ని తనే సొంతంగా తయారు చేసుకుంది. వీటికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది. ఈక్రమంలో సమాజంలో ఉండే మూసధోరణులను బద్దలుకొట్టి లక్ష్యాలను చేరుకోవాలని తోటి మహిళలకు సూచిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్