Updated : 01/02/2022 19:16 IST

నిర్మలమ్మ బడ్జెట్.. మళ్లీ నాలుగోసారి..!

భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కట్టూ-బొట్టు.. ఆకట్టుకునే ఆహార్యం..

ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని నిరాడంబరత్వం..

ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోయే కలుపుగోలుతనం.. సౌమ్య స్వభావం..

వెరసి మనింట్లో అందరికీ తలలో నాలుకలా ఉండే ఓ పెద్దక్కయ్యలా కనిపిస్తారావిడ!

కేంద్ర బడ్జెట్ గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్న వేళ.. ఇదంతా ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది..! అవును.. ఆవిడే మన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.

మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను చేపట్టారు నిర్మలా సీతారామన్‌. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. ప్రస్తుతం కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు బడ్జెట్‌ను ప్రకటించిన నిర్మలమ్మ.. తాజాగా నాలుగోసారి 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా మూడో ఉద్ధృతి.. జీడీపీ.. ద్రవ్యోల్బణం.. ఇలా అనేక సవాళ్ల మధ్య ఈసారి నిర్మలమ్మ బడ్జెట్‌పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడం సందర్భోచితం.

హస్తినలో కలిశారు!

నిర్మలా సీతారామన్ 1959, ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి. ఇద్దరు ఆడపిల్లల్లో నిర్మల రెండో అమ్మాయి. మద్రాస్, తిరుచిరాపల్లిలో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో 'ఆర్ట్స్' విభాగంలో డిగ్రీ, దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో 'ఎకనామిక్స్' విభాగంలో పీజీ పూర్తిచేశారు. దిల్లీలో చదువుకునేటప్పుడే ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంకు చెందిన పరకాల ప్రభాకర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటికే ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్‌డీ చదువుతోన్న నిర్మల.. పెళ్లి తర్వాత తన భర్తకు 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్'లో స్కాలర్‌షిప్ రావడంతో తనతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. దాంతో ఆమె పీహెచ్‌డీ డిగ్రీకి మధ్యలోనే బ్రేక్ పడింది.

లండన్‌లో ఉన్నప్పుడు అక్కడి రెజెంట్ స్ట్రీట్‌లో ఓ గృహోపకరణాల స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేశారు నిర్మల. ఆ తర్వాత యూకేలోని 'అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్'లో ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు. ఆపై 'ప్రైస్ వాటర్‌హౌస్' సంస్థలో సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. ఆపై 'బీబీసీ వరల్డ్ సర్వీసెస్'లోనూ తనదైన ముద్రవేశారు నిర్మల. ఇక లండన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చాక ఈ దంపతులకు వాజ్ఞ్మయి అనే పాప పుట్టింది.

'ప్రణవ'తో మొదలైంది..!

పుట్టింది సామాన్య కుటుంబంలోనే అయినా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు నిర్మల. అత్తింట్లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఒంటబట్టించుకొని, తన కలుపుగోలుతనంతో మెట్టినింటి వారి మనసు దోచుకున్నారామె. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో 'ప్రణవ' అనే పాఠశాలను స్థాపించారు. ఈ క్రమంలో అటు స్కూల్ బాధ్యతల్ని, ఇటు తల్లిదండ్రులు, అత్తింటి వారి బాధ్యతల్ని సమర్థంగా నెరవేరుస్తూ.. ఉత్తమ కోడలిగా, మంచి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమెలోని ఈ వర్క్-లైఫ్ బ్యాలన్స్, తెలివితేటలే ఆమెకు 'జాతీయ మహిళా కమిషన్'లో స్థానం కల్పించాయని చెప్పుకోవచ్చు.

'మహిళా కమిషన్'లో తనదైన ముద్ర!

