ఈ అమ్మాయి స్పీచ్‌కు పార్లమెంట్ దద్దరిల్లింది!

‘మీ కోసమే జీవిస్తా.. మీ కోసమే మరణిస్తా..’ అంటూ తనను ఎన్నుకున్న ప్రజలనుద్దేశించి తాజాగా ఓ 21 ఏళ్ల అమ్మాయి చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 06 Jan 2024 20:49 IST

(Photos: Instagram)

‘మీ కోసమే జీవిస్తా.. మీ కోసమే మరణిస్తా..’ అంటూ తనను ఎన్నుకున్న ప్రజలనుద్దేశించి తాజాగా ఓ 21 ఏళ్ల అమ్మాయి చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ నాయకులంటే చేసిన వాగ్దానాల్ని మర్చిపోయే వారు కాదని.. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించడానికి సిద్ధపడతారంటూ గాంభీర్యంతో ఆమె చేసిన ప్రసంగానికి పార్లమెంటే దద్దరిల్లింది. ఆ యువ గొంతుక మరెవరిదో కాదు.. న్యూజిలాండ్‌ ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ది. గతేడాది అక్టోబర్‌లో ఎంపీగా ఎన్నికైన ఆమె.. 170 ఏళ్ల ఆ దేశ పార్లమెంట్‌ చరిత్రలోనే ఎంపీగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. ఇక తాజాగా తన ప్రసంగంతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న ఈ యువ రాజకీయ నాయకురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మావోరీ పార్టీకి చెందిన 21 ఏళ్ల హనా ‘Hauraki Waikato’ అనే నియోజక వర్గం నుంచి పోటీ పడి గెలిచింది. తద్వారా 170 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఎంపీగా అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్ల 7 నెలలు. ఈ క్రమంలో 2008 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత, సీనియర్‌ అయిన జేమ్స్‌ స్టూవర్ట్‌పై హనా విజయం సాధించడం విశేషం.

చావైనా, బతుకైనా.. మీకోసమే!

ఎంపీ అయ్యాక తాజాగా తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది హనా. తెలుపు-ఎరుపు రంగులు కలగలిసిన సూట్‌లో హుందాగా ముస్తాబై పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ఆమె.. తన ప్రజలనుద్దేశించి ప్రసంగించింది. అక్కడి మావోరీ తెగకు చెందిన ఆమె.. ఆ తెగ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల్ని అందరి ముందుంచింది. తన ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న విధివిధానాలను ఖండిస్తూనే ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించిందామె.

‘ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజుల్లోనే నా ప్రాంత ప్రజలపై ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టింది. ఇక్కడి ప్రజల ఆరోగ్యం, ఈ ప్రాంత పర్యావరణం, నీరు, భూమి, ఇతర సహజ వనరుల పైనా దాడి చేస్తోంది. వీటన్నింటిపై మనందరికీ సమాన హక్కుంది.. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యతా మనపై ఉంది. నాపై నమ్మకముంచి నాకు ఓటు వేసి గెలిపించిన ‘Hauraki Waikato’ ప్రాంత ప్రజల సేవ కోసమే నేనిక్కడున్నా. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ఈ పార్లమెంట్‌ నాలుగ్గోడల మధ్య నేను చావడానికైనా సిద్ధం.. అలాగే బయట మీకోసం బతకడానికీ సిద్ధంగానే ఉన్నా. ప్రతిపక్షాలు నాపై ఎదురుదాడికి దిగచ్చు.. కానీ వాళ్లను మీపై దాడి చేయనివ్వను. ఇది ఆరంభం మాత్రమే! ఇక నుంచి ప్రతిసారీ మీ గొంతుకనై ప్రతిధ్వనిస్తా.. ఇదే పోరాట స్ఫూర్తితో రాబోయే మూడేళ్లలో నా ప్రాంత స్థితిగతుల్ని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సానుకూలంగా మార్చేస్తా..’ అంటూ తన మాతృభాష మావోరీలో పార్లమెంట్‌ దిక్కులు పిక్కటిల్లేలా, చేతులతో సంజ్ఞలు చేస్తూ గంభీరంగా మాట్లాడింది హనా. ఇలా తన ప్రసంగానికి ప్రతిపక్షాలే నోరెళ్లబెట్టాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం హనా చేసిన ఈ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో యువ నేతగా మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందీ యంగ్‌ పొలిటీషియన్.

రాజకీయం.. తన రక్తంలోనే ఉంది!

హనాది ఆక్లాండ్‌, హామిల్టన్‌ నగరాల మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న ఊరు. అక్కడి మావోరీ తెగకు చెందిన ఆమె కుటుంబంలో తాతముత్తాతలంతా రాజకీయ నాయకులుగా, సామాజిక కార్యకర్తలుగా పనిచేసిన వారే. తమ రాజకీయ చతురతతో మావోరీ తెగను అభివృద్ధి చేసిన వారే! ఆ ప్రజా సేవ లక్షణాలే హనాకూ అబ్బాయి. అక్కడి ‘Rakumanga University’లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఆమె.. తన 17 ఏళ్ల వయసులో ‘మాహినా’ పేరుతో ఓ పుస్తకం రాసింది. మావోరీ చంద్రమాన క్యాలెండర్‌కు సంబంధించిన పుస్తకమది. ప్రస్తుతం ‘మావోరీ కమ్యూనిటీ గార్డెన్‌’ పేరుతో ఓ ఉద్యానవనాన్ని నడుపుతోన్న ఆమె.. ఈ వేదికగా అక్కడి పిల్లలకు గార్డెనింగ్‌ పాఠాలు నేర్పుతోంది.. ఈ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలు, వేషభాషల్ని పరిచయం చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ వయసును 16 ఏళ్లకు కుదిస్తూ 2022లో అక్కడి సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. దీనిపై గతేడాది ఆగస్టులో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదిత చట్టానికి హనా తన మద్దతు తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్