'జాతీయ మహిళా కమిషన్'లో సభ్యురాలిగా కొత్త బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న నిర్మల.. అక్కడా తనదైన దూకుడును ప్రదర్శించారు. అప్పట్లో సినిమా పరిశ్రమలోని సాంకేతిక విభాగం (టెక్నికల్ వింగ్)లో మహిళలు ఎదగడానికి అవకాశమే ఉండేది కాదు. అంటే.. సినిమాటోగ్రాఫర్‌గానో, మేకప్ ఆర్టిస్ట్‌గానో, ఎడిటర్‌గానో.. ఇలా వాళ్లు టెక్నికల్ పనులు చేయడానికి వీల్లేదన్నమాట. పురుషులు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటే అతణ్నుంచి సబ్-కాంట్రాక్ట్ తీసుకుని మాత్రమే మహిళలు పనిచేయాలి. అందువల్ల వీళ్లకి సగం పారితోషికం కూడా వచ్చేది కాదు. మహిళలకు సాంకేతిక నిపుణుల సంఘం వారు సభ్యత్వం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దేశం మొత్తం మీద నెలకొన్న ఇలాంటి పరిస్థితిలో కొందరు మహిళలు ఏకమై తమకూ సినీ ఇండస్ట్రీలోని 'టెక్నికల్ వింగ్'లో సభ్యత్వం కావాలంటూ జాతీయ మహిళా కమిషన్ తలుపుతట్టారు. ఆ తలుపుల్ని తెరిచింది నిర్మలే. అప్పుడే దీని అమలు కోసం ప్రత్యేక ప్యానల్ ఏర్పాటుచేశారామె. అయితే ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలోని పెద్దల దగ్గర్నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అవన్నీ ఎదుర్కొని, పట్టుబట్టి మరీ మహిళలకు సభ్యత్వం ఇప్పించేదాకా నిర్మల కంటిమీద కునుకు లేకుండా పనిచేశారు. అలా మహిళా సాధికారతకు కృషి చేస్తూ తొలి విజయాన్ని అందుకున్నారామె.

కేవలం ఇదొక్కటే కాదు.. తాను వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కార్పొరేట్ వర్గాలతో ఎప్పుడు మాట్లాడినా 'బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్'లో స్త్రీల సంఖ్య పెరగాలనే చెబుతుండేవారు. అంతేకాదు.. తన శాఖ కింద ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్లోనూ సమర్థులైన మహిళల్ని గుర్తించి.. వారికి కీలక బాధ్యతలు అప్పగించి తాను మహిళా పక్షపాతిననిపించుకున్నారు నిర్మల.

కార్యకర్త నుంచి ఆర్థిక మంత్రిగా..!

అప్పటికే పలు కీలక పదవుల్లో కొనసాగుతూ తనని తాను నిరూపించుకున్న నిర్మల.. 2008లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సాధారణ కార్యకర్తగా చేరారు. మొదట పార్టీకి అధికార ప్రతినిధిగా సేవలందించిన ఆమె.. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. అదే ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

2017లో అప్పుడు రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ పదవి నిర్మలను వరించింది. అలా ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పనిచేసిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. అంతేకాదు.. రక్షణమంత్రిగా తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో రఫేల్ కుంభకోణంపై ఆరోపణలు వస్తున్న సమయంలో ఆమె చూపిన నేర్పు బీజేపీ అగ్రనాయకత్వాన్ని మెప్పించిందని చెప్పుకోవచ్చు. ఇలా ఆమెలోని తెలివితేటలు, ఎలాంటి సమస్యల్నైనా ఎదుర్కొనే సమర్థత, ఓర్పు.. వంటి లక్షణాలే ఆమెకు మళ్లీ ఆర్థిక మంత్రిగా పదవిని కట్టబెట్టాయని చెప్పుకోవచ్చు.

కేంద్ర ఆర్థిక మంత్రి పదవి చేపట్టిన రెండో మహిళగా, పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలందుకున్న తొలి మహిళగా నిర్మల చరిత్రను తిరగరాశారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు (1969, జులై 17 - 1970, జూన్ 27) దాదాపు ఏడాది పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి.. ఈ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.

నిరాడంబరతకు నిలువెత్తు రూపం!

వికలాంగుల హక్కుల కోసం పోరాడే డాక్టర్ ఐశ్వర్యారావు అనే మహిళ తాము ఉపయోగించే పరికరాలపై జీఎస్‌టీ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలవడానికి ఓసారి ఆయన ఛాంబర్‌లోకి వెళ్లారు. వీల్‌ఛైర్‌లోనే లోపలికి వెళ్లిన ఆమెను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.. కానీ నిర్మల మాత్రం వెంటనే లేచి 'ఇలా రండి' అని ఆమెను తన వద్దకు పిలిచి.. తన సీటు ఖాళీ చేసి ఆమెకిచ్చారు. దాంతో ఆ పక్క సీట్లోనే ఉన్న అరుణ్‌జైట్లీతో మాట్లాడుతూ తన సమస్యల్ని చెప్పుకోగలిగారు ఐశ్వర్య. ఇలా ఒక కేంద్రమంత్రి స్థాయిలో ఉండి కూడా తన నిరాడంబరతను చాటుకున్నారు నిర్మల. ఆ తర్వాత ఐశ్వర్య 'ఓ కేంద్రమంత్రి నుంచి ఇలాంటి నిరాడంబరత నేను వూహించలేదు. ఆమె వల్లే జైట్లీతో ఎక్కువ సేపు మాట్లాడగలిగా..' అంటూ తన బ్లాగులో రాస్తూ నిర్మలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. నిర్మల ప్రజా పక్షపాతి అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ!


ట్రెక్కింగ్ అంటే ఇష్టం!

* అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు, స్త్రీ-పురుష సమానత్వం పాటించే ఇంటి వాతావరణంలో పెరిగిన నిర్మల.. తనకు విశాల దృక్పథం అలవడడానికి బహుశా ఇలాంటి ఇంటి వాతావరణమే కారణమేమో అంటుంటారు.

* ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు ఏ విషయంపైనైనా అవలీలగా మాట్లాడగలిగే నేర్పు నిర్మల సొంతం.

* నిర్మలా సీతారామన్ అత్తింటి వారు కూడా రాజకీయ నాయకులే. ఆమె భర్త పరకాల ప్రభాకర్.. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. నిర్మల అత్తయ్య కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె మామయ్య 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.

* తను ఓ పార్టీ.. భర్త ఓ పార్టీలో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు నిర్మల.

* అటు కుటుంబాన్ని, ఇటు వృత్తినీ బ్యాలన్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే ఈ తెలుగింటి కోడలికి ట్రావెలింగ్, ట్రెక్కింగ్, వంట చేయడం, సంగీతం వినడం అంటే చాలా ఇష్టమట!

* రోజూ ఉదయాన్నే లేచి దాదాపు రెండు గంటల పాటు పేపర్ చదవడానికి కేటాయిస్తారు నిర్మల. ఇక ఏ పనైనా తర్వాతేనట!

* నిర్మల కృష్ణుడి భక్తురాలు. ఆయన పాటలంటే చెవికోసుకుంటారు. ఓసారి ఆమె మైసూర్‌కి వెళ్తే అక్కడి కార్పొరేటర్ ఒకరు ఆమెకి శ్రీకృష్ణుడి దారు శిల్పం బహూకరించబోయారు. కానీ ఒకరి వద్ద నుంచి కానుకలు తీసుకునే అలవాటు లేని ఆమె.. 'ఇలా కానుకలివ్వడం మంచి అలవాటు కాదు.. మానుకోండి..' అని ముక్కుసూటిగా చెప్పారట. విలువలపై అంత నిబద్ధత ఆమెది!

* ఫోర్బ్స్ విడుదల చేసే ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో రెండుసార్లు చోటు దక్కించుకున్నారు నిర్మల.

 

 


స్వదేశీ ట్యాబ్‌తో.. చేనేత చీరలో..!

* మోదీ హయాంలో నిర్మలమ్మ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో కొత్త కొత్త సంప్రదాయాలు తెరపైకి వస్తున్నాయి. అంతకుముందు బడ్జెట్‌ కాపీలను లెదర్‌ సూట్‌కేసులో తీసుకువచ్చేవారు. నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ విదేశీ సంప్రదాయానికి స్వస్తి పలికి.. రాజముద్ర ఉన్న ఎరుపు రంగు పద్దుల సంచీతో కనిపించడం విశేషం. ఇక, కరోనా నేపథ్యంలో- బడ్జెట్‌ను కూడా డిజిటల్‌ రూపంలోకి మార్చారు. రెండేళ్లుగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు నిర్మలమ్మ. ఈసారి నిర్మల స్వదేశీ ట్యాబ్‌లో చూస్తూ బడ్జెట్‌ ప్రసంగం చేశారు.

* స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే నిర్మల ఈసారి బడ్జెట్ సమావేశానికి ఒడిశా చేనేత చీర ధరించి వచ్చారు.

* నారీ శక్తికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో - మహిళా, శిశు సంక్షేమ శాఖను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్షం అంగన్‌వాడీ పోషణ్‌ 2.o వంటి పథకాలతో పాటు ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ వంటివి అందిస్తాం.. వీటి కోసం రూ.౨ లక్షల కోట్ల ఆర్థిక నిధులు కేటాయిస్తాం' అని తెలిపారు నిర్మల.

కార్యదక్షత, సమర్థ నాయకత్వం, తెలివితేటలతో సమస్యల్ని ఎదుర్కొనే నైజం, చక్కటి వాక్చాతుర్యం.. మొదలైనవన్నీ నిర్మలకు పెట్టని ఆభరణాలు. తనదైన ప్రత్యేకతతో, ప్రతిభాపాటవాలతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దడంలో తనదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